Saturday, December 31, 2011

ఇటీవలి ముందుమాటలు-1

కొత్త ఆకాశాలను తెరిచిన బాలగోపాల్‌

    సంప్రదాయం, సాహిత్యం పాండిత్యం కలగలసిన కుటుంబనేపథ్యంలో పుట్టి అధ్యయనంతో గణితశాస్త్ర మేధావిగా ఎదిగిన వ్యక్తి, మార్క్సిజాన్ని చదువుకుని, చదువుకున్న దాన్ని ఆచరణలోకి అనువదిస్తూ, ఆచరణ అందించే పాఠాలను చదువులోకి పొందుపరుస్తూ, రెంటిలోని ఖాళీలనూ పూరించే ప్రయత్నం చేస్తే అది ఎటువంటి జీవితం?  మూడుదశాబ్దాల పాటు అత్యంత క్రియాశీలమైన,  అతి ప్రమాదభరితమైన, సంకల్పపూర్వకమైన అర్థవంతమయిన నిరాడంబర  జీవితం గడిపినప్పుడు-  అది ఎటువంటి వ్యక్తిత్వం?  ఏకకాలంలో  అసంఖ్యాక జీవితాలను జీవితాల్లోని అనేకానేక పార్శ్వాలనూ జీవించిన మనిషిది ఎటువంటి అనుభవం? అటువంటి జీవితమూ వ్యక్తిత్వమూ అనుభవమూ ఉన్న వ్యక్తి సాహిత్యానికి పరిశీలకుడిగా, వ్యాఖ్యాతగా, విమర్శకుడిగా లభిస్తే, ఆ సాహిత్యానిది ఎటువంటి 'అదృష్టం'?

    కె.బాలగోపాల్‌  విమర్శకుడిగా, సిద్ధాంతకర్తగా లభించడం తెలుగుసాహిత్యానికి చరిత్ర కల్పించిన ఒక అపురూపమైన అవకాశం. బాలగోపాల్‌ చేసిన సంభాషణతో తెలుగుసాహిత్యరంగం ఎంతవరకు మాట కలపగలిగింది, ఆయన చెప్పినవాటిని ఎంత వరకు విన్నది, ఎంత మేరకు చర్చించింది, చర్చించగలిగింది- అన్నవి వేరే ప్రశ్నలు.  ఆయన మాట్లాడారన్నదే ముఖ్యం.  మరో కాలంలో అయినా ఆయనను  వినడానికీ, మరోసందర్భంలో అయినా సంభాషించడానికీ ఆ రచనలు అవకాశం కల్పిస్తున్నాయన్నదే ఆనందం.

    తెలుగు సాహిత్యానికి బాలగోపాల్‌ చేసిందేమిటి? ఈ ప్రశ్న వేసుకోవడానికి ఇంతకాలం అవకాశమే రాలేదు. చాలా అరుదుగా మాత్రమే, కొన్ని ప్రత్యేక సందర్భాలు ఎదురయినప్పుడు లేదా కల్పించుకున్నప్పుడు మాత్రమే బాలగోపాల్‌ సాహిత్యరచనలు చేశారు. ఆయననుంచి సాహిత్యరచనలు ఆశిస్తూ ఉండినవారు, ఆయన హఠాత్తుగా ఇచ్చే ఆశ్చర్యాలను అందుకోవలసిందే తప్ప, హక్కుగా నిరీక్షించే అవకాశం లేకపోయింది.    2001లో 'ప్రజాతంత్ర' సాహిత్యసంచిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ తరవాత ఆయన సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడింది లేదు. పూనుకుని ఆయన చేత ఎవరైనా మాట్లాడించిందీ లేదు. 1993లో  'రాగో' నవల సందర్భంగా రాసిన వ్యాసం (మనిషి, చరిత్ర, మార్క్సిజం) తరువాత బాలగోపాల్‌ ప్రతిపత్తి ఉన్నట్టుండి మారిపోయింది.  అంతవరకు ఆయన ప్రతిష్ఠకు  ఒక ప్రధాన విప్లవ రాజకీయ శిబిరం జోడిస్తూ ఉండిన సాధికారత, ఆ వ్యాసం తరువాత పలచబడింది. బౌద్ధికంగాను ఆచరణలోను ఆయన నిజాయితీ తిరుగులేనివి కావడంతో,  రాజకీయానుబంధం వల్ల కలిగే సాధికారత లేకపోయినా నిలదొక్కుకోగలిగారు. ఆ సమయంలోనూ, ఆ తరువాత 'నక్సల్బరీ గమ్యం-గమనం' సందర్భంగానూ చర్చ జరగకపోలేదు కానీ, అది పాక్షికంగా మాత్రమే సాగింది. బాలగోపాలే చెప్పినట్టు 'రచనకు తాత్వికంగా స్పందించి ఉంటే అన్ని అంశాలు చర్చకు వచ్చేవేమో, కానీ తమ రాజకీయ విశ్వాసాల పైన దాడిగా దానిని భావించి స్పందించినవారే ఎక్కువ.' దశాబ్దానికి పైగా,  పై ప్రగతిశీల  ప్రధాన సాహిత్య స్రవంతి   విధించిన మౌనం కారణంగా బాలగోపాల్‌ విభిన్న ఆలోచనలు ఆయా రచనలలోనే మిగిలిపోయాయి. విప్లవ శిబిరమేకాదు, ఆ స్రవంతికి సమాంతరంగా వర్థిల్లిన గుర్తింపుఉద్యమాలు (గుర్తింపు ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు అన్న నామకరణాలపై బాలగోపాల్‌కు సైద్ధాంతికమయిన అభ్యంతరం ఉంది)  సైతం బాలగోపాల్‌ నుంచి మద్దతును స్వీకరించినంతగా, ఆయన ఆలోచనలను తీసుకోలేదు. ఫలితంగా ఆయన సాహిత్యవ్యక్తిత్వం ఒక తరం వారికి పెద్దగా పరిచయమే కాలేదు.  ఆయనను రచనలన్నిటినీ ఒక క్రమంలో అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి ఆయన నిష్క్రమణతో అవకాశం కలగడమే విషాదం.

