Thursday, December 29, 2011

ఉద్రిక్త గాంధర్వం, రఘునాథం కవిత్వం

రఘునాథం అంటే, దాశరథీ, కొనకళ్ల లలితగీతాలు గుర్తొస్తాయి. ఎంత గొప్ప గాయకుడు? పాటల్ని అతని గొంతు అద్భుతమైన అర్థాలలోకి అనువదించేది. అసలు రఘునాథమే ఒక లలితగీతం. శాస్త్రీయ, జన సంగీతాల మధ్య అతనొక లలితగీతం. అతని గొంతెప్పుడూ ఆకాశమంత ఎత్తునో, దిక్కులు పిక్కటిల్లే తీవ్రతనో ప్రకటించేది కాదు. మంద్రమైన గీతమే తప్ప ప్రభంజనగానం అతనికి తెలియ దు. కవిత్వంలోనూ అంతే.

రఘునాథం వెళ్లిపోయి ఏడాదైంది. ఎప్పుడో ఉన్నట్టుండి వినిపించే అతని పలకరింపు కోసం ఇంకా ఎదురుచూడడమే తప్ప, అతను లేడన్న సంగతి ఇంకా ఇంకలేదు. నిష్క్రమణకు చాలా కాలం ముందునుంచే అతను ఉండీలేనట్టుగా ఉండిపోవడం అలవాటు చేసుకున్నాడు. తనలో తానొక బీభత్స ఏకాంతాన్ని నిర్మించుకుని, అందులోనుంచే తొలుచుకున్న గవాక్షాల నుంచి ప్రపంచంతో సంభాషించేవాడు. అతని ఇష్టం, ఎప్పుడు ఏ పరిణామం అతన్ని కలవరపరుస్తుందో, ఎప్పుడు ఏ ఉద్వేగంలో వివశమవుతాడో, ఎప్పుడు ఏ కొత్త పొయెంను గర్భితం చేసుకుంటాడో- అప్పుడు అతను తగిన మనిషి కోసం తన గుడారం నుంచి మెడను బయటికి సాచేవాడు. క్లుప్తమో సుదీర్ఘమో అయిన ఒక సంభాషణ తరువాత తిరిగి తనను తాను ఉపసంహరించుకునేవాడు. సజీవ సంబంధం నిలుపుకుంటూనే అతిథిమిత్రుడిగా మెలిగేవాడు.

అదంతా చివరి సంవత్సరాల సంగతి. 70ల చివర్లో ఉస్మానియాను వెలిగించిన కవిత్వ దీపాలలో గుడిహాళం రఘునాథం ఒకడు. ఆశయాలూ ఆదర్శాలూ కవనకాంక్షా దట్టించిన రాబోవుయుగం దూతలలో అతనూ ఒక యువకుడు. సాహిత్యలోకంలోకి నావంటి విద్యార్థులను సిధారెడ్డి, సుంకిరెడ్డిలతో పాటు చేయిపట్టుకుని నడిపించుకుని వెళ్లినవాడు, పాత్రికేయ వృత్తిలో స్వల్పకాలమే అయినా సహచరుడయ్యాడు. అధ్యాపకుడయిన తరువాత అతని జీవనమార్గమే వేరయింది. కళ్లు వెలుగుతూనే ఉన్నాయి, హృదయం సంచలిస్తూనే ఉన్నది, స్పర్శ తడితడిగానే ఉన్నది, ఆ గొంతు పాడుతూనే ఉన్నది- ఎక్కడో ఏదో దారితప్పింది.

తెల్లవారినదని భ్రమసి చీకటిలో మాయతీగ తొక్కిన మాలదాసరి వలె అతను తప్పిపోయాడు. ఏ పాదరక్షలూ తనకు సరిపోవడం లేదని, ఏ ఛత్రమూ తనకు నీడనివ్వడం లేదని, ఏ జలమూ దాహం తీర్చడం లేదని సతమతమయ్యాడు. చీకటిని ద్వేషించడం మానలేదు, వెలుతురును ప్రేమించడమూ వదలలేదు. కళ్లు విప్పార్చి
లోకపు పోకడను గమనించడమూ విరమించలేదు. కోటిఆశల జనగానంతో కోరస్ పాడడమూ ఆపలేదు. కానీ, ఎక్కడో లోలోపలే తనతో తానే ఎడబాటు చెందడం మొదలుపెట్టాడు.

