Thursday, January 20, 2011

కొంచెం నీరు కొంచెం నిప్పు

( ఈ పోయెం 4 -8 -1996 ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితం అయింది. అప్పటికింకా తెలంగాణా ఉద్యమం మలి దశ ప్రారంభం కాలేదు.  అలమట్టి వివాదం అప్పుడప్పుడే మొదలైంది. మరోవైపున నల్లగొండ జిల్లా లో  సాగర్ నీటి కోసం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో తాగునీటి కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సమస్యను దేశం దృష్టికి తేవడానికి ఉద్యమ కారులు వందల సంఖ్యలో అభ్యర్థులను 1996  లోక సభ ఎన్నికలలో నిలబెట్టారు. నల్లగొండ బాలెట్ పేపర్ పొడువు అప్పట్లో పెద్ద సంచలనం. ఆ నేపథ్యం లోనిది పద్యం. ఈ పోయెం ను 'మత్తడి' కవితాసంకలనం  చేర్చారు.)


మహా  నదిని స్వప్నించి ఉపనదిగా మిగిలిపోయిన మా దేశం కథచెబుతాను. మరాఠీలూకన్నడిగులూ ముసల్మానులూ అందరం కలిసేఉండేవాళ్లం. 'తెలుగేం భాష' అన్నారేమో కానీ 'మీదేం తెలుగు' అని వాళ్లు మమ్మల్ని వెక్కిరించలేదు.  మా రెక్కల కష్టం ఏ కుక్కల కొడుకు బొక్కసానికో చేరినా మా దేశంలో పడ్డ వానచినుకు మాత్రం మా చెరువులోనే పారేది.

బహుశాఅప్పుడు అల్మట్టి    మా దేశంలోనే ఉండేది

***

దరిద్రుడి కంటబడితే దిష్టి తగులుతుందేమోనని కృష్ణమ్మ పాలమూరు పెరటి గుమ్మం నుంచే దాటుకుంటుంది. నందికొండ దగ్గర నీటిని పట్టారని వెడితే, మాను మా పెరట్లోనే ఉంది కానీ కాయలు కామందు కొంపలో రాలుతున్నాయి.
మూసీప్రాజెక్టు పేరెప్పుడైనా విన్నారా?
గోచి గుడ్డంత నేలను తడుపుతుందా చిన్న తల్లి
మూసీ అంటే ముక్కుమూసుకునే అన్నలారా? అది మమ్మల్ని   ఎన్నడూ మోసగించలేదు.

***

కవులుట్టి నీటికాకులు
పరాయినదులకే పరవశించిపోతారు
నాగర్జునసాగర  నారాయణరెడ్డీ, ఆడుతా జలకమ్ములాడుతా,ఎక్కడ?
సీమ కవి సుందరాచారీ,బిరబిరా కృష్ణమ్మ ఎక్కడయ్యా?
ఏసవితి తండ్రికీ  ఏమల్లెపూదండ?

***

నీరుపల్లమెరగదు
రక్తం కంటె నీరు చిక్కన
వాటర్‌లూ అనగా అంతిమయుద్ధము

***

కత్తులు మొలుస్తున్న కావేరి సాక్షిగా వచ్చే శతాబ్దిలో అన్నీ జలప్రళయాలేనట
ఒక్క నీటి బొట్టు కోసం వేనవేల టి .ఎం.సి.ల నెత్తురు పారుతుందట
జలస్తంభన చేసే దుర్యోధనులు తొడలు విరిగి చస్తారట

***

కన్నడంలోనూ టెల్గూలోనూ తెలంగాణంలోనూ నీరంటేనీరే
నారుపోసేవాడికి నీరివ్వనప్పుడు
తోడబుట్టిన వాడూ తొడగొట్టినవాడే
తమది కాని మాగాణికి ఆరగాణి అయిన వాళ్లం
మోచేతి ధార తగ్గితేనేం పెరిగితేనేం
ఎడమ కాల్వకు ఎడం చేత్తో కూడా జలబిచ్చం వేయనివాడా!
బారెడు బ్యాలట్‌ పేపర్‌తో బొక్కెనేసినా
చుక్కనీరు దక్కనప్పుడు
అరవై అడుగులు పెంచితేమాకేం?
అల్మట్టిని ఆకాశంలో కడితే మాకేం?
(నల్లగొండ జలసాధన సమితికి ప్రేమతో....)

