Thursday, February 16, 2012

ఇటీవలి ముందు మాటలు -4

విలోమవ్యవస్థ: అనులోమ కథ"..ఒకప్పుడు వునికిలో వుండిన నిజాన్ని యిప్పుడు అబద్ధంగా ప్రచారం చెయ్యగలం. ప్రజల మనస్సుల్లోంచి నిజాన్ని తుడిచెయ్యగలం. అంతే కాదు. ఆ నిజం ఎన్నటికీ బయటపడకుండా చంపేసి పాతిపెట్టెయ్యగలం. తమాషా ఏమిటంటే, యివాళ ఆ దశను కూడా దాటాం. నిజంతో సంబంధం లేకుండానే ఒక అబద్ధాన్ని స్వతంత్రంగా సృష్టించగలం. అంటే తల్లీతండ్రీ లేకుండానే శిశువును పుట్టించడమన్నమాట. అబద్ధం స్వయంభువు అయిపోయింది.''

"ఉదాహరణకి నేనక 'అబద్ధాన్ని' సృష్టిస్తాను. అదిప్రచారం ద్వారా జనంలోకి వెడుతోంది. జనం అది నిజమని నమ్ముతారు. అది వాళ్ల మనస్సుల్లోకెళ్లి అక్కడ స్థిరపడుతుంది. క్రమంగా దానికి బానిసలైపోతారు. ఆ తర్వాత అదే చరిత్ర వేషం వేసుకుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, జ్ఞానం, విజ్ఞానం అని మనం అనుకునేటటువంటివన్నీ ప్రచార యంత్రం కల్పించినవే. ''          
                                                                                                                                   (ఆకాశదేవర లో కారష్‌)

***


మనుషులకు జ్ఞానం కావాలి. జ్ఞానం సంతృప్తినివ్వని చోట మరేదో దాన్ని భర్తీ చేయాలి. తమ సందేహాలను, సంశయాలను, ఆకాంక్షలను ఏదో ఒక ప్రతీకలోకి ఒంపి, దాన్ని మార్మికం చేసుకోవాలి. హేతువుతో, సమాధానాలతో నిస్సారత  ఆవరించకుండా, ఒక మాంత్రిక వాస్తవికతా కావాలి. తరచి తరచి శోధించే తపనా, ఇది అర్థం కాలేదు లెమ్మన్న నిర్లిప్తతా రెండూ కావాలి. చరిత్రను, వర్తమానాన్నీ, భవితవ్యాన్నీ క్రమంలోనో, అపక్రమంలోనో, సంబంధంలోనో, అసంబంధంలోనో వ్యాఖ్యానించే పురాణాలూ కావాలి.  మనుషుల ఆదిమ అవసరం ఈ రకం సాధనాలు తీరుస్తాయి. ఇవి అజ్ఞానాలు కావు, మరో రకం జ్ఞానాలు. ప్రకృతిశక్తులను మనుషులుగానో దేవతలుగానో సంభావించినా, మనుషుల నిష్ఠలకు పరంపరాగత తంతులకు అతీత శక్తులను ఆపాదించినా- అది బాహ్య ప్రపంచాన్ని మానవుల మనుగడతో సంలీనం చేసే తాత్వికతలు.

ఈ మార్మికతను, మాంత్రికతను, పౌరాణికతను వాటి నిసర్గతనుంచి, ప్రమాదరాహిత్యం నుంచి పెకిలించివేసి, సమాజాలను, ప్రజలను నియంత్రించే సాధనాలుగా వాడుకోవడం కూడా ఏ నాటినుంచో మొదలయింది. సత్యాన్ని అస్పష్టమూ గందరగోళమూ చేయడానికి, జనాన్ని మాయలో పడవేయడానికి, భయపెట్టే, లొంగదీసుకునే ఆయుధాలుగా  ఉపయోగించుకోవడానికి సమష్టి నుంచి విడివడిన పాలకులు, పూజారులు, వారి భృత్యులు ప్రయత్నించి తరచు సఫలవుతూనే ఉన్నారు.  ధనానికి, అధికారస్థానాలకు, మార్కెట్‌కు, సరుకులకు, వక్రీకరించిన జ్ఞానానికి ఒక కాంతిపరివేషాన్ని కల్పించి, ప్రజల్ని మైమరిపిస్తూనే ఉన్నారు.