    సాహిత్య సంబంధి రచనలు చేయడంతో సహా  బాలగోపాల్‌  సాహిత్యాచరణ అంతా
ఆయన ఇతర రంగాల్లో ఆయన చేసినదాని ముందు చాలా తక్కువ అనిపిస్తుంది. సాహిత్యాన్ని తాను కార్యరంగంగా ఎంచుకోలేదని, సాధికారంగా వ్యాఖ్యానించడానికి తగినంతగా తెలుగుసాహిత్యాన్ని తాను ఎక్కువగా చదవలేదని, తాను రాసిన సాహిత్య విమర్శ వ్యాసాలు కూడా సమగ్రమైనవి కావని బాలగోపాల్‌ అనేక సందర్భాలలో అన్నారు. అవన్నీ నిజమే కావచ్చు. కానీ, సాహిత్యానికి ఆయన వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో  ప్రత్యేక స్థానమున్నది.   ఆయన వ్యక్తిత్వంలో తాత్వికతలో సాహిత్యం అవిభాజ్యమైనది. అంతర్లీనంగా నిరంతరం వినిపిస్తూ ఉండిన సంగీతం అది. తాను చదువుకుని పొందిన అవగాహనని, ప్రజలలో పనిచేస్తూ పొందిన అనుభవంతో బేరీజు వేసుకున్నట్టే, చదువులోనూ అనుభవంలోనూ అవగతంకాని జీవిత పార్శ్వాలను సాహిత్యం ద్వారా ఆయన అర్థం చేసుకున్నారు. చరిత్రనీ, సమాజాన్నీ, మనిషినీ అర్థం చేసుకోవడానికి ఆయనకు మార్క్సిజం ఎంత ఉపకరించిందో, సాహిత్యం, ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం, అందులోనూ పాశ్చాత్య కాల్పనిక సాహిత్యం  కూడా అంతగా సహాయం చేసింది. మనిషికీ చరిత్రకూ ఉన్న సంకీర్ణ సంబంధం గురించి, వర్గస్వభావానికీ, మానవప్రవృత్తికీ ఉన్న పరస్పరత, ప్రత్యేకతల గురించి, మనిషి సాధించదలచుకునే పరిపూర్ణతకూ ప్రామాణికతకూ వాస్తవజీవితానికీ ఉండే అంతరం గురించి బాలగోపాల్‌ ఆలోచనలు సాహిత్య సామాజిక చారిత్రక అన్వయాలతోనే ముందుకు వచ్చాయి. హక్కుల ఉద్యమం గురించిన విమర్శ-ఆత్మవిమర్శగానీ, మార్క్సిజం గురించిన విచికిత్సగాని, సాహిత్య విమర్శ గురించిన కొత్త ఆలోచనలు గానీ విడివిడిగాకాక, పరస్పర సంబంధంలోనే కనిపిస్తాయి. సంతృప్తికరమైన తాత్వికత కోసం బాలగోపాల్‌ జరిపిన అన్వేషణలో సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యం తిరుగులేనిది. తాత్విక విశ్వాసంగా తానప్పటిదాకా భావిస్తూ వచ్చిన మార్క్సిజం పట్ల ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భమూ,  తాను  'మొదలుపెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ', తనకు 'సంతృప్తి నిచ్చే ప్రాపంచిక దృక్పథం' లభించిందని ప్రకటించిన సందర్భమూ సాహిత్యసంబంధివే కావడం యాదృచ్ఛికం కాదు. 

