Thursday, January 5, 2012

ఇటీవలి ముందుమాటలు-2

 పిదప కాలపు పిట్ట కథలు 

పాతూరి పూర్ణచంద్రరావు అంటే ఎవరో మనకేమి తెలుసు?  కానీ, ఆయన వాళ్ల నాలుగో అమ్మాయి కి  జాజి అనే ముద్దుపేరు పెట్టి, ఆ పేరుని విడమరిచి కూడా  చెప్పారని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. జాబిలి వంటి చల్లదనమూ  జిలేబి వంటి తియ్యదనమూ కలిసి జాజి అయిందట.  ఆ జాజి అలియాస్‌ మల్లీశ్వరి రాసిన ఈ జాజిమల్లి కథలు చల్లగా తియ్యగా మాత్రమే  ఉంటాయని అనుకుంటే కొంచెమేమిటి చాలానే పొరపాటు.  చేదుగా, కారంగా, పుల్లగా, వగరుగా, కోపంగా, నిర్దాక్షిణ్యంగా, నిక్కచ్చిగా, ధైర్యంగా - ఎట్లా అయినా ఉన్నాయేమో కానీ, ఈ కథలు సుకుమారంగానో మృదువుగానో మధురంగానో మాత్రం లేవు. జీవితంలాగా,ముఖ్యంగా ఈ పిదపకాలపు జీవితంలాగా కన్నీటిపర్యంతంగా, వికటాట్టహాసంగా ఉన్నాయి. ఈ కథలలోని జీవన సారాంశాన్ని, విషాద తాత్పర్యాన్ని గ్రహించడం మాత్రం అంత సులువు కాదు. అనేక సౌందర్యభరిత వాక్యాలు, ఉద్వేగ వ్యక్తీకరణలు  కలిగించే విభ్రమను, పారవశ్యాన్ని తప్పించుకుంటూ పాఠకులు బీభత్ససత్యాస్వాదన చేయాలి.


పూర్ణచంద్రరావుతో పాటు, అనూరాధ, నాగవల్లి, పుష్పవల్లి, విజయలక్ష్మి, నాయనమ్మ, బామ్మ, తులమ్మ, చంద్రమౌళి, బేగం, హెప్సిబా, కర్రి లచ్చమ్మ, ఆనంద్‌వాళ్ల అమ్మ, రిక్షారంగదాసు, చాకలి దాలమ్మ, పద్దయ్య, బూబమ్మ, రాజేశ్వరి, వీరయ్య... ఇటువంటి పేర్లెన్నో ఈ కథల్లో మనకుతారసపడతాయి. కానీ  ఇవి పేర్లో పాత్రలో  కాదు. జీవిస్తున్న మనుషులు. రచయిత జీవితంలోని మనుషులు. కానీ, కథలను చదివిన తరువాత వాళ్లు మన జీవితంలోని మన మనుషులతో కలసిపోతారు. నామవాచకాలు కాస్తా సర్వనామాలైపోతాయి. వారితో ముడిపడిన అనుభవాలన్నీ మన అనుభవాలు అవుతాయి.  చివరకు ఇదంతా మనకు తెలిసిందే లెమ్మని నిర్లిప్తత కలుగుతుంది. తెలిసిందాన్ని ఇట్లా చూడవచ్చునా అన్న ఆశ్చర్యం కలుగుతుంది.