Monday, January 10, 2011

మిడిల్ క్లాస్ యౌవనం

(గుడిహాళం రఘునాథం కవిత్వంలో నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి. ఏదో ఒకటి మాత్రమే ఎక్కువ ఇష్టం అని చెప్పలేను. 'మిడిల్‌క్లాస్‌  యౌవనం' పద్యంకూడా ఆయన కవిత్వంలో అత్యుత్తమమైనదని కాదు కానీ, మరో కారణం వల్ల ఇష్టం. నేను కొందరు మిత్రులతో కలసి 1980-81లో 'కళాసౌరభం' (సంపాదకుడు- పి.వి.రాములు) సాహిత్యప్రత్యేక సంచికకు సంపాదకత్వం వహించాము. నాటి యువ, సీనియర్‌కవులనేకులను కలసి సంచిక కోసం కవిత్వం సేకరించాము. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ హాస్టల్‌లో బోర్డర్‌గా ఉంటున్న (బహుశా ఎమ్‌.ఫిల్‌ చేస్తున్నాడనుకుంటానప్పుడు) రఘునాథం ఆ సంచికకు ఇచ్చిన కవిత ఇది. దినపత్రిక సంపాదకుడైన తరువాత  ఇటీవల కూడా రఘు పద్యాలను ప్రచురించాను కానీ, జీవిత, సాహిత్య ఆరంభయవ్వనాల్లో  ఆయననుంచి రాబట్టిన ఈ కవిత్వం అంటే ప్రత్యేకమైన ఇష్టం. 2010 డిసెంబర్‌ 28 నాడు నిష్క్రమించిన రఘునాథం చిరస్మ­ృతిలో ఈ పద్యం- కె.శ్రీనివాస్‌)


దేహంపై యౌవనం వాలింతర్వాతచ్చూసుకో
నదులు పుష్పించటవూఁ
వృక్షకాండాల్లోంచి పొంగి పొంగి
పచ్చని నురుగులు నర్తించటవూఁ
పగళ్లు సంతోషాల్తో గలగలమనిప్రవహించటవూఁ
రాత్రులు తమనల్లరబ్బరుబాహువుల్లో నన్నిమిడ్చుకోవటవూఁ
కలలు చిరుచిరు అలలుగా సెలయేళ్లుగా నీఎదలో జలజల మనటవూఁ
'బస్సుం'దరి  స్పర్శతో
బస్సే చిగురించి నట్టవటవూఁ
అర్థరాత్రి 'టీస్త్రీ' నీలోకి మెల మెల్లగానూ నెలివెచ్చగానూ
దిగి,
నీలో లీనమై పోవటవూఁ
పూలు పళ్లవటమూ
పళ్లు రహస్యంగా పద్యాలవటమూ
పద్యాలే చిర్వెన్నెల ప్రపంచాలవటమూ

వెన్నెల తోటలో
నేలను తాకీతాకనట్టు
నీవు నడవటవూఁ, పరిగెత్తటవూఁ--

నీకు తెలీకుండానే
మంచు వంతెన కరిగిపోతుంది
నీలోంచి ఒక్కోమెట్టూ దిగుతూ
 యౌవనం
ఒక్కోమెట్టూ నిన్ను దించుతుంది
కలలు శ్మశానాలౌతాయ్‌
పగళ్లు నీ కన్నీళ్లతోనే గలగలమని ప్రవహిస్తాయ్‌
రాత్రి చీకటి బ్రాకెట్‌ మరీ మరీ ఇరుకౌతుంది
నదీపుష్పం నిశ్శబ్దంగా వాడిపోతుంది
నీ  పద్యం
భళ్లున
బద్దలవుతుంది

(28.11.1980)