    నిర్దిష్టంగా తెలుగుసాహిత్యం గురించిన తన అవగాహన పరిమితమేనని బాలగోపాల్‌ చెప్పుకున్నప్పటికీ,  సాహిత్య పరిశీలనకు ఆయన ఎంచుకున్న పద్ధతులు చాలా సందర్భాలలో ఏ భాషా సాహిత్యానికైనా వర్తించేవే. ప్రత్యేక భాషా సాహిత్యంగా తెలుగుసాహిత్యానికి, లేదా నిర్దిష్ట సమూహాలకు చెందిన సాహిత్యాలకు వర్తించే పరిశీలనా పద్ధతులు కూడా ఆయనకు తెలియనివేమీ కావు. కాకపోతే, కొందరు తెలుగు రచయితల సాహిత్యాన్ని, కొన్ని రకాల సాహిత్యాన్ని ఆయన విస్త­ృతంగా చదివి ఉండకపోవచ్చు. పాశ్చాత్య కాల్పనిక సాహిత్యాన్ని విస్త­ృతంగా చదివినందున, ఆయనకు తెలుగు ఫిక్షన్‌ మీద పెద్ద మంచి అభిప్రాయం కూడా లేదు. నవలగా ఉప్పల లక్ష్మణరావు 'అతడు- ఆమె' పై మాత్రమే ఆయన విమర్శ రాశారు. కుటుంబరావును, రావిశాస్త్రిని కథకులుగానే పరామర్శించారు. ఉన్నవ లక్ష్మీనారాయణను మాత్రం గొప్ప చారిత్రక పరిణామాన్ని పట్టుకున్న నవలాకారుడిగా, అదీ  ప్రస్తావవశంగా,  ప్రశంసించారు. శ్రీశ్రీ అంతర్జాతీయ స్థాయిలో ఏ కవికయినా తీసిపోడుకానీ, డాస్తయవస్కీతో పోల్చదగ్గ నవలారచయిత తెలుగులో లేడని ఆయన అంచనా.   అయిదు సంప్రదాయాల ద్వారా ప్రాచీన తెలుగుసాహిత్యచరిత్రను ఎట్లా చూడవచ్చో ఆయన చేసిన ఒక ప్రతిపాదన (వైదిక బ్రాహ్మణ సంప్రదాయం, బ్రాహ్మణ వ్యతిరేక శైవ సంప్రదాయం, బ్రాహ్మణ ప్రాపంచిక దృక్పథం పరిధిలోనే ప్రజాజీవితానికి కొంచెం సన్నిహితంగాఉన్న సంప్రదాయం, రాజాస్థానాల విలాస జీవితాలకు అనుగుణ్యమైన సాహిత్యసంప్రదాయం, వ్యవస్థలోని అన్యాయం పట్ల నిరసన వ్యక్తంచేసిన విమర్శనాత్మక సంప్రదాయం) ను చూస్తే  ఆయనకు తెలుగుసాహిత్యంపై ఉన్న అవగాహనపై ఎటువంటి అనుమానమూ రాదు. కొన్ని ప్రత్యేక సాహిత్య రచనల(కొ.కు., రావిశాస్త్రి కథలు, ఉప్పల లక్ష్మణరావు నవల 'అతడు-ఆమె', గురజాడ 'కన్యాశుల్కం')కు  ఆయన నిశిత పరిశీలనతో చేసిన చారిత్రక అన్వయాలు, కొన్ని రకాల సాహిత్యంపై (కుహనా వైజ్ఞానిక నవలలు) చేసిన విమర్శ, ఇతర వాదాలను పూర్వపక్షం చేస్తూ రాసిన వ్యాసాలు( కవిసేన మేనిఫెస్టో- ఒక పరిశీలన), తెలుగు సాహిత్యవిమర్శ స్థితిగతులపై చేసిన సమీక్షలు, సాహిత్య, సాహిత్యేతర వ్యాసాల్లో  ప్రస్తావవశంగా తెలుగుసాహిత్యంలోని సాహిత్యకారులలోని అవలక్షణాల గురించి చేసిన వ్యాఖ్యలు- వీటిని చదివినప్పుడు ఈయన మరింతగా, ఒక క్రమపద్ధతిలో, ఒక విధిగా తెలుగుసాహిత్యంపై రచనలు చేసి ఉంటే మరింతగా దోహదం జరిగి ఉండేది కదా అని అనిపిస్తుంది. అయితే, అందుకు సమాజం నుంచి ప్రయత్నం జరగకపోవడం కూడా ఒక కారణం. ఎందుకంటే, ఆయననుంచి అవగాహన, అంచనా, వ్యాఖ్య అవసరమైన సందర్భాలలో ఎవరు కోరినా బాలగోపాల్‌ స్పందించేవారనే నా అనుభవం. సాహిత్యంపై తనకున్న విశిష్ట అభిప్రాయాలను, సాహిత్యరంగంలో స్థిరపడిన అభిప్రాయాలతో తన విభేదాలను, నూతన ప్రతిపాదనలను, తానుగా సూచనప్రాయంగా చెప్పిన అంశాల విశదీకరణను - ప్రత్యేకించి ఇంటర్వ్యూలు తీసుకున్న సందర్భాలలో ఆయన ఆసక్తితో  వ్యక్తపరచడం గమనించవచ్చు. 

    తాత్వికుడిగా, హక్కుల ఉద్యమకారుడిగా సరే, మరి రచయితగా బాలగోపాల్‌? ఆయనలో విమర్శకుడు సరే, గొప్ప కథకుడూ ఉన్నాడనిపిస్తుంది. కుటుంబరావు కథల నిర్మాణానికీ, వ్యాసనిర్మాణానికీ చాలా పోలికలుంటాయి. పెద్ద సామాజిక పరిణామాన్ని మానవసంబంధాల నడుమ ఎటువంటి సంక్లిష్టతా లేకుండా ఆయన కథ అల్లగలడు. అదే పద్ధతి వ్యాసంలోనూ అనుసరిస్తాడు. బాలగోపాల్‌లోని సారళ్యం (భాషాసారళ్యంకాదు, ప్రపంచపు గుట్టుని పూసగుచ్చినట్టు చెప్పగలిగిన సారళ్యం)కూడా కథనశైలిలాగానే అనిపిస్తుంది. 'కన్యాశుల్కం-రాజ్యం-రాజ్యాంగయంత్రం' వ్యాసంలో  నాటకాన్ని మొత్తంగా తన పద్ధతిలో వినిర్మిస్తారు బాలగోపాల్‌. రావిశాస్త్రి కథల గురించి రాసిన వ్యాసంలోనూ ఆ ధోరణి కనిపిస్తుంది. కథ నం తెలిసినవారికే అటువంటి విమర్శ సాధ్యమనిపిస్తుంది. రాయబడని సృజనాత్మకరచనకి  కూడా అటువంటి వినిర్మాణాన్ని అందించారు బాలగోపాల్‌.  'ఈ చరిత్ర కథకుల కోసం నిరీక్షిస్తోంది' - 'మిస్సింగ్‌' అనువాద నవలకు వెనుకమాటగా రాసిన వ్యాసంలో  పోలీసుల చేతిలో మాయం అయిన వ్యక్తులు, వారి కుటుంబాలు, వారిపోరాటాలు, ఆ క్రమంలో అవగతమైన సత్యాలు- అన్నీ కథావిశ్లేషణ శైలిలోనే కనిపిస్తాయి. "జీవితాన్నయినా జీవిత సంఘర్షణలనయినా బహుముఖంగా అర్థంచేసుకునే సాహిత్య సంస్కృతి లోపించడం వల్లనేమో ఈ కథలు అలిఖితంగా ఉండిపోయినాయి'' అంటూ  కథకుల మీద, తెలుగుసాహిత్యవాతావరణం మీద చేసిన  విమర్శ పక్కనబెడితే, బాలగోపాల్‌ రాసిన ఆ వ్యాసం స్వయంగా కథాలక్షణాలు కలిగినది. ఆయన రాసిన అనేక పౌరహక్కుల రిపోర్టులు, కరపత్రాలు కూడా కథనశైలిలో ఉంటాయి. వాస్తవానికి వాస్తవికతకు భంగం కలగకుండా,ఆసక్తికరంగా ఉండేలా ఆయన వచనం సాగుతుంది. అయితే,  ఆయన     భావం వెనుక వినయంగామాత్రమే ఆయన వచనం సంచరిస్తుంది. 