అప్పుడిక అసలు సంశయం ముందుకువస్తుంది. ఇంతకీ వీటిని కథలనవచ్చునా? నిర్వచనాలకు ఈ రచనలు ఒదుగుతాయా? మ్యూజింగ్స్‌లాగా ఉన్నట్టు అనిపిస్తోందే, గల్పికలంటూ వచ్చేవి, ఇవి అవి కాదా, మినీకథలో, కార్డుకథలో, పొట్టికథలో మునుపు ఉన్నవే కదా, వెబ్‌సాహిత్యంలో ఫ్లాష్‌ఫిక్షన్‌ నానో ఫిక్షన్‌ సడన్‌ఫిక్షన్‌ అంటూ ఏవేవో వస్తున్నాయి ఆ కోవలోవా?- ఇట్లా అనేక ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయి. ప్రక్రియాచర్చలోకి వెడితే దారితప్పే ప్రమాదం ఉంటుంది కానీ, వీటికంటూ ఒక పేరు  ఉండాలి కదా?  కొసమెరుపుతో ఒక సన్నివేశాన్ని రచిస్తే అది గల్పిక అన్నారు, వ్యంగ్యమో హాస్యమో ఉండాలన్నారు, నీతికూడా చెప్పాలన్నారు. కొడవటిగంటి కుటుంబరావు
రాజకీయ సందేశాన్ని, సమాజవాస్తవికతను బలంగా చెప్పడానికి కొన్ని గల్పికలు రాశారు. వినోదభరితమైన డిటెక్టివ్‌ గల్పికలూ రాశారు. రావిశాస్త్రి కూడా గల్పికాకారుడే. అంతటి మహామహుల దగ్గరనుంచి, జనరంజక రచయితలూ, వర్థమానులూ  ఎందరో గల్పికలను సాధన చేశారు. పత్రికలలో స్థలానికి కొరత ఏర్పడి, బుద్ధికి పనిలేకుండా కాలక్షేపం జరిగే కథలు కావలసి వచ్చినప్పుడు- మినీకథలు ఉధృతంగా వచ్చాయి. వాటిలోనూ మేలురకం లేవని కాదుకానీ, ఒక జోక్‌ను సాగదీసి, ఒక ఆశ్చర్యపరిచే మలుపు జోడించిన చిన్న కథలే రాసులుగా కనిపిస్తాయి.

మరి మల్లీశ్వరి కూడా అటువంటిదే ఏదో పాత బాణీనే అనుసరించారా? లేదు. పాతబాటలోనే కొత్త నడకలు నడిచారు. లేదా కొత్తబాట వేసుకుని అందులో పాతనడకలు నడిచారు. అందుకని ఇదొక కొత్త ప్రక్రియ, రూపం వల్లనే కాదు. సారం వల్ల కూడా. జాజిమల్లి కథల్లో  ఒకే సన్నివేశం ఉన్నవి ఉన్నాయి,  కొరడాకొస వంటి కొసమెరుపులూ ఉన్నాయి, కానీ, చమత్కార మో వ్యంగ్యమో లేవు. కల్పించినవి కాక వాస్తవ ఘటనలే ఈ కథల్లో ఉన్నాయి. కథనరీతి అత్యధికం ఉత్తమపురుషలో ఆత్మాశ్రయంగా ఉన్నది. . కథలో కానీ, గల్పిక, మినీకథల్లో కానీ సాధారణంగా సన్నివేశం వరకే
కథాకాలం పరిమితమవుతుంది. కానీ ఈ కథల్లో కథాకాలంలో దీర్ఘత, గమనమూ ఉన్నాయి.   తలపోతలాగా, జ్ఞాపకాల పరామర్శలాగా, గతంలోకి ప్రయాణం లాగా అనిపించే కథనం, కథనాన్ని అంతర్లీనంగా నడిపించే దృక్పథమూ ఉన్నాయి.  గతం,వర్తమానాల మధ్య పోలిక,  సారూప్యాల మధ్యనే కొట్టొచ్చినట్టు కనిపించే వైరుధ్యం, చిరు విజయాలకీ, చిన్న ఆనందాలకీ, సహజలోకజ్ఞానానికీ, లోకంలో ఇంకా మిగిలి ఉన్న సహృదయతకీ పులకించిపోయే హృదయం, ఎక్కడైనా చూడగలిగిన ఆశ- ఈ కథల్లో ఆశ్చర్యపరిచే గుణాలు. అందుకే వీటిని గల్పికలనలేము. మినీకథలూ అనలేము. కొసమెరుపు కథలు కావుకానీ, మెరుపు కథలే. మిరుమిట్లుగొలిపే కథలే. రచయిత మనమధ్య కూర్చుని చెబుతున్న ముచ్చట్లే. అనుభవాల నుంచి సార్వత్రక విలువలను మథించే అవలోకనాలే.


