Saturday, December 31, 2011

ఇటీవలి ముందుమాటలు-1

కొత్త ఆకాశాలను తెరిచిన బాలగోపాల్‌

    సంప్రదాయం, సాహిత్యం పాండిత్యం కలగలసిన కుటుంబనేపథ్యంలో పుట్టి అధ్యయనంతో గణితశాస్త్ర మేధావిగా ఎదిగిన వ్యక్తి, మార్క్సిజాన్ని చదువుకుని, చదువుకున్న దాన్ని ఆచరణలోకి అనువదిస్తూ, ఆచరణ అందించే పాఠాలను చదువులోకి పొందుపరుస్తూ, రెంటిలోని ఖాళీలనూ పూరించే ప్రయత్నం చేస్తే అది ఎటువంటి జీవితం?  మూడుదశాబ్దాల పాటు అత్యంత క్రియాశీలమైన,  అతి ప్రమాదభరితమైన, సంకల్పపూర్వకమైన అర్థవంతమయిన నిరాడంబర  జీవితం గడిపినప్పుడు-  అది ఎటువంటి వ్యక్తిత్వం?  ఏకకాలంలో  అసంఖ్యాక జీవితాలను జీవితాల్లోని అనేకానేక పార్శ్వాలనూ జీవించిన మనిషిది ఎటువంటి అనుభవం? అటువంటి జీవితమూ వ్యక్తిత్వమూ అనుభవమూ ఉన్న వ్యక్తి సాహిత్యానికి పరిశీలకుడిగా, వ్యాఖ్యాతగా, విమర్శకుడిగా లభిస్తే, ఆ సాహిత్యానిది ఎటువంటి 'అదృష్టం'?

    కె.బాలగోపాల్‌  విమర్శకుడిగా, సిద్ధాంతకర్తగా లభించడం తెలుగుసాహిత్యానికి చరిత్ర కల్పించిన ఒక అపురూపమైన అవకాశం. బాలగోపాల్‌ చేసిన సంభాషణతో తెలుగుసాహిత్యరంగం ఎంతవరకు మాట కలపగలిగింది, ఆయన చెప్పినవాటిని ఎంత వరకు విన్నది, ఎంత మేరకు చర్చించింది, చర్చించగలిగింది- అన్నవి వేరే ప్రశ్నలు.  ఆయన మాట్లాడారన్నదే ముఖ్యం.  మరో కాలంలో అయినా ఆయనను  వినడానికీ, మరోసందర్భంలో అయినా సంభాషించడానికీ ఆ రచనలు అవకాశం కల్పిస్తున్నాయన్నదే ఆనందం.

    తెలుగు సాహిత్యానికి బాలగోపాల్‌ చేసిందేమిటి? ఈ ప్రశ్న వేసుకోవడానికి ఇంతకాలం అవకాశమే రాలేదు. చాలా అరుదుగా మాత్రమే, కొన్ని ప్రత్యేక సందర్భాలు ఎదురయినప్పుడు లేదా కల్పించుకున్నప్పుడు మాత్రమే బాలగోపాల్‌ సాహిత్యరచనలు చేశారు. ఆయననుంచి సాహిత్యరచనలు ఆశిస్తూ ఉండినవారు, ఆయన హఠాత్తుగా ఇచ్చే ఆశ్చర్యాలను అందుకోవలసిందే తప్ప, హక్కుగా నిరీక్షించే అవకాశం లేకపోయింది.    2001లో 'ప్రజాతంత్ర' సాహిత్యసంచిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ తరవాత ఆయన సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడింది లేదు. పూనుకుని ఆయన చేత ఎవరైనా మాట్లాడించిందీ లేదు. 1993లో  'రాగో' నవల సందర్భంగా రాసిన వ్యాసం (మనిషి, చరిత్ర, మార్క్సిజం) తరువాత బాలగోపాల్‌ ప్రతిపత్తి ఉన్నట్టుండి మారిపోయింది.  అంతవరకు ఆయన ప్రతిష్ఠకు  ఒక ప్రధాన విప్లవ రాజకీయ శిబిరం జోడిస్తూ ఉండిన సాధికారత, ఆ వ్యాసం తరువాత పలచబడింది. బౌద్ధికంగాను ఆచరణలోను ఆయన నిజాయితీ తిరుగులేనివి కావడంతో,  రాజకీయానుబంధం వల్ల కలిగే సాధికారత లేకపోయినా నిలదొక్కుకోగలిగారు. ఆ సమయంలోనూ, ఆ తరువాత 'నక్సల్బరీ గమ్యం-గమనం' సందర్భంగానూ చర్చ జరగకపోలేదు కానీ, అది పాక్షికంగా మాత్రమే సాగింది. బాలగోపాలే చెప్పినట్టు 'రచనకు తాత్వికంగా స్పందించి ఉంటే అన్ని అంశాలు చర్చకు వచ్చేవేమో, కానీ తమ రాజకీయ విశ్వాసాల పైన దాడిగా దానిని భావించి స్పందించినవారే ఎక్కువ.' దశాబ్దానికి పైగా,  పై ప్రగతిశీల  ప్రధాన సాహిత్య స్రవంతి   విధించిన మౌనం కారణంగా బాలగోపాల్‌ విభిన్న ఆలోచనలు ఆయా రచనలలోనే మిగిలిపోయాయి. విప్లవ శిబిరమేకాదు, ఆ స్రవంతికి సమాంతరంగా వర్థిల్లిన గుర్తింపుఉద్యమాలు (గుర్తింపు ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు అన్న నామకరణాలపై బాలగోపాల్‌కు సైద్ధాంతికమయిన అభ్యంతరం ఉంది)  సైతం బాలగోపాల్‌ నుంచి మద్దతును స్వీకరించినంతగా, ఆయన ఆలోచనలను తీసుకోలేదు. ఫలితంగా ఆయన సాహిత్యవ్యక్తిత్వం ఒక తరం వారికి పెద్దగా పరిచయమే కాలేదు.  ఆయనను రచనలన్నిటినీ ఒక క్రమంలో అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి ఆయన నిష్క్రమణతో అవకాశం కలగడమే విషాదం.