'ఒంటరిని ఒంటరొంటరొంటరిని' అని పలవరించసాగాడు. 'పదమా, స్వరమా, జనమా, కదనమా?/ మోహం, మోహం- అంతే' అని పాకులాడిన మనిషి, 'కామమూ లేదు, మోహమూ లేదు/ ప్రేమా లేదు, ద్వేషమూ లేదు /రంగూ లేదు, రుచీలేదు / వాసన ఎప్పుడో తప్పుకుంది కదా జీవితం నుంచి' అని విరక్తుడయ్యాడు. వ్యక్తిగతంలోనే ఇంత వైరాగ్యం, సామాజికంలో అంతా ఆశావాదమే, అన్వేషణమే. 'ఏదీ, పదునున్న ఓ పాట, ఏదీ ఒక రణన్నినాదం' అని వెదుక్కోవడమే. 'సింహాసనం మీంచి రూపాయిని తోసేయ్'మనే ఆజ్ఞాపనమే.

'జ్వాలాసముద్రంలో లంగరంటూ ఉండద'న్న తొలినాటి గుర్తింపును కొనసాగించడమే. బెంగ కేవలం రిక్తహస్తాలతో వెళ్లిపోవడం గురించి మాత్రమే కాదు, విప్లవం గురించీ బెంగే, తెలంగాణా గురించీ బెంగే, బాలగోపాల్ గురించీ బెంగే, మాయమైపోతున్న మనిషి గురించీ, నల్లపూసైపోయిన కవిత్వపాదం గురించీ- అన్నిటి గురించీ బెంగే. ఉన్నట్టుండి మేల్కాంచి, ప్రపంచ గమనాన్ని చేతుల్లోకి తీసుకోవాలన్న తపనే. ఏ వాహికలూ లేకుండా యథార్థాన్ని యథార్థంగా చూడాలనే విపశ్యనమే.

రఘునాథం అంటే, దాశరథీ, కొనకళ్ల లలితగీతాలు గుర్తొస్తాయి. ఎంత గొప్ప గాయకుడు? పాటల్ని అతని గొంతు అద్భుతమైన అర్థాలలోకి అనువదించేది. అసలు రఘునాథమే ఒక లలితగీతం. శాస్త్రీయ, జన సంగీతాల మధ్య అతనొక లలితగీతం. అతని గొంతెప్పుడూ ఆకాశమంత ఎత్తునో, దిక్కులు పిక్కటిల్లే తీవ్రతనో ప్రకటించేది కాదు. మంద్రమైన గీతమే తప్ప ప్రభంజనగానం అతనికి తెలియ దు. కవిత్వంలోనూ అంతే. తిలక్‌లాగా రాజకీయాలకు విముఖుడో, ఇస్మాయిల్‌లాగా వ్యతిరేకో కాదు రఘునాథం. నిలువెల్లా రాజకీయమైన మనిషి అతను. అయినా అత ని కవిత్వం మాత్రం పిడుగులు కురిసేది కాదు, జడివానతోనో కుంభవృష్టితోనో తల కడిగేది, లేదా తుడిచిపెట్టేది. అగ్నిపర్వతాలను ఆలింగనం చేసుకుని కూడా గోరువెచ్చని పాట పాడినవాడు రఘునాథం. నాడులను కాక, హదయాన్ని నేరుగా తాకి ప్రకంపనలు సృష్టించిన పాట అతనిది.