  

    బాలగోపాల్‌ బాలగోపాల్‌గా పరిణమించిన సందర్భానికీ, ఆయన ఆ పరిణామాన్ని ముందుకు తీసుకువెళ్లిన మూడుదశాబ్దాల కాలానికీ  ఇటీవలి చరిత్రలో  ఎంతో ప్రాముఖ్యం ఉంది.  ఎమర్జెన్సీ అనంతరం రాష్ట్రంలో  విప్లవ పోరాటాల తీరుతెన్నులలో మార్పు వచ్చింది.  'ప్రజాయుద్ధపంథా' బహిరంగ, రహస్య ఆచరణల మిశ్రమంగా ముందుకు వచ్చింది. మధ్యతరగతిలో  ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి పట్టింపు మొదలయింది. ప్రాంతీయ ఆకాంక్షలు, ఫెడరలిజమ్‌,స్వయంప్రతిపత్తి కోసం పోరాటాలు పెరిగిపోయాయి. దందహ్యమానత  క్రమంగా దృక్పథాన్ని జీర్ణం చేసుకునే వివేచనగా, విశ్లేషణగా పరిణమించింది. సాహిత్యరంగం గర్భగుడిలోకి అట్టడుగుజనం దూసుకువచ్చారు. శిష్టసాహిత్యసీమలలోనే సంచరించిన అనేకులు, బుద్ధినీ హృదయాన్నీ వాస్తవికతవైపు మళ్ళించుకున్నారు.

    ఆ కాలపు తరగలపై తేలివచ్చిన మేధావులలో బాలగోపాల్‌ ఒకరు. కళ్లు మిరుమిట్లు గొలిపి కొత్త వెలుగులు కురిపించిన యువకుడిగా బాలగోపాల్‌ ఒకే ఒక్కడు.  అతను ఎంతో వినయంగానే అయినప్పటికీ,  తను జ్ఞానం అనుకున్న దానిమీద  తిరుగులేని విశ్వాసాన్ని, ఆ జ్ఞానం మీద తనకున్న అధికారాన్ని  ధ్వనింపజేస్తూ మాట్లాడేవాడు. రాసేవాడు. ఇంద్రవెల్లీ,సింగరేణీ భవిష్యత్తు మీది ఆశను ఉద్దీపింపజేస్తుండగా, ఉద్వేగాలకు బలమయిన ఆలంబన కోసం జ్ఞానదాహంతో తపించిపోయిన, అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తున్న మా బోంట్లం ప్రతి సృజనాక్షరాన్నీ జల్లెడ పట్టేవాళ్లం.    ఒక సాధికారమయిన గొంతుకోసం మొహం వాచి ఉన్నట్టు మధుసూదనరావుని బాలగోపాల్‌ని  ఆసక్తిగా ఆత్రంగా వినేవాళ్లం చదివేవాళ్లం. ఎంతో తేలికగా అర్థమయ్యే వారి రచనల ఆసరాతో  అజ్ఞానపు చీకట్లను, దుష్ట భావాలను అవలీలగా తరిమివేయవచ్చునని అనుకునే వాళ్లం. ఎందుకో మధుసూదనరావులో ఆవేశమే ఆకర్షించేది. బాలగోపాల్‌ని చదివిన ప్రతిసారీ మా బుద్ధి ఒక అంగుళం ఎదిగినట్టు అనిపించేది.

