Saturday, December 31, 2011

ఇటీవలి ముందుమాటలు-1

కొత్త ఆకాశాలను తెరిచిన బాలగోపాల్‌

    సంప్రదాయం, సాహిత్యం పాండిత్యం కలగలసిన కుటుంబనేపథ్యంలో పుట్టి అధ్యయనంతో గణితశాస్త్ర మేధావిగా ఎదిగిన వ్యక్తి, మార్క్సిజాన్ని చదువుకుని, చదువుకున్న దాన్ని ఆచరణలోకి అనువదిస్తూ, ఆచరణ అందించే పాఠాలను చదువులోకి పొందుపరుస్తూ, రెంటిలోని ఖాళీలనూ పూరించే ప్రయత్నం చేస్తే అది ఎటువంటి జీవితం?  మూడుదశాబ్దాల పాటు అత్యంత క్రియాశీలమైన,  అతి ప్రమాదభరితమైన, సంకల్పపూర్వకమైన అర్థవంతమయిన నిరాడంబర  జీవితం గడిపినప్పుడు-  అది ఎటువంటి వ్యక్తిత్వం?  ఏకకాలంలో  అసంఖ్యాక జీవితాలను జీవితాల్లోని అనేకానేక పార్శ్వాలనూ జీవించిన మనిషిది ఎటువంటి అనుభవం? అటువంటి జీవితమూ వ్యక్తిత్వమూ అనుభవమూ ఉన్న వ్యక్తి సాహిత్యానికి పరిశీలకుడిగా, వ్యాఖ్యాతగా, విమర్శకుడిగా లభిస్తే, ఆ సాహిత్యానిది ఎటువంటి 'అదృష్టం'?

    కె.బాలగోపాల్‌  విమర్శకుడిగా, సిద్ధాంతకర్తగా లభించడం తెలుగుసాహిత్యానికి చరిత్ర కల్పించిన ఒక అపురూపమైన అవకాశం. బాలగోపాల్‌ చేసిన సంభాషణతో తెలుగుసాహిత్యరంగం ఎంతవరకు మాట కలపగలిగింది, ఆయన చెప్పినవాటిని ఎంత వరకు విన్నది, ఎంత మేరకు చర్చించింది, చర్చించగలిగింది- అన్నవి వేరే ప్రశ్నలు.  ఆయన మాట్లాడారన్నదే ముఖ్యం.  మరో కాలంలో అయినా ఆయనను  వినడానికీ, మరోసందర్భంలో అయినా సంభాషించడానికీ ఆ రచనలు అవకాశం కల్పిస్తున్నాయన్నదే ఆనందం.

    తెలుగు సాహిత్యానికి బాలగోపాల్‌ చేసిందేమిటి? ఈ ప్రశ్న వేసుకోవడానికి ఇంతకాలం అవకాశమే రాలేదు. చాలా అరుదుగా మాత్రమే, కొన్ని ప్రత్యేక సందర్భాలు ఎదురయినప్పుడు లేదా కల్పించుకున్నప్పుడు మాత్రమే బాలగోపాల్‌ సాహిత్యరచనలు చేశారు. ఆయననుంచి సాహిత్యరచనలు ఆశిస్తూ ఉండినవారు, ఆయన హఠాత్తుగా ఇచ్చే ఆశ్చర్యాలను అందుకోవలసిందే తప్ప, హక్కుగా నిరీక్షించే అవకాశం లేకపోయింది.    2001లో 'ప్రజాతంత్ర' సాహిత్యసంచిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ తరవాత ఆయన సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడింది లేదు. పూనుకుని ఆయన చేత ఎవరైనా మాట్లాడించిందీ లేదు. 1993లో  'రాగో' నవల సందర్భంగా రాసిన వ్యాసం (మనిషి, చరిత్ర, మార్క్సిజం) తరువాత బాలగోపాల్‌ ప్రతిపత్తి ఉన్నట్టుండి మారిపోయింది.  అంతవరకు ఆయన ప్రతిష్ఠకు  ఒక ప్రధాన విప్లవ రాజకీయ శిబిరం జోడిస్తూ ఉండిన సాధికారత, ఆ వ్యాసం తరువాత పలచబడింది. బౌద్ధికంగాను ఆచరణలోను ఆయన నిజాయితీ తిరుగులేనివి కావడంతో,  రాజకీయానుబంధం వల్ల కలిగే సాధికారత లేకపోయినా నిలదొక్కుకోగలిగారు. ఆ సమయంలోనూ, ఆ తరువాత 'నక్సల్బరీ గమ్యం-గమనం' సందర్భంగానూ చర్చ జరగకపోలేదు కానీ, అది పాక్షికంగా మాత్రమే సాగింది. బాలగోపాలే చెప్పినట్టు 'రచనకు తాత్వికంగా స్పందించి ఉంటే అన్ని అంశాలు చర్చకు వచ్చేవేమో, కానీ తమ రాజకీయ విశ్వాసాల పైన దాడిగా దానిని భావించి స్పందించినవారే ఎక్కువ.' దశాబ్దానికి పైగా,  పై ప్రగతిశీల  ప్రధాన సాహిత్య స్రవంతి   విధించిన మౌనం కారణంగా బాలగోపాల్‌ విభిన్న ఆలోచనలు ఆయా రచనలలోనే మిగిలిపోయాయి. విప్లవ శిబిరమేకాదు, ఆ స్రవంతికి సమాంతరంగా వర్థిల్లిన గుర్తింపుఉద్యమాలు (గుర్తింపు ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు అన్న నామకరణాలపై బాలగోపాల్‌కు సైద్ధాంతికమయిన అభ్యంతరం ఉంది)  సైతం బాలగోపాల్‌ నుంచి మద్దతును స్వీకరించినంతగా, ఆయన ఆలోచనలను తీసుకోలేదు. ఫలితంగా ఆయన సాహిత్యవ్యక్తిత్వం ఒక తరం వారికి పెద్దగా పరిచయమే కాలేదు.  ఆయనను రచనలన్నిటినీ ఒక క్రమంలో అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి ఆయన నిష్క్రమణతో అవకాశం కలగడమే విషాదం.