బ్లాగ్‌ వేదిక స్వభావం ఈ కథల రూపసారాలను అర్థం చేసుకోవడానికి కొంత పనికివస్తుంది. ఇంటర్నెట్‌ అన్నది మనుషుల మధ్య కమ్యూనికేషన్‌లను కొత్త దశకు తీసుకువెళ్లిన సాంకేతిక అద్భుతం. ప్రపంచీకరణలోని మంచిచెడులకు వాహికగా అది పనిచేస్తున్నది. కాయితాల మీద అచ్చయ్యే పత్రికలకున్న స్థలపరిమితిని ఇంటర్నెట్‌ అపహాస్యం చేస్తుంది. ప్రచురణకు అపారమైన స్థలాన్ని అందిస్తుంది. అదే సమయంలో ఇంటర్నెట్‌కు వేగం ఒక ప్రధానమైన చోదకవిలువ. స్థలానికి పరిమితి లేని చోట,  క్లుప్తత ప్రధానంగా ఉండే రచనారూపాలు అవతరించడం ఒక విచిత్రం. లిఖిత సంప్రదాయానికి చెందిన సుదీర్ఘరచనలు, అపారమైన సమాచారసంపుటులు నెట్‌లో ఉన్నాయి కానీ, నెటిజన్స్‌ అని మనమెవరిని అంటామో వారు సామాజిక మీడియా ద్వారా క్లుప్తతనే సాధన చేస్తున్నారు. స్పెల్లింగులు సరే, చివరకు వాక్యనిర్మాణం కూడా శిథిలమై కొత్త క్లుప్తభాష అవతరిస్తున్నది. బ్లాగ్‌వేదికలలో కూడా చిట్టి పోస్టింగులు, పొట్టి కవితలే అధికంగా  కనిపిస్తాయి. రచయితలు కావాలన్న సంకల్పం, సాధన లేనివారిని సైతం బ్లాగ్‌వేదికలు రచయితలను చేశాయి. కొత్త ప్రపంచాలను, పదజాలాలను, వ్యక్తీకరణలను అక్షరాల్లోకి ప్రవహింపజేశాయి. దినచర్యను రాసుకోవడం, ఎప్పుడేది తోస్తే అది రాసి పంచుకోవడం,  ఎవరో రాసి తమకు నచ్చినవాటిని తిరిగి పబ్లిష్‌చేసుకోవడం- బ్లాగ్‌లో చాలా చాలా చేయవచ్చు.  బ్లాగ్‌ అంటే ఒక వ్యక్తి పత్రిక. ఆ పత్రికకు ఆ వ్యక్తే కర్తాకర్మాక్రియా, రచయితా ఎడిటరూ కూడా.   రచయితా రచనా ప్రక్రియా పత్రికా- వంటి మాటల నిర్వచనాలనే  బ్లాగ్‌ మార్చేసింది. బ్లాగ్‌ ద్వారా కాబట్టే, మల్లీశ్వరి ఈ కథలను ఇట్లా రాయగలిగారు.  తన రచనను యథేచ్ఛగా తనే ప్రచురించుకుని, తారసపడిన పాఠకులతో సంభాషించగలిగే అవకాశాన్ని,  అనేకానేక ఇతర బ్లాగర్ల వలెనే,   ఆమె సృజనాత్మకంగా వినియోగించుకున్నారు. అదే సమయంలో బ్లాగ్‌ వేదికకు ఉన్న అలవోకతనం, బిగువులేని తనం  మల్లీశ్వరి కథల్లో కూడా అక్కడక్కడా మనల్ని పలకరిస్తాయి. ఎంచుకున్న అంశంలో ఉత్తమబ్లాగ్‌ కథ కావడానికి ఆస్కారం ఉన్నప్పటికీ,  దాన్ని చివరిదాకా నిర్వహించడంలో సహనంలోపించిన ఒకటిరెండు  సందర్భాలను పాఠకులు సులువుగానే గుర్తుపట్టగలరు. అయితే, అన్ని కథల్లోనూ ఆ లోపం జరగకుండా మల్లీశ్వరికి ప్రధానస్రవంతికథారచయితగా ఉన్న అనుభవం రక్షించిందనుకుంటాను. 