    పెరిగిపోతున్న నిర్బంధం రీత్యా పౌరహక్కుల రంగంలో పనిచేయడమే ఎక్కువ అవసరమని భావించి, సాహిత్యాన్ని తన రంగంగా ఎంచుకోలేదని బాలగోపాల్‌ చెప్పారు. విప్లవోద్యమం శ్రీకాకుళంలో అణగారిపోయిన తరువాత ఎమర్జెన్సీ అనంతరం కొత్తరూపంలో ఆవిర్భవించినట్టే, పౌరహక్కుల ఉద్యమానికి కూడా 1980లలో కలిగింది పునర్జన్మే. ఆ రెండో రాకడ బాలగోపాల్‌ను కలుపుకుని వచ్చింది. బహిరంగ క్షేత్రంలో బలంగా విస్తృతంగా ఉన్న విప్లవానుబంధ ఉద్యమాలకు సహజంగానే పోలీసుయంత్రాంగం నుంచి పరంపరగా నిర్బంధచర్యలు ఎదురయ్యాయి. ఆ పరిమాణానికి దీటైన వేగంతో పనిచేస్తూ బాలగోపాల్‌ ఉద్యమాన్ని, ప్రజలను అర్థం చేసుకుంటూ వచ్చారు. పౌరహక్కుల ఉద్యమమే ఆయనకు వర్గరాజకీయాలకు ఉన్న పరిమితులను, మానవస్వభావాలలోని ప్రత్యేకతలను అర్థం చేయించి ఉండాలి. రాజ్యం ప్రత్యక్షంగా భాగస్వామి కాని సంఘటనలను, సమస్యలను కూడా పౌరహక్కుల పరిధిలోకి తేవడం దగ్గరనుంచి, విప్లవకారులతో సహా ఏ సంఘటిత బృందాలైనా, ప్రాబల్యశక్తులైనా ప్రజల హక్కులకు భంగం కలిగించినప్పుడు పట్టించుకోవాలనేదాకా బాలగోపాల్‌ నాయకత్వంలోనే జరిగిన పరిణామాలు. పౌరహక్కుల ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమానికి అనుబంధంగా నిర్వహించడం మీదనే ఆయనకు అభ్యంతరం. అట్లా నిర్వహించడంలో ఎదురైన తాత్విక, నైతిక సమస్యల నుంచే ఆయనకు ఆ అభ్యంతరం కలిగి ఉండాలి. ఆ సమస్యలే ఆయనకు మార్క్సిజంపై  కలిగిన అసంతృప్తికి కారణమై ఉండాలి. ఆధునిక రాజ్యం స్వభావం ఏమిటి, దానిలోని సంక్షేమ, ప్రజానుకూల పార్శ్వాన్ని ఎట్లా అర్థంచేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఒక  విలువగా ఆదర్శంగా నమ్మి సాధించే ప్రయత్నం చేయాలా, లేక, దానినొక ఎత్తుగడగా మాత్రమే తీసుకోవాలా- అన్నవి హక్కుల ఉద్యమంలో ఆయన ప్రశ్నలు. వ్యక్తికీ మానవాళికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి, మానవ ప్రవృత్తి అంటే కేవలం వర్గస్వభావమేనా, సమసమాజ ఆకాంక్ష తప్పనిసరిగా విప్లవకర వర్గాలలో కలిగితీరుతుందన్న నమ్మకం ఏమిటి? - ఇవి ఆయన తాత్విక ప్రశ్నలు.   ప్రజాస్వామ్యం దానంతట అది ఒక చేరుకోదగ్గ ఆదర్శమని, హక్కులు ప్రజాస్వామ్యీకరణ మరే ప్రయోజనాల కోసమో కాక వాటంతట అవే సాధించదగ్గవని నిరంతర ఆచరణ ద్వారా వ్యవస్థను ప్రజాస్వామీకరించుకుంటూ, ఆ క్రమంలో అత్యున్నత ఆశయాలు, సంకల్పదీక్ష కలిగిన వ్యక్తులను కూడగట్టుకుంటూ పురోగమించడమే ప్రస్తుతకర్తవ్యమని నిర్ధారణకు వచ్చినపుడు,   ఆయన దారి వేరైంది. ఆయన ఆలోచనల ప్రాతిపదికపై  అతికొద్ది మంది ప్రారంభించిన మానవహక్కుల ఉద్యమం  ఈరోజు సొంతంగాను, ఇతర హక్కుల సంస్థలతో కలిసీ రాష్ట్రంలో ఒక బలమైన ప్రజాస్వామిక శక్తిగా ముందుకువెడుతోంది. బాలగోపాల్‌ ఆలోచనల్లో, సాహిత్య ఆలోచనలతో సహా,  వచ్చిన మార్పు వెనుక ఆయన హక్కుల ఉద్యమ కార్యాచరణ కీలకమైనది. హక్కుల ఉద్యమం ఆచరణలో ప్రజాజీవితాన్ని, రకరకాల మనుషుల సన్నద్ధతలను, సందిగ్ధతలను, స్వార్థాన్నీ అర్థం చేసుకోవడానికి, అనేక అంచెల్లో ఉండే జన జీవితాన్ని సాధ్యమైనంతగా తెలుసుకోవడానికి బాలగోపాల్‌కు సాహిత్యం, ముఖ్యంగా సంశయం నుంచి భయం నుంచి కుతూహలం నుంచి మార్పు పట్ల అనుమానం నుంచి పుట్టిన కాల్పనిక సాహిత్యం ఉపకరించింది. ఒక వాస్తవం కప్పిపుచ్చే అనేక వాస్తవాలను దర్శించడానికి పోస్ట్‌ మోడర్నిజం, మానవ ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణ, అస్తిత్వవాదం ఆయనకు ఉపకరించాయి.  చరిత్రను, వర్తమానాన్నీ అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తును రూపొందించుకోవడానికి ఉపకరించే తాత్వక దృక్పథం కోసం జరిపిన అన్వేషణలో భాగాలే, అందులో  ప్రారంభం నుంచి చివరి దాకా మార్క్సిజానికి ఉన్న ప్రాధాన్యం మరిదేనికీ లేదు. తక్కినవి దానిలోని లోపాలను, ఖాళీలను భర్తీచేసే పూరకాలే.
  

    1980 దశకం కొత్త పోరాటాలనే కాదు, కొత్త ప్రశ్నలనూ తీసుకువచ్చింది. జాతుల పోరాటపుచర్చలు, మహిళా దశాబ్దం ఊతమిచ్చిన స్త్రీ చైతన్యం, కారంచేడు హత్యాకాండ రగిలించిన దళితవాదం- ఆ దశాబ్దపు సంచలనాలే. ఆటా పాటా మాటా బందయిన నిర్బంధం, లాటిన్‌ అమెరికన్‌ దేశాలను అనుభవంలోకి తెచ్చిన అదృశ్యాలు పౌరహక్కుల ఉద్యమాన్ని రాష్ట్రంలో ఏకైక బహిరంగ ప్రతిపక్షంగా తీర్చిదిద్దాయి. సోషలిస్టు దేశాలు కుప్పకూలుతున్న చప్పుడు దశాబ్దం మధ్యనాటికే పెరిస్త్రోయికాగా వినిపించింది. తరువాతి దశాబ్ది మోసుకువచ్చే ప్రపంచీకరణ శకునాలు రాజీవ్‌గాంధీ 21వ శతాబ్ది జపంలోనే «కనిపించాయి. 'నాగరికతల యుద్ధంగా, టెర్రరిజం మీద పోరుగా నూతన శతాబ్దిలో నామకరణం పొందిన పరిణామాలకు దేశీయమైన ఆజ్యం పోసిన ్ఞఅయోధ్య వివాదం, దానికి విరుగుడుగా పుట్టిన సామాజిక న్యాయ రాజకీయాలు ఈ పదేళ్లకాలపు విశేషాలే.   89 నుంచి 91 దాకా రెండు దశాబ్దాల     మూలమలుపు ఎన్నో కీలకమయిన సామాజిక పరిణామాలకు వేదిక అయింది. ఎవరి యుద్ధం వారే చేయాలనుకునే, చేసే కాలం వచ్చింది.  అందరికీ ప్రాతినిధ్యం, అన్నిటికీ నాయకత్వం వహించే రాజకీయాలపై భావ ప్రచార, సాహిత్య రంగాలలో విమర్శ ఉధృతమయింది. దేనికైనా సమాధానం చెప్పే సైద్ధాంతికత, తమదే సరిఅయిన మార్గమనుకోగలిగిన నైతికత- అస్తిత్వ ఉద్యమాల ప్రశ్నల ముందు నిలబడలేకపోయాయి. ఏకకాలంలో అనేక ప్రగతిశీల ఉద్యమాలు సమాంతరంగా నడుస్తూ ఉండడం, సామాజిక, సాహిత్యరంగాలలో పరస్పర ప్రశ్నాయుద్ధాలు 1990 దశకం ప్రత్యేకత.