జనచేతనలో ఏదో ఒక పునాది ఉన్న మాయను అపహరించి, తమ పెరట్లో కట్టేసుకోవడం వేరు. ఏ పునాదీ లేని, వాస్తవలేశమూ లేని మాయను సృష్టించడం వేరు. ఇప్పుడు కాలం అటువంటి అబద్ధాల సృష్టికి
అనువుగా మారినట్టుంది.  దేవతావస్త్రాల వాస్తవికత ప్రపంచమంతా అలుముకున్నట్టుంది.  స్థానికంగా, దేశీయంగా ఎక్కడికక్కడ ఏర్పడిన చిన్న చిన్న మాయలను తోసిరాజని  ఒక గ్లోబల్‌ మాయ వ్యాపించినట్టుంది. ఆ  మాయ పేరు భారతీయభాషలో అభివృద్ధి కావచ్చు. అమెరికన్‌ మాండలికంలో స్వేచ్ఛ కావచ్చు,  అంతర్జాతీయ ఉగ్రవాదం కావచ్చు,  మొత్తంగా ప్రపంచీకరణ కావచ్చు.

ఈ మాయ గురించే కావచ్చు, నగ్నముని 'ఆకాశదేవర' కథ రాశారు. ఏమీ లేని శూన్యం నుంచి ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించడం, ఆ  శూన్యాన్ని లోకం ఆరాధించడమూ నగ్నమునికి కలవరం కలిగించాయి, ఆగ్రహం తెప్పించాయి. ఎవరు ఎవరిచేత ఏ పనిచేయిస్తున్నారో ఎవరికీ తెలియని నెట్‌వర్క్‌ ఒకటి పరిణామాలను నడిపిస్తున్నదని ఆయన సరిగ్గా కనిపెట్టారు. జనాలను మోసపుచ్చే మాయను కల్పించే చట్రాన్ని, అందులోని సూత్రధారుల చుట్టూ ఉండే అత్యాధునిక మార్మికతను కూడా ఆయన గుర్తించారు.

కారష్‌ ఈ కథలోని నాయకుడు. కాదు, ప్రతినాయకుడు. అతను మూడు పదులునిండని వాడే. కానీ, కళ్లు మిరుమిట్లు గొలిపే సంపన్నుడు. అతనికి అనేక ఇళ్లు. అనేక ఆఫీసులు. అయా మనస్థితులకు అనుగుణమైన పానీయాలను, సౌఖ్యాలను అతను సేవిస్తాడు. అతని గురించి అతని వ్యక్తిగత ఉద్యోగికి కూడా తెలియదు. అతనొక రాజప్రాసాదం వంటి హోటల్‌లో ఒక సూట్‌లో ఉన్న పర్సనల్‌ కార్యాలయంలో ఉండగా కథ మొదలవుతుంది. ఆకాశదేవర- అనే  పేరుతో జనంలో వేలం వెర్రిగా ఉన్న ఒక ప్రాచీన దేవాలయం గురించి పరిశోధించిన  ఒక పురాతత్వ శాస్త్రవేత్త కారష్‌ను కలిసి తన పుస్తకాన్ని ఇవ్వడానికి వస్తాడు. పుస్తకాన్ని తీసుకుని, అతన్ని కలవకుండానే పంపిస్తాడు కారష్‌. తీరిగ్గా కూర్చుని, ఎర్రద్రాక్ష పండు వేసిన గ్లాసులో మద్యాన్ని సేవిస్తూ, 'ఆకాశదేవర' పుస్తకాన్ని అతను చదువుతాడు. చదివి, తన సన్నిహిత మిత్రుడు సత్యానంద్‌కు ఫోన్‌ చేసి పిలిపించుకుంటాడు. అతను వచ్చాక, కాసేపు పెళ్లి గురించి చర్చిస్తాడు. ఆ చర్చ సమాజం మీదికి, వ్యవస్థ తీరుతెన్నుల మీదికి వెడుతుంది.  పునాదిలేని అబద్దాల సృష్టి గురించి అతనే చెబుతాడు. 'ఆకాశదేవర' వెనుక అసలు రహస్యం చెబుతాడు. కారష్‌ దృక్పథాన్ని, నిర్దాక్షిణ్యమైన వృత్తి చర్యలను తెలుసుకుని సత్యానంద్‌ షాక్‌ తింటాడు.