రఘునాథంకి మోసం అంటే కోపం. కవిత్వం చేసే మోసం అంటే, కవి చేసే మోసం అంటే ఆగ్రహం. 'నీ కళ్లలో మేఘం లేదు/ నీ గొంతులో పక్షులు పాడటంలేదు/ నీ వరుసలో సరసంలేదు/ మోహంలేదు/ నీ భావదారిద్య్రం నుంచి నీకు మోక్షంలేదు- అని అతను నిలదీసింది 'పరభాష'లో పరిమళించాలనుకునే కవి నే. 'మల్లెతీగల్లాంటి పదచిత్రాల్తో ఎడారి నిజాల్ని అలంకరించడం', 'ఆచార దుర్వాసనల్ని ప్రస్తావిస్తూ పదసౌరభాల్లో పడిపోవడం' - రఘు తొలిరోజుల్లోనే గుర్తించిన కవిత్వ నేరాలు. అందుకే 'పద్యం లో ఇమిడిపోవాల్సిన అందం పద్యం ముందు తెరగా వాలటం హత్య' అని అతను స్పష్టంగా ప్రకటించాడు.

"ఇది బతుకు కాదు
అమానుష క్రీడ
నిజం అయినా
మనల్ని పట్టి పీడిస్తున్న అబద్ధపు జీవన హేల
అలసి, సొలసిన ఆకాశం, భుజాల మీద
విలపిస్తున్న ప్రకృతి
బీభత్స గీతాన్ని
ఆలపిస్తున్న శ్రమ
తీగలు తీగలుగా సాగే పాటను ఖండిస్తున్న దుర్మార్గం
చెరసాలకు పోయేవాడొకడు
చింతల జాడ్యాన్ని
విస్తరించేవాడొక్కడు
బొట్లతో అధికారం కైవసం చేసు
కోవాలనుకునే వాడు మరొకడు
కన్నతల్లిని
ఇంటినుంచి గెంటేసి
'జననీ జన్మభూమిశ్చ' అంటూ
నేలను మోసం
చేసేవాడు ఇంకొకడు
సంస్క­ృతులను కూల్చి
కన్నీళ్లను కూడా వ్యాపారం చేసి
మానవతను ప్రదర్శించేవాడు
మరొకడు..''


నిజమే, రఘునాథం, ఇప్పుడు కవిత్వం రాయాలంటే గొప్ప సాహసం కావాలి! రఘునాథం తెలంగాణవాది. 'తృష్ణా' తీరాన పుట్టి, 'ఎవడో సృష్టించిన ఎడారిలో జెముడు చెట్లయిన'వారి కోవలోని వాడు. నల్లవలస రహస్యాన్ని ఆవిష్కరించినవాడు. పుస్తకాల తత్వశాస్త్రం చదివినవాడు, బైరాగుల తత్వాన్ని, 'అమరచింత' రహస్యాల్నీ ఆలకించాడు. 'తెరూతెరూతెరూ ఏ శబ్దం ఎదురుచూస్తుందో, ఏ భావం కౌగిలించుకంటుందో' అని ఆత్రంగా ప్రతిశబ్దాన్నీ హృదయాన్నీ తట్టినవాడే.

అతనికి గోరటి ఎంకన్న అభిమానకవి కావడంలో ఆశ్చర్యం ఏముంది? ' ఒక జననం, ఒక మరణం' కావ్యాన్ని ఎదలోతుల్ని తడుముతున్నందుకు ఎంకన్నకు అంకితమిచ్చాడు రఘునాథం. పాలమూరు జిల్లా పండితపరంపర కోవను ప్రక్షాళన చేసి జనతాత్విక కవిత్వస్రవంతిలో సంగమింపజేసిన సందర్భం అది. ఈ నేలకు ఒక పాటా, ఒక పదమూ, ఒక తత్వమూ ఉన్నాయని నమ్ముతున్నవారందరూ ప్రేమించే కవిత్వం ఎంకన్నది. రఘునాథం జ్ఞాపకాన్ని ఎంకన్న పాటలో కూడా మనం పసిగట్టవచ్చును. రఘునాథం మొదటి పురస్కారాన్ని ఎంకన్న అందుకోవడం అందుకే అతి సహజంగా అనిపిస్తున్నది.

(ఈ డిసెంబర్ 28 కి   గుడిహాళం రఘునాథం చనిపోయి ఏడాది. నేడు అతని పేరిట మొదటి పురస్కారం గోరటి ఎంకన్న అందుకున్నారు)

No comments:

Post a Comment