బ్లాగ్‌ను అవతరింపజేసిన ప్రపంచీకరణ- ఇంకా చాలా వాటిని కల్పించింది. కొత్తరకం కమ్యూనికేషన్లను నిర్మించే క్రమంలో అనేక సంప్రదాయ సంబంధాలను అది విధ్వంసం చేసింది. ధనప్రవాహానికి మహారహదారులు వేస్తూ, హృదయ కవాటాలను సంకుచితం చేసింది. గ్రామాన్ని శిథిలం చేసి, పట్టణాలకు ఎరువు పోసింది. ప్రేమల్ని చంపి వాంఛల్ని ప్రతిష్ఠించింది. విజయాన్ని ఒక ఉన్మాదంగా తీర్చిదిద్దింది.  ఎల్లలు లేని మహమ్మారిని సృష్టించింది.  కాసుల గలగలలూ ఆత్మహత్యల విలవిలలూ కలగలసిపోయిన ఈ విధ్వంస ఉత్సవంలో సగటుమనిషి అనాథ అయిపోయింది. తనను తాను రక్షించుకోవాలనుకునే మనిషి అయినా, ప్రపంచమైనా  ఈ ఉధృతిలో కొట్టుకుపోదు. తనకు తానై యాంటీబాడీస్‌ను సృష్టించుకుంటుంది. అసంబంధాన్ని సంబంధంతో,  విధ్వంసాన్ని నిర్మాణంతో, శూన్యభవితవ్యాన్ని గతవైభవంతో పూరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అన్ని రకాల ఉనికిలను రద్దుచేసి ఒక మహాప్రవాహంలో అనామకం చేసే ప్రయత్నాన్ని అస్తిత్వాల ఉధృతితో ఎదుర్కొంటుంది. ఆ ప్రయత్నాన్ని మల్లీశ్వరి కథలు ప్రతిభావంతంగా ప్రతిఫలించాయి.  ఈ పుస్తకంలోని మొదటి కథే- మనుషులు గెలుచుకోవలసినది హృదయాలనిచెబుతుంది. ఏ ప్రలోభాలూ లేనివీ ఎపుడూ తెరచివుంచేవీ అయిన పసి, ముసలి హృదయాలను ప్రేమించడం గురించి చెబుతుంది. ధనవ్యవస్థ ఎగదోసే అరిషడ్వర్గాలకు యవ్వనం కూడా  ఎట్లా లొంగిపోయిందో సూచిస్తుంది.  ఎడబాటు ఒక అలవాటుగా మారిన  మనిషి, స్వచ్ఛమైన స్వచ్ఛందమైన అనుబంధానికి కూడా ఎట్లా భీతిల్లుతాడో ఇంకో కథ చెబుతుంది.  అమర్చిపెట్టిన హంగులతో అద్భుతాలు సాధించడం కంటె, ముళ్లూరాళ్లూ నిండిన బాటలో  చేసిన ప్రయత్నమే గొప్ప విజయమని మరో కథ చెబుతుంది.  చేతులారా మంచినీళ్లను మురికి చేసుకుని అక్వాగార్డ్‌తో వడబోసుకుంటున్న తరానికి ఒక కథలో మామ్మ చిల్లగింజ చేసే చమత్కారం చెబుతుంది.  స్టార్టర్స్‌ మెయిన్‌కోర్స్‌ డిజర్ట్స్‌తో మూసపోసిన భోజనాలకు, నాన్న చేతి ఆవకాయముద్దను పోటీగా మరో కథ నిలబెడుతుంది.  సమాజరంగస్థలంలో జరుగుతున్న అస్తిత్వ సంచలనాలు తరగతి గదిలో ఎలా ప్రతిఫలిస్తాయో, హైవేలు తీసుకువచ్చేఅభివృద్ధి దళితవాడలో ఎంత క్రూరంగా అనువదితమవుతుందో, నాయనమ్మలూ బామ్మల లోకజ్ఞానం పెద్దచదువులని ఎంతగా అపహాస్యం చేస్తుందో మల్లీశ్వరి కథలు ఆశ్చర్యపరుస్తూ చిత్రించాయి.  ప్రపంచగమనాన్ని అర్థం చేసుకోవడాన్ని,  సమాజంలో విలువలు తలకిందులు కావడాన్ని  కథనం చేయడానికి పెద్ద కేన్వాసు, భారీ సన్నివేశాలు అక్కరలేదని.  ఇంటిముంగిట నిలబడి, పెరటితోటలో తిరుగుతూ, క్లాస్‌రూమ్‌లో పాఠం చెబుతూ, అక్కచెల్లెళ్ళతో కలసి బోజనానికి కూర్చునీ, రోడ్డు టుతూ, స్టాఫ్‌రూమ్‌లో కబుర్లు చెబుతూ- లోకపు పోకడని అర్థం చేసుకోవచ్చునని మల్లీశ్వరి కథలు నిరూపిస్తాయి.