కథాగమనం సూటిగానే ఉన్నది. మార్మికత చుట్టూ వస్తువు పరిభ్రమించినా కథనం స్పష్టంగానే ఉన్నది. ఒకే ఒక సన్నివేశం, కారష్‌ 'ఆకాశదేవర' పుస్తకాన్ని చదువుతున్నప్పుడే, ఫ్లాష్‌బ్యాక్‌గా ఆ దేవాలయం గురించిన పూర్వాపరాలు రచయిత కథనం చేశారు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌, మిత్రుడితో కారుష్‌సంభాషణ కలిసి కథ.  అయితే, కథలోకి పాఠకుడిని నెమ్మదిగా దింపే క్రమంలో నగ్నముని ఒక ప్రత్యేక కథనశైలిని అనుసరించారు. కథానాయకుడిని మార్మికత, నిగూఢత కలిగిన పాత్రగా పాఠకుడు అవగాహన చేసుకోవడానికి ఆ శైలి  ఉపకరించింది. అతని గురించి ఎవరికీ తెలియదు, తెలిస్తే ఒక్క మిత్రుడు సత్యానంద్‌కు మాత్రమే తెలిసే అవకాశమున్నది- అని పదే పదే చెప్పడం వల్ల సత్యానంద్‌ పాత్రమీద ఉత్సుకత కలుగుతుంది. చివరకు సత్యానంద్‌కు కూడా తెలిసింది తక్కువేనని తెలుస్తుంది.

మనుషులు దూరని కారడవిలోపల ఒక కొండమీది 'ఆకాశదేవర' దేవాలయం గురించిన చిత్రణ గంభీరంగా ఉంటుంది. అతి పురాతనమైన దేవాలయంగా కనిపించే రెండుగదుల నిర్మాణంలో నిజానికి ఏ దేవతాప్రతిమా ఉండదు. రెండూ రెండు శూన్యమందిరాలు.  ఆ రెంటి శూన్యతలను ఒకటి బాహ్యశూన్యత, రెండోది ఆంతరిక శూన్యత అని రచయిత సూచిస్తాడు.  శూన్యంగా ఉన్న గదులే, ఒక చరిత్రకల్పన కారణంగా, ఆ ప్రదేశానికి ఏర్పడిన హంగులూ ప్రచారం కారణంగా- ప్రజలను ఆకర్షిస్తాయి. వాటిని సందర్శించినవారికి ఏదో తాత్వికమైన అనుభూతులను కలిగిస్తాయి. మొదటి గదిదాకా వచ్చిన భక్తులు రెండోగదిలోని మహాశూన్యంలోకి కానుకలను విసిరివేస్తారు. పెద్దసంఖ్యలో భక్తులు, పెద్దమొత్తంలో కానుకలు వచ్చేస్థలంగా, పెద్ద వ్యాపార కేంద్రంగా ఆ స్థలం అభివృద్ధి చెందుతుంది. దాని మీద పురాతత్వ పరిశోధకులు కూడా పరిశోధనలు చేస్తారు.