    సాహిత్య సంబంధి రచనలు చేయడంతో సహా  బాలగోపాల్‌  సాహిత్యాచరణ అంతా

Thursday, December 29, 2011

ఉద్రిక్త గాంధర్వం, రఘునాథం కవిత్వం

రఘునాథం అంటే, దాశరథీ, కొనకళ్ల లలితగీతాలు గుర్తొస్తాయి. ఎంత గొప్ప గాయకుడు? పాటల్ని అతని గొంతు అద్భుతమైన అర్థాలలోకి అనువదించేది. అసలు రఘునాథమే ఒక లలితగీతం. శాస్త్రీయ, జన సంగీతాల మధ్య అతనొక లలితగీతం. అతని గొంతెప్పుడూ ఆకాశమంత ఎత్తునో, దిక్కులు పిక్కటిల్లే తీవ్రతనో ప్రకటించేది కాదు. మంద్రమైన గీతమే తప్ప ప్రభంజనగానం అతనికి తెలియ దు. కవిత్వంలోనూ అంతే.

రఘునాథం వెళ్లిపోయి ఏడాదైంది. ఎప్పుడో ఉన్నట్టుండి వినిపించే అతని పలకరింపు కోసం ఇంకా ఎదురుచూడడమే తప్ప, అతను లేడన్న సంగతి ఇంకా ఇంకలేదు. నిష్క్రమణకు చాలా కాలం ముందునుంచే అతను ఉండీలేనట్టుగా ఉండిపోవడం అలవాటు చేసుకున్నాడు. తనలో తానొక బీభత్స ఏకాంతాన్ని నిర్మించుకుని, అందులోనుంచే తొలుచుకున్న గవాక్షాల నుంచి ప్రపంచంతో సంభాషించేవాడు. అతని ఇష్టం, ఎప్పుడు ఏ పరిణామం అతన్ని కలవరపరుస్తుందో, ఎప్పుడు ఏ ఉద్వేగంలో వివశమవుతాడో, ఎప్పుడు ఏ కొత్త పొయెంను గర్భితం చేసుకుంటాడో- అప్పుడు అతను తగిన మనిషి కోసం తన గుడారం నుంచి మెడను బయటికి సాచేవాడు. క్లుప్తమో సుదీర్ఘమో అయిన ఒక సంభాషణ తరువాత తిరిగి తనను తాను ఉపసంహరించుకునేవాడు. సజీవ సంబంధం నిలుపుకుంటూనే అతిథిమిత్రుడిగా మెలిగేవాడు.

అదంతా చివరి సంవత్సరాల సంగతి. 70ల చివర్లో ఉస్మానియాను వెలిగించిన కవిత్వ దీపాలలో గుడిహాళం రఘునాథం ఒకడు. ఆశయాలూ ఆదర్శాలూ కవనకాంక్షా దట్టించిన రాబోవుయుగం దూతలలో అతనూ ఒక యువకుడు. సాహిత్యలోకంలోకి నావంటి విద్యార్థులను సిధారెడ్డి, సుంకిరెడ్డిలతో పాటు చేయిపట్టుకుని నడిపించుకుని వెళ్లినవాడు, పాత్రికేయ వృత్తిలో స్వల్పకాలమే అయినా సహచరుడయ్యాడు. అధ్యాపకుడయిన తరువాత అతని జీవనమార్గమే వేరయింది. కళ్లు వెలుగుతూనే ఉన్నాయి, హృదయం సంచలిస్తూనే ఉన్నది, స్పర్శ తడితడిగానే ఉన్నది, ఆ గొంతు పాడుతూనే ఉన్నది- ఎక్కడో ఏదో దారితప్పింది.

తెల్లవారినదని భ్రమసి చీకటిలో మాయతీగ తొక్కిన మాలదాసరి వలె అతను తప్పిపోయాడు. ఏ పాదరక్షలూ తనకు సరిపోవడం లేదని, ఏ ఛత్రమూ తనకు నీడనివ్వడం లేదని, ఏ జలమూ దాహం తీర్చడం లేదని సతమతమయ్యాడు. చీకటిని ద్వేషించడం మానలేదు, వెలుతురును ప్రేమించడమూ వదలలేదు. కళ్లు విప్పార్చి