Thursday, March 17, 2011

సరితా! ఓ సరితా!


(ఇదొక కుర్రతనపు చేష్ట. మహాకవిని పేరడీ చేసే విదూషకయత్నం.  నేనూ గడియారం శ్రీవత్సా కలసి 'శ్రీనివాస శ్రీవాత్సవ' పేరుతో రాసిన రాతల్లో ఇదీ ఒకటి. 1978-79 ప్రాంతాల్లో దీన్ని రాసి ఉండవచ్చు. సరితా! ఓ సరితా!! అన్నాము కాబట్టి, మరోచరిత్ర (1978) సినిమా విడుదల అయిన తరువాతే అని గట్టిగా చెప్పగలను.  నేనూ శ్రీవత్సా చాలా  కష్టపడి, చాలా రోజులు కసరత్తు చేసి మరీ దీన్ని రాశాము. అప్పట్లో ఆంధ్రసారస్వత పరిషత్తు హాల్‌లో ప్రతి నెలా మొదటి ఆదివారం సారస్వత వేదిక సమావేశాలు జరిగేవి, అందులో  ఒక అంశం మీద ప్రసంగం, చర్చ తరువాత- స్వీయకవితా పఠనానికి అవకాశం ఉండేది. ఈ కవితను నేను సారస్వత వేదికలో చదివాను. సభకు వచ్చినవారిలో ఉన్న చేకూరి రామారావు ఈ పేరడీని ప్రశంసించారు. సమావేశకర్త కె.కె.రంగనాథాచార్యులు, సభానంతరం నాతో మాట్లాడుతూ, తెలివితేటలన్నీ బాగానే ఉన్నాయి కానీ, బుర్రే కొంచెం రిపేర్‌ చేయాలయ్యా'- అని కామెంట్‌ చేశారు. దీన్ని  ఏ పత్రికకూ పంపే సాహసం మేము చేయలేదు. మేమే స్వయంగా సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూ ఉండిన 'కళాసౌరభం' సాహిత్య మాసపత్రిక ( ఎడిటర్‌-పి.వి.రాములు)లో 1983 మార్చి-ఏప్రిల్‌ సంచికలో ప్రచురించాము. ఆ ఏడే జూన్‌ 15 న కదా, శ్రీశ్రీ మరణించింది! ఆయన ఈ పేరడీ చూశారా? తెలియదు. ఈ పేరడీకవితలో అర్థాన్ని వెదకడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని, ఇన్నేళ్ల తరువాత మళ్లీ చదివినప్పుడు కూడా అనిపిస్తోంది. మాటకు పోటీగా మరో మాటపెట్టడం, అదే నడకను కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. కొన్ని పదరూపాలు వ్యాకరణరీత్యా. అర్థం రీత్యా అసాధ్యమైనవి అనిపిస్తాయి.  కొన్ని హద్దుమీరిన వ్యక్తీకరణలు కూడా అప్రయత్నంగా, పేరడీప్రయత్నంలో భాగంగానే వచ్చాయి తప్ప, ఉద్దేశించినవి కావేమో?  - కె.శ్రీనివాస్‌)సరితా! ఓ సరితా!
నీ కనుపాపల అరమూతల యమవాతావరణంలో
నిను నేనొక కుమూహూర్తంలో
సుమబంధుర సమ్యగ్వనమందున
తను బాధల ప్రహసించే
అందానికి అందంగా
పొరబడిన ఆ రోజుల్లో
నీకై గతుకే ఒక  బతుకై
తపియించిన థియేటర్లందున పార్ల్కందున
ఎటునే పోయిన జటిలాలంకారపు
కటుదనపుల కపటులలో
నీ రావం వినరానందున
నీ కటిగా, కూకటిగా, వేకటిగా
ఊహించుక మోహించిన రోజులు లేవా?

నీ దౌర్బల్యంలో
వరవీక్షా కక్షా తమోగవాక్షాలతో
చంచల సమాప్తిలో
వర్గోద్రేకపు కారణమై  పేలిన నా
అస్తిత్వంలో
ఏ ఏ రాతలు, మోతలు, గీతాల్‌ మొలిచాయో
నే నేయే చరిత్ర పత్రికాంతర్గత
పాచిమొహం చూచానో!
నా భూతం ఏ ఏ మోతలలో
తొలగి పారిపోయిందో
 నీకై నే వెదికిన వేయే వనులో
 ఏయే మూపుల మోసిన
రేషన్‌ బియ్యపు కీటకన్నినాదాలో
సడి లేకా కథలాలాపించిన
రాగా లాకార్షించిన
ప్రమోద సంధ్యా నిరంజనం
జవజవలాలించిన

Wednesday, March 2, 2011

అన్నిటికంటె మంచి కవిత

( ఇది  ఒక  అనువాద  కవిత.  సుప్రసిద్ధ  హిందీ కవి విష్ణు నాగర్ రాసిన 'సబ్ సే అచ్ఛా కవితా' అన్న కవిత కు నేను   చేసిన  అనువాదం ఇది.  2011  రిపబ్లిక్ డే సందర్భం గా  ఆకాశవాణి నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో నాగర్ చదివిన కవిత ఇది.  తెలుగు అనువాదం హైదరాబాద్ ఆకాశవాణిలో అదే రోజు ప్రసారం అయింది- కే. శ్రీనివాస్ ) 

అన్నిటికంటె మంచి కవిత
నమ్మ లేనంత వినయంగా ఉంటుంది
హిందీ అంత
సుందర సహజంగా ఉంటుంది

ఆపదలో ఎంతగా ఆదుకుంటుందంటే
అందులోవి అక్షరాలేనా అనిపిస్తుంది

అన్నిటికంటె మంచి  కవిత
అన్నిటి కంటే మంచి రోజుల్లో గుర్తుకు వస్తుంది
ఆ కవితను పాడే కంఠం
ఆపాత మధురం అనిపిస్తుంది

అన్నిటి కంటే మంచి  కవిత
కట్లు తెంపుకోవాలన్నంత
కలవర పరుస్తుంది

అన్నిటి కంటే మంచి కవిత
అన్నిటి కంటే మంచి తుపాకి నుంచి పేలిన
అన్నిటి కంటే చెడ్డ తూటా లా ఉంటుంది

అన్నిటి కంటే మంచి కవితను
అన్నిటి కంటే కష్టకాలంలో గుర్తు పట్టగలం
అది మనం చూస్తూ చూస్తూ ఉండగానే
అగ్గిలాగా మారిపోతుంది