శూన్యం అంటే అస్తిత్వపు రాహిత్యంకాదు, రాహిత్యపు అస్తిత్వం- అన్నాడట గౌతమ బుద్ధుడు. ఇక్కడ నగ్నముని  చెప్పిన శూన్యత శంకరుడి మాయావాదానికి ప్రేరణ ఇచ్చిన బౌద్ధశూన్యవాదంలోని శూన్యత కాదు.  ఇక్కడి శూన్యం నిజంగా శూన్యమే. వుట్టి డొల్లతనం. అబద్ధానికి వేదిక అయిన డొల్లతనం. మనుషులను తాత్వికతగా భ్రమింపజేసే, ఆధ్యాత్మికతగా అలరింపజేసే ప్రతీకను  ఈ కథలో సృష్టించింది మాత్రం విలాస భరితమైన అమానుష జీవితం గడిపే అసత్యాల వ్యాపారి!  ఆ వ్యాపారికి వ్యవస్థ లోగుట్టులన్నీ తెలుసు. వ్యవస్థాగత క్రీడను దాని నియమాలతోనే ఆడే ఆటగాడు అతను. తనకీ ఒక విషాదనేపథ్యం ఉంటుంది. నిజాయితీకి మూల్యం చెల్లించిన తండ్రి జ్ఞాపకాలు అతనిలో వ్యవస్థపై కసిని పెంచుతాయి. సంస్కరించే దశ దాటిపోయిన వ్యవస్థను పూర్తిగా కుళ్లిపోనిస్తేనే, చికిత్స సాధ్యమని అతనికో సిద్ధాంతం కూడా ఉంటుంది.  విలన్‌ నోటివెంటనే వ్యవస్థరహస్యాలు కక్కిస్తున్న తీరు చూస్తుంటే, రావిశాస్త్రి ధోరణి లీలగా స్ఫురిస్తుంది.

ఇంతకూ ఈ కథాప్రతినాయకుడు ఏమి చేస్తాడు? అతను ఎటువంటి వ్యాపారి? వస్తువులు ఉత్పత్తి చేస్తాడా? మారుబేరాలకు అమ్ముతాడా? డబ్బునుంచి డబ్బును పుట్టిస్తాడా? కాదు. ఇక్కడే రచయిత అవగాహన పాఠకులకు విశేషంగా అనిపిస్తుంది. కారుష్‌ ఒక కన్సల్టంట్‌. కార్పొరేట్‌ ప్రపంచానికి సలహాలు విక్రయించే నిపుణుడు. పిట్ట నేలమీదో అడవిలోనో రెట్టవేసినప్పుడు ఒక మర్రిచెట్టో చందనపు వృక్షమో మొలవ్వొచ్చు, కానీ, మనిషి మెదడు మీద రెట్టవేసినప్పుడు అది కార్నివోరస్‌ మానవుణ్ణి సృష్టిస్తుంది. మనుషుల్లో ఈ నరమాంసభక్షకుల్ని గుర్తించడం కష్టం. విషవృక్షాలను మెదళ్లలో మోసుకుతిరిగే మనుషుల్లో కారష్‌  ఒకడు. అందుకే అతను కారష్‌ కాదు, కాపురుష్‌ ఏమో అని సత్యానంద్‌కు అనుమానం వస్తుంది. అతను తన విషమేధను కోట్ల సొమ్ముకు అమ్ముకుంటాడు. వ్యవస్థకు అవసరమైన మార్మిక తాత్వికతలను సృష్టిస్తూ ఉంటాడు. 'ఆకాశదేవర' అతనికి సొమ్ములు సంపాదించేదే కాదు, మనుషుల్ని అబద్ధాలకు కట్టివేసి తన వ్యాపారాన్ని సానుకూలం చేసే వ్యవస్థ. ప్రపంచీకరణ యుగంలో ప్రభుత్వాలకు, వ్యాపారులకు వ్యూహరచనలు చేసే పెట్టే కన్సల్టంట్‌లు చేసే పనే అది. ఈ కన్సల్టంట్‌లు వర్తమానాన్నే కాదు, చరిత్రను కూడా రచించగలరు, భవిష్యత్‌కు బాటలూ వేయగలరు. వారి చాణక్యం కేవలం మేధాపరమైన వ్యాపారంగా కనిపించవచ్చును కానీ, అందులో తెగే తలలు, పారే నెత్తురూ చాలానే ఉంటుంది. విస్కీ గ్లాసులో ఆవిరిలో ఉడికిన చికెన్‌ముక్క ఉన్నదంటే, కారష్‌ ఆ రోజు నెత్తురు కళ్లచూశాడన్నమాటే!