    ఈ రెండు దశాబ్దాల కాలంలో ఇంతింతై వటుడింతై విప్లవోద్యమం విస్తరించింది. అనేక నిర్బంధాల నడుమ ఒక ప్రబలమైన రాజకీయశక్తిగానే ఉంటూ వచ్చింది. విప్లవ శిబిరానికి అతిసన్నిహితంగా ఉంటూ, సందేహాలను నిబద్ధతతో ఎదుర్కొనగలిగే వారి సంగతి సరే,  ప్రజా ఉద్యమాలను, సాహిత్యాన్ని  అభిమానించి అనుసరించే సాధారణులకు ఈ రెండుదశాబ్దాల కాలం నిశ్చయసంశయాల మధ్యనే గడచింది.  ఒకపక్కన సాహసాలు త్యాగాలతో నిండిన విప్లవోద్యమం, మరోపక్కన ఆ విప్లవోద్యమంపైనా, లోనా, సమాంతరంగా వినిపిస్తున్న ప్రశ్నలు. ఏదో ఒక బలమైన ఉద్వేగాన్ని ఆసరా చేసుకుని సమాధానపడడమే తప్ప, సంతృప్తి పరచే సమాధానాలు దొరకని ప్రశ్నలు.

    సాహిత్యప్రయోజనం ఏమిటి? ప్రజలను ఉద్యమోన్ముఖులను చేయడం, సమీకరించడం మాత్రమేనా? లేదా చైతన్యస్థాయిని పెంచడం, అవగాహనను కలిగించడమా? గతంలోను, ప్రస్తుతమూ వచ్చిన మంచి సాహిత్యమంతా ఈ నిర్వచనానికి ఒదుగుతుందా? రచయితలు తమ ప్రజాజీవితంలో వ్యక్తంచేసిన పక్షపాతాలను బట్టే ఆ రచయిత రచనలను కూడా అంచనా వేస్తున్నామా? అన్ని రకాల రచనలలోని పక్షపాతాలను వివరించే సాధనాలున్నాయా? మధ్యతరగతి జనం ప్రగతిశీల దృక్పథాన్ని అలవరచుకుంటే, తమ వర్గాన్ని వర్గలక్షణాలను నిందించుకుంటూ, విప్లవకరవర్గాల గురించి  మాత్రమే, లేదా వారిని ప్రశంసిస్తూనో మాత్రమే రాయాలా? ఏదేదో రాసి చివరలో ఒక పంక్తి విప్లవోన్ముఖంగా ఉంటే విప్లవకవిత్వం అవుతుందా? వచనకవిత్వంలో సంక్లిష్టత, అధివాస్తవిక ధోరణులు అంతగా నిరాకరించదగ్గవా? వాటికి సామాజిక పునాది ఏదీ లేదా? ప్రయోగశీలత వాంఛనీయం కాదా? సమాజవాస్తవికతకీ, ఉత్తమసాహిత్యానికీ మధ్య ఉండవలసింది బింబ ప్రతిబింబ సంబంధమేనా? ప్రగతిశీల సాహిత్యశిబిరం తమ సిద్ధాంతచట్రానికి లోబడి కూడా  భిన్నాభిప్రాయాల విషయంలో మరింత సహనంగా ఉండగలిగే అవకాశం లేదా? సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో  సామాజికధోరణికి కాస్త ఎడంగా కనిపించగానే పలాయనవాద, నైరాశ్యవాద బిరుదాలతో సత్కరించవలసిందేనా?  - ఇటువంటి అనేకానేక సాధారణ సందేహాలు1980లలో  ఆరంభమైన ఒక తరాన్ని (లేదా ఆ తరంలోని ఒక పాయను) వేధించాయి. ఆ తరువాత దశాబ్దంలో, అస్తిత్వ ఉద్యమాలు సంధించిన ప్రశ్నలు, పోస్ట్‌మోడర్నిజం ప్రభావంతో ముందుకువచ్చిన ప్రశ్నలు- సోషలిస్టుదేశాల పతనం కేవలం రివిజనిజం పతనం మాత్రమేకాదేమోనన్న సంశయం బాధించాయి.  పైకి అనే ధైర్యంచేయకపోయినా,  మొన్నమొన్నటిదాకా , అమాయకత్వంతోనే కావచ్చు,  సమీపంగా కనిపించిన సమసమాజలక్ష్యం (పోనీ, మెరుగైన మానవీయ సమాజ లక్ష్యం), సుదూరంగా, ఒక్కొక్కసారి అసాధ్యంగా కనిపించడం  కూడా ఆ ఆదర్శాన్ని సమ్మతించేవారిని మథనపరచింది.  వీటన్నిటిని ప్రధాన ప్రగతిశీల శిబిరాలు నివృత్తి చేయడానికి ప్రయత్నించలేదని కాదు. కానీ నివృత్తి పరచలేకపోయాయి.