 వ్యత్యాసాలను, అంతరాలను, వైరుధ్యాలను గుర్తించే చూపు ఉండాలే కానీ, సమాజచలనానికి, గమనానికి జీవితనిఘంటువులోనే అర్థాలు దొరుకుతాయని ఈ కథలు చదివినప్పుడు అనిపిస్తుంది.  అవగాహనతో, దృక్పథంలో, జ్ఞానంతో  అనుభవాన్ని రంగరించి రచయిత ఈ కథలను చెప్పారు కానీ, పాఠకులకు మాత్రం కామన్‌సెన్స్‌తో చెప్పినట్టే అనిపిస్తుంది. రచన ప్రయోజనం రీత్యా ఇది గొప్ప ఫలితమే.  ఒక ఉదంతంతో, ఒక చమత్కారంతో, ఒక పిట్టకథతో  పెద్ద పెద్ద వాదనలను పూర్వపక్షం చేసే మాటకారిలాగా రచయిత కనిపిస్తారు. ఆ పరిమితి బ్లాగ్‌ వేదికగా అవతరించిన కథదేతప్ప, రచయితది కాదు. గాఢత సాంద్రత సంక్లిష్టత తప్ప మరిదేన్నీ జీర్ణం చేసుకోలేని ప్రత్యేకవర్గం పాఠకులకు ఈ కోవ రచనలు బుద్ధిరంజకంగా ఉండకపోవచ్చు.  వారి కోసం వేరే రచనలు చేయండి, మల్లీశ్వరీ!


