Tuesday, February 22, 2011

బైరాగి కోసం ఓ గేయం

( ఇది ఒక బాల్య కవిత్వం. అప్పుడప్పుడే సాహిత్యం చదవడం, సమావేశాలకు వెళ్ళడం చేస్తున్నాను. గడియారం శ్రీవత్స అనే గురుమిత్రుడి స్నేహవాత్సల్యంలో ప్రపంచాన్ని తెలుసుకుంటున్న రోజులు. ఆయనతో కలిసి కొంత కాలం శ్రీనివాస శ్రీవాత్సవ - అన్న కలం పేరుతొ కొంత కవిత్వం రాశాను. ఆలూరి బైరాగి చనిపోయినతరువాత ఒక సంతాప సభకు వెళ్లి అక్కడి ప్రసంగాల మీద తో విరక్తితో దీన్ని రాసినట్టు పోయెం లోనే  ఆంతరంగిక సాక్ష్యం చూడవచ్చు. అంతకు మించి ఈ పోయెం రాసిన మూడ్ గురించిన జ్ఞాపకం ఏమీ లేదు. ఆ తరువాతే కావచ్చు- బైరాగి రాస్కెల్నికోవ్ పద్యానికి అనుకరణగా త్రోవ ఎక్కడ మానవా - అన్న పోయెం రాశాము- కే. శ్రీనివాస్ .)

మిధ్యామేధావుల అజీర్తి రోగాలను
భద్రంగా తన కడుపులో దాచుకొన్న
మరుగుదొడ్డి గ్రంథాలయాల్లో
మధ్యేమేధావుల ఆలోచనాగడ్డాల నడుమ
అనవుసరంగా పెరుగుతున్న
సిద్ధాంతాల పేన్లను తింటో పెరుగుతోంది
            మానవ జీవం

దేశం కోసం బుద్ధిజీవుల కపాలం మగ్గాల మీద
నేసిన సూత్రాల పట్టువస్త్రం
దర్జీవాడు దొరక్క మగ్గిపోతోంది
చీర అందాలు సరిదిద్దడానికి
కలంకారీ నిపుణులు తమబట్టతలల
అద్దాలు కుట్టే యత్నం చేస్తున్నారు.
బంగారుజరీతో సింగారించడానికి
తమవాగ్ధాటీ లోహాల్ని సాగదీస్తున్నారు.

సాహిత్యం జీవనదికి
స్తబ్ధతా ఆనకట్టలు కట్టి
బీడుమెదడు పల్లాల్లోకి కూడా
పారించినప్పుడు
నాశనమయ్యే చరిత్రశకలాలు
పాతకావ్యాల శిథిలాలు
పురాతన తరం హృదయ పురావస్తు శాలల్లో
మాత్రం భద్రపరచబడ్డాయి
నేడు కొత్తగా చేయబోయే
కవిత్వాశ్వమేథానికి వదిలిన
విశృంఖలత్వం గుర్రం
దొరక్కుండా పారిపోయింది
ఫ్యూడల వశిష్టుడు శిష్టవ్యావహారికంలో
ఫకాలున నవ్వాడు

ఆకలి ఆకాశాన్ని ఆశగాచూస్తూ
అందనిచుక్కలు కూరముక్కల్ని
నమిలితిందామని,
వెనక,రత్నమణిమయ కుడ్యాల వెనక

Monday, February 7, 2011

ఓపెన్ ఎండెడ్


 ఒక అనిర్దిష్ట కాలంలో జీవించేసాం

అనంతానంత దూరాలకు నడిచేవాళ్ళం, మా గిట్టల చప్పుడు మా గుండెల్లోంచే  వినిపించేది
కాలం పాదరసం లా ఉండేది, వెయ్యి కాళ్ళ హైడ్రా లా ఉండేది. కలలు కనడానికి కోటి గిగాబైట్ల మెమరీ ఉండేది

తీరిగ్గా ప్రపంచపు మూటను ముందేసుకునే వాళ్ళం
పల్లీలు వొలిచినట్టు
ఒక్కాక్క అబద్ధపు డొప్పను
పగలగొట్టే వాళ్ళం

ఒకానొక తద్ధర్మ కాలంలో జీవించాము

విరామ చిహ్నాలని తరుముతూ దీర్ఘ వాక్యం లో ప్రవహించాము
అమృతం కురిసిన రాత్రుళ్ళు
నిద్రను అదిలిస్తూ కాపు కాశాము
అడుగడుగుకు ఒక పాదు తీసి ఆశలను నాటుకుంటూ పోయాము 

ఏక కాలంలో అనేకానేక కాలాలలో  జీవించాము