       ఈ మొత్తం పరిణామాలను మేధకు గిరిగీసుకోకుండా వేయికళ్లతో  పరికించినవాడు బాలగోపాల్‌.  ప్రజాపక్షపాతం నుంచి, సమసమాజ ఆశయం నుంచి  పక్కకు జరగకుండా ఆ సంశయాలను నివృత్తి చేయడానికి ఆయన ప్రయత్నించారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే సమసమాజ ఆదర్శం మీదా, దాని సాధకుల మీద అపరిమితమైన ప్రేమతోనే ఆ అన్వేషణ చేశారు. ఆయన అన్వేషణ పునాది-ఉపరితలం, అవయవి-అవయవం, పదార్థం-చైతన్యం, వర్గస్వభావం-మానవప్రవృత్తి వంటి  సమస్యాత్వక ద్వంద్వాలపై లోతయిన తాత్విక చర్చగా జరిగి ఉండవచ్చు. కానీ, ఆ చర్చ సాహిత్యరంగంలో స్పృశించింది పైన చెప్పిన సంశయాలనే. ఎక్కడ ఆలోచన ఒక జడత్వానికి లోనయి అడుగుముందుకు పడని సందర్భం వచ్చిందో అక్కడ, ఆయన సాహసిించారు. ఆయన కూడా తొలిరోజులలో విశ్వాసాతిశయంతో మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. కాకపోతే, ఆయనను ముందుకు తీసుకువెళ్లిన సుగుణం- తాను బౌద్ధికంగా సమాధానపడేవరకు దేనీతోనూ పూర్తిగా సంతృప్తిచెందకపోవడం (ఆయన బౌద్ధంపై ప్రత్యేకంగా రాసినట్టు లేదు కానీ, తనమాటలైనా సరే సొంతంగా నిర్ధారించుకునేవరకు విశ్వసించవద్దని బుద్ధుడు చెప్పాడు).   అందువల్లనే మొదటి నుంచీ ఆయన సొంత పరిశీలనలకు, అంచనాలకు సాహసించేవారు.  ఆ సొంత దనం వైయక్తికమైన ఇష్టాయిష్టాలకు సంబంధించింది కాదు, వస్తుగతమైన అంచనాలో వ్యక్తమైన సొంతదనమే. 1982లోనే మరాఠీ దళిత సాహిత్యం గురించి రాస్తూ, మహారాష్ట్రలో దళితులను చేరుకోవడంలో కమ్యూనిస్టుల వైఫల్యం గురించి ఆత్మపరిశీలన జరగాలన్నారు. భవిష్యత్తులో చరిత్ర దిద్దుబాటు జరిగితే - అగ్రవర్ణ సంఘసంస్కర్తల స్థానాన్ని జ్యోతిబా ఫూలే తీసుకుంటాడని నిర్ధారణగా చెప్పారు. దళితసమస్య గురించి అప్పటి కమ్యూనిస్టుల దృక్పథమే బాలగోపాల్‌లో కనిపించినా, ఏ వర్గేతర ఉద్యమం నుంచి అయినా, దృక్పథం నుంచి అయినా మంచిని గ్రహించాలనే దృష్టి, కమ్యూనిస్టుల ఆచరణలో అయినా సిద్ధాంతంలో అయినా లోపం కనిపించినప్పుడు దాన్ని అలక్ష్యం చేయకూడదన్న పట్టింపు మొదటినుంచి ఆయనలో ఉన్నాయి. 1990 తరువాత తన తాత్విక అన్వేషణలో భాగంగాను, దానికి వాహికలుగాను బాలగోపాల్‌ చేసిన రచనలను, ముఖ్యంగా సాహిత్య రచనలను  పరిశీలించినప్పుడు ఆయన అభిప్రాయాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అస్తిత్వవాదాన్నీ, ఆధునికానంతరవాదాన్నీ నిందాపూర్వకంగాకాక, గ్రహించదగ్గ మంచి ఉన్న వాదాలుగా   నొక్కి చెప్పడం మొదలుపెట్టారు. 'నిరాశావాదం మానవ అనుభవంలోని అపరిపూర్ణతకూ అసమగ్రతకూ అపశ్రుతికీ పరమత్వాన్ని ఆపాదించి అస్తిత్వ వాద సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది. ఆ దృక్పథాన్ని మార్క్సిజం తిరస్కరించేముందు దాని ఆవిర్భావంలోని నిజమయిన సందిగ్ధాన్ని గుర్తించవలసిన అవసరం  ఉంది' (1991) అని ఆయన హెచ్చరించారు. ఆ సందిగ్ధానికి సాహిత్యంలో సహజమయిన స్థానం ఉంటుందని, పాట కంటె వచన కవిత్వమే ఆ సందిగ్దాన్ని వ్యక్తం చేస్తుందని, సందిగ్ధం బలపడినప్పుడు ప్రయోగ వైచిత్రీ అధివాస్తవికతా ప్రవే శిస్తాయని బాలగోపాల్‌ అన్నారు.రచనలు మంచివైపు మొగ్గుచూపితేనే ఉత్తమ సాహిత్యమన్న అభిప్రాయంతో  'మనిషి, చరిత్ర,మార్క్సిజం' (1993) వ్యాసంలో ఆయన  విభేదం ప్రకటించారు.  ఏ చారిత్రక పరిణామమయినా మనిషిలో ఆశలను,ఆకాంక్షలను, భయాలను, కుతూహలాన్ని  మేల్కొల్పుతుందని, అవి చీకటి కోణాలలో దాగి ఉన్న మానవ జీవిత విశేషాలపై కొత్త వెలుగులను ప్రసరింపచేస్తాయని, ఆ కొత్త వెలుగులో కనిపించే కొత్త భయాలు, కొత్త ఆశలు, కొత్త విషయాలు, కొత్తగా కనుగొన్న పాత విషయాలు గొప్ప సాహిత్యానికి కథావస్తువు- అని ఆ వ్యాసంలో ఆయన ప్రతిపాదించారు. ఈ వ్యాసంలోని అనేక అంశాల ఆధారంగా 2001లో ఇచ్చిన ఇంటర్వ్యూలో- సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరపాటని, సాహిత్యం పాత్ర జీవితమంత విస్త­ృతమైనదని వివరించారు. సాహిత్య సృజన మానవ అస్తిత్వంతో సన్నిహితంగా ముడిపడిన ప్రక్రియ అని, చైతన్యయుతంగా బతకవలసిన మనిషికి జీవితంలో తప్పనిసరిగా తారసపడే అసంపూర్ణతలను, ఖాళీలను సాహిత్యం, ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం భర్తీ చేస్తుందని, ఆ కర్తవ్యం తప్ప మరి దేన్ని సాహిత్యానికి విధించినా అది అర్థరహితమేనని బాలగోపాల్‌ అంటారు. సిద్ధాంతాలు, అనుభవాలు, దృక్పథాలు మరుగుపరచే వాస్తవికతను కూడా సాహిత్యం ప్రతిఫలిస్తుందని, అది ఏకకాలంలో జీవితమంత విస్త­ృతంగా వ్యవహరిస్తుందని బాలగోపాల్‌ చెబుతారు. సాహిత్య ప్రయోజనం గురించి, సాహిత్యంలో పక్షపాతాల గురించి- ఇంత కాలం స్థిరపడి ఉన్న మూస, అసమగ్ర అభిప్రాయాలన్నిటినీ ఆయన తన ప్రతిపాదనల ద్వారా పూర్వపక్షం చేశారు. సాహిత్యాన్ని సాహిత్యం చేసేది దాని రూపమే అని ఖండితంగా చెప్పారు. రూపం గురించి మాట్లాడితే, దానిమీద శ్రద్ధ చూపితే మైలపడిపోతామన్న దృష్టి ఉండకూడదన్నారు. అసంబద్ధ వాస్తవికతను చిత్రించే సాహిత్యం సాధారణ రూపంలో వ్యక్తం కాజాలదని చెబుతూ యుద్ధకాలం నాటి యూరోపియన్‌ కవిత్వాన్ని ఉదహరిస్తారు. కథనాలు కాలక్రమంలో మాత్రమే ఉండడం, శుష్క వాస్తవికత పరిధిలోనే ఊహలు సంచరించడం కాల్పనిక సాహిత్యానికి ప్రతిబంధకాలని  భావిస్తారు. మరణానంతర  జీవితం గురించి మానవజాతి చేసిన ఊహలు, వాటిని పాలకవర్గాలు ఎట్లా ఉపయోగించుకున్నదీ చెబుతూనే, రచయితకు అటువంటి ఊహలు అపరిమతమైన వెసులుబాటు కల్పిస్తాయని, వాస్తవికతావాదంలో సాధ్యంకాని సన్నివేశాలు, సందేశాలు ఈ రూపంలో సాధ్యపడతాయని చెబుతారు.  ఖాళీలను పూరించే సాహిత్యకర్తవ్యాన్ని సమసమాజ ఆశయసాధనకు ఎట్లా వినియోగించుకోవాలో ఆలోచించాలని, అందుకు పనికివచ్చే సాహిత్యసిద్ధాంతాన్ని రూపొందించుకోవాలని అంటారు. సాహిత్యానికి, విమర్శకు బాలగోపాల్‌ ఇచ్చిన ప్రాధాన్యం రీత్యా, ఆ రంగంలోనే ఆయన పెద్ద మార్పు ఆశించారు. వర్గచైతన్యంతో రాసిన సాహిత్యం కాక, ఇతరమయిన వాటిని అనుమానంతో, వ్యతిరేకతతో చూసే దృష్టిని కూడా ఆయన తప్పుపట్టారు. ఏదో ఒక పక్షం వహించడమే ఉత్తమసాహిత్యాన్ని గ్యారంటీ చేయదని చెప్పారు. సాహిత్యానికి ప్రజలను సంఘటితం చేయడం, చైతన్యపరచడం కాక మరెన్నో కర్తవ్యాలున్నాయని, జీవితంలో ఉద్యమాలు ఒక భాగం మాత్రమేనని అన్నారు. 'ప్రజానుకూల ఆచరణలో ఉన్నవారికి సైతం జీవితంలో సాహిత్యంలో సందిగ్ధాలు అనేకం సశేషంగానే ఉంటాయని, సాహిత్యంలో మనకు నచ్చనిధోరణులు కొనసాగుతూనే ఉంటాయని బాలగోపాల్‌ అంటారు.  వ్యక్తికీ మానవాళికీ మధ్యనున్న వైరుధ్యం పరిష్కారం కానంతవరకూ మనతో ఉండే ఈ అస్తిత్వ సందిగ్ధాలకు సాహిత్యంలో స్థానం ఉంటుందని మరచిపోతే పొరపాటన్నది ఆయన హెచ్చరిక.    
   