ఈ కథలు మనల్ని ఒప్పించి మెప్పించేందుకు రాసినవి కావు. ఆశ్చర్యపరిచి, నైతిక తీక్షణతతో మనల్ని తబ్బిబ్బు పరచేందుకు రాసినవి.  సహజీవనం, పంచుకోవడం, మంచితనం, సౌకుమార్యం, ధర్మాగ్రహం, ఆత్మగౌరవం- వంటి విలువలకోసం రాసినవి.  ఉదాహరణకు- సౌందర్యానికి, సంపన్నతకీ మల్లీశ్వరి ఈ కథల్లో ఇచ్చిన దృష్టాంతాలనే చూడవచ్చు. . తమకున్నదంతా యిచ్చి సంతోషపెట్టాలనే నిర్మలత్వంతో  పిల్లలు అందంగా ఉంటారని, ఆత్మాభిమానంతో రగిలిపోయే దృఢమైన వెన్నెముకతో సొగసుగా ఉంటారని, ఎత్తైన గడ్డివాముల మీంచి, గోడల మీంచి కించిత్తు కందకుండా కిందికి దూకేసి బంతిలా లేచి నిలబడే  విజ్జిలు అల్లరికి అడుగుజాడలని,డబ్బులకి కాకుండా ఊరికే అవీ ఇవీ ఇవ్వబోయిన  సాయిబు కొట్టు బూబమ్మలు సౌందర్యవతులని, చీరకుచ్చిళ్లు పైకిదోపి, పాత గుడ్డతో సుమ్మ చుట్టి దాని మీద పాలబిందె పెట్టి ఎడమ చేత్తో బిందె పట్టుకుని వచ్చే వాడుక పాల రాజేశ్వరులు అమృతం పంచడానికి వచ్చిన జగన్మోహినులని, నాన్న బుజం మీదికి ఎక్కి ఇల్లంతా తిరిగే ఆడపిల్లలు యువరాణులని- మల్లీశ్వరి అభివర్ణిస్తారు.  ఇందులోని కథలన్నిటిలోనూ ఉండే లాలిత్యమూ, లేతదనమూ మధ్య ఈ వర్ణనలు మార్దవానికి మాధుర్యాన్ని జోడిస్తాయి.  మానవసంబంధాల సున్నితత్వాన్నీ, వాటిని ప్రభావితం చేసే బాహ్యపరిస్థితుల కర్కశత్వాన్ని వివరిస్తున్నప్పుడు, రచయిత  వేదన పడతారు తప్ప వీరంగం వేయరు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా స్త్రీలు తమ సామర్థ్యాన్ని, ప్రతిభను చూపించగలరని, చిన్న అవకాశం వచ్చినా వారు తమ ప్రత్యేకతను, ఉనికిని చాటుకోగలరని, కాసింత మంచి ఆసరాతో వారు తమ రెక్కలను సొంతంగా, విశాలంగా పరచగలరని, బాల్యంలో ఎంతో చురుకుదనం చూపించిన ఆడపిల్లలు వివాహవ్యవస్థలో భాగమైన వెంటనే అణగారిపోతారని- చెప్పే కథలు . ఈ పుస్తకంలో ఉన్నాయి. నలభైకథల్లో సగానికిపైగా స్త్రీల అస్తిత్వచైతన్యాన్ని వ్యాఖ్యానించినవే. కథల్లో పాతికదాకా జ్ఞాపకాలను మననం చేసుకుంటూ వర్తమానంతో పోల్చినవే. అయినంత మాత్రాన గతమెంతొ ఘనకీర్తి అని చెప్పిన కథలు కావవి. వర్తమానప్రపంచం దేనికోసం బెంగపడుతోందో, వాటి ఆనవాళ్లు గతంలో ఉన్నప్పుడు పలవరించడం ఈ కాలపు చైతన్యంలో భాగం. బెంగ నిన్నటి కోసం కాదు. రేపటి కోసమే. ఆ మానవ సంబంధాల కోసం, ఆ ప్రాకృతిక జీవనం కోసం బెంగ.  అంతే తప్ప, నాటి మూఢత్వాలనో అమానుషత్వాలనో పలవరించడం కాదు.


మనచుట్టూ ఉండే మనుషులను, మనకెదురయ్యే అనుభవాలను సుకుని, మెల్లగా మన మనసుని తట్టి, ఒక సన్నటి వెలుగును ప్రసరించిన ఈ కథలు ఈ కాలపు కథలు.  సాంకేతికంగా, రాజకీయంగా, రూపంరీత్యా, అన్ని రకాలుగా.
No comments:

Post a Comment