***

వ్యవస్థలోని అసంబద్ధతను, విలోమతను రాయాలని నగ్నముని ఈ కథలో ప్రయత్నించలేదు. మన సమాజం తీరుతెన్నులను దాని మాయలతో సహా అమాయకంగా కథనం చేశారు. కారష్‌లాంటి వాళ్లు మన చుట్టూ, దేశంచుట్టూ, ప్రపంచమంతటా కోకొల్లలు. సామాజికార్థిక పునాదులను ప్రాతిపదికగా చేసుకుని కథనం చేసే ధోరణి కంటె, ఆ పునాదులనుంచి పుట్టిన విషపురుగులను, అవలక్షణాలను, వైపరీత్యాలను, నిస్సహాయతలను లక్ష్యంగా పెట్టుకుని కథలు రాయడం నగ్నముని ధోరణి. మనిషి మెదడులో మకాం వేసే విషపురుగులపై ఆయన గురి. ఆకాశదేవర ను నిర్మించిన పూజారులూ శిల్పాచార్యులూ సరే, వారంతా కారష్‌ మనుషులు, పురాతత్వవేత్త అయిన ఈశ్వరశర్మ దాన్నొక చరిత్రగా స్థిరపరుస్తూ పుస్తకం రాయడం- మేధారంగంలోని అమాయకపు డొల్లతనాన్ని తెలియజేస్తుంది. నిజానికి ఆకాశదేవర గుడిలో ఎంత శూన్యమున్నదో, ఈశ్వరశర్మలోనూ అంతే శూన్యమున్నది. కారష్‌లోని చీకటికోణం తెలియని సత్యానంద్‌లోనూ అంతే శూన్యమున్నది.

విలోమకథలు రాసినప్పుడు- " ఈ దేశంలో మనుషులు మనుషులుగా బతకడం లేదని, రాజకీయనాయక జీవిత విశ్వాసాలు విలువలు తలకిందులుగా నడుస్తున్నాయని'' నగ్నముని కోపించాడు. ఈ కథ రాసేనాటికి, వ్యవస్థే తలకిందులుగా మారిపోయి, మనుషులు దాన్ని సత్యమని భ్రమించే పరిస్థితి  ఏర్పడింది. అందుకే, పాఠకులకు నిగూఢవాతావరణ స్ప­ృహ కల్పించిన కథనంలో, మార్మికతను, ఉత్కంఠను నిర్మించిన భాషాశైలిలో తప్ప రచయిత ఇందులో ప్రయోగశీలత చూపించకపోయినా, కథ విలోమవాస్తవికతనే ప్రతిఫలించింది.  ఆకాశదేవర చుట్టూ ఉన్న మార్మికత, మనం జీవిస్తున్న వ్యవస్థకు మనం అందిస్తున్న ఆమోదమే!


                                              (నగ్నముని 2011 లో రాసిన పెద్ద కథ 'ఆకాశ దేవర' పుస్తక రూపంలో వెలువడింది. దానికి రాసిన ముందుమాట)No comments:

Post a Comment