    ప్రస్తుతం విశ్వసిస్తున్న సిద్ధాంత చట్రం ద్వారా, ఆచరణ పద్ధతుల ద్వారా సమసమాజలక్ష్యాన్ని చేరుకోగలమా లేదా అన్నది ఆయన అన్వేషణల్లో ముఖ్యమైనది. మౌలికమయిన, అంతిమమయిన మార్పును కోరే చైతన్యశీలురు  అవతరించాలంటే, మానవ ప్రవృత్తిలోని వికార లక్షణాలను అధిగమించే పోరాటం కూడా చేయవలసి ఉంటుందని, సమసమాజం అంటే  ఏదో పొందడం కోసం విధించుకునే లక్ష్యం కాదని, అందరూ ఎంతో కొంత కోల్పోవడానికి కూడా సిద్ధపడినప్పుడే అది నెరవేరుతుందని ఆయన గుర్తుచేశారు. మానవప్రవృత్తిలోని అగాధాలను చాపల్యాలను అధిగమించి సమసమాజలక్ష్యానికి చేరువ కావాలంటే తదనుగుణమైన చైతన్యయుతమైన, సంకల్పపూర్వకమైన ఆచరణ కావాలని అంటూ,  మనుషులు దాన్ని సాధించగలరన‏్న  ఆశను కూడా బాలగోపాల్‌ వ్యక్తం చేస్తారు.
    తన దృక్పథంలో వచ్చిన మార్పులను సూచిస్తూ, గత ఆచరణను అభిప్రాయాలను సమీక్షించుకుని 'కల్లోల కథాచిత్రాలు' వ్యాససంకలనానికి వెనుకమాట రాశారు బాలగోపాల్‌. పౌరహక్కులు, రాజ్యస్వభావం మొదలైన అంశాల మీద తన మారిన అభిప్రాయాలను ఆయన అందులో సూచిస్తారు. బాలగోపాల్‌ తాత్విక సందేహాలను నివృత్తిచేసి, ఆయనకు కొత్త మార్గం చూపిన దృక్పథమేమిటో కూడా ఆ వ్యాసం లీలామాత్రంగా చెబుతుంది. తన సాహిత్యరచనలను కూడా  ఆ పద్ధతిలో సమీక్షించుకుని ఉంటే, మన పని సులువు అయ్యేది.
(కె. బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంకలనం ''రూపం-సారం : సాహిత్యం పై బాలగోపాల్ '' (2011 ) కు రాసిన ముందమాట. )
   No comments:

Post a Comment