    సాహిత్య సంబంధి రచనలు చేయడంతో సహా  బాలగోపాల్‌  సాహిత్యాచరణ అంతా

Thursday, December 29, 2011

ఉద్రిక్త గాంధర్వం, రఘునాథం కవిత్వం

రఘునాథం అంటే, దాశరథీ, కొనకళ్ల లలితగీతాలు గుర్తొస్తాయి. ఎంత గొప్ప గాయకుడు? పాటల్ని అతని గొంతు అద్భుతమైన అర్థాలలోకి అనువదించేది. అసలు రఘునాథమే ఒక లలితగీతం. శాస్త్రీయ, జన సంగీతాల మధ్య అతనొక లలితగీతం. అతని గొంతెప్పుడూ ఆకాశమంత ఎత్తునో, దిక్కులు పిక్కటిల్లే తీవ్రతనో ప్రకటించేది కాదు. మంద్రమైన గీతమే తప్ప ప్రభంజనగానం అతనికి తెలియ దు. కవిత్వంలోనూ అంతే.

రఘునాథం వెళ్లిపోయి ఏడాదైంది. ఎప్పుడో ఉన్నట్టుండి వినిపించే అతని పలకరింపు కోసం ఇంకా ఎదురుచూడడమే తప్ప, అతను లేడన్న సంగతి ఇంకా ఇంకలేదు. నిష్క్రమణకు చాలా కాలం ముందునుంచే అతను ఉండీలేనట్టుగా ఉండిపోవడం అలవాటు చేసుకున్నాడు. తనలో తానొక బీభత్స ఏకాంతాన్ని నిర్మించుకుని, అందులోనుంచే తొలుచుకున్న గవాక్షాల నుంచి ప్రపంచంతో సంభాషించేవాడు. అతని ఇష్టం, ఎప్పుడు ఏ పరిణామం అతన్ని కలవరపరుస్తుందో, ఎప్పుడు ఏ ఉద్వేగంలో వివశమవుతాడో, ఎప్పుడు ఏ కొత్త పొయెంను గర్భితం చేసుకుంటాడో- అప్పుడు అతను తగిన మనిషి కోసం తన గుడారం నుంచి మెడను బయటికి సాచేవాడు. క్లుప్తమో సుదీర్ఘమో అయిన ఒక సంభాషణ తరువాత తిరిగి తనను తాను ఉపసంహరించుకునేవాడు. సజీవ సంబంధం నిలుపుకుంటూనే అతిథిమిత్రుడిగా మెలిగేవాడు.

అదంతా చివరి సంవత్సరాల సంగతి. 70ల చివర్లో ఉస్మానియాను వెలిగించిన కవిత్వ దీపాలలో గుడిహాళం రఘునాథం ఒకడు. ఆశయాలూ ఆదర్శాలూ కవనకాంక్షా దట్టించిన రాబోవుయుగం దూతలలో అతనూ ఒక యువకుడు. సాహిత్యలోకంలోకి నావంటి విద్యార్థులను సిధారెడ్డి, సుంకిరెడ్డిలతో పాటు చేయిపట్టుకుని నడిపించుకుని వెళ్లినవాడు, పాత్రికేయ వృత్తిలో స్వల్పకాలమే అయినా సహచరుడయ్యాడు. అధ్యాపకుడయిన తరువాత అతని జీవనమార్గమే వేరయింది. కళ్లు వెలుగుతూనే ఉన్నాయి, హృదయం సంచలిస్తూనే ఉన్నది, స్పర్శ తడితడిగానే ఉన్నది, ఆ గొంతు పాడుతూనే ఉన్నది- ఎక్కడో ఏదో దారితప్పింది.

తెల్లవారినదని భ్రమసి చీకటిలో మాయతీగ తొక్కిన మాలదాసరి వలె అతను తప్పిపోయాడు. ఏ పాదరక్షలూ తనకు సరిపోవడం లేదని, ఏ ఛత్రమూ తనకు నీడనివ్వడం లేదని, ఏ జలమూ దాహం తీర్చడం లేదని సతమతమయ్యాడు. చీకటిని ద్వేషించడం మానలేదు, వెలుతురును ప్రేమించడమూ వదలలేదు. కళ్లు విప్పార్చి

Friday, November 11, 2011

సంభాషణ సమీక్షలు

మొన్న ఆగస్ట్ లో విడుదల అయిన నా పుస్తకం "సంభాషణ" మీద వచ్చిన సమీక్షల్లో కొన్నింటిని ఇక్కడ చదవండి.Tuesday, August 16, 2011

వచనమై పుడుతున్నాను

విశిష్ట సభికులు 
..
.ఆవిష్కరణ 14 ఆగస్ట్ 2011 
సంభాషణ ముఖచిత్రం 

వాచ్యార్థంలో ఇవి సంభాషణలు కావు. కొన్ని కేవలం స్వగతాలు, మరి కొన్ని పలవరింతలు, ఇంకొన్ని మ్యూజింగ్స్‌. మొత్తం మీద అన్నీ మునివేళ్ల మీద నుంచి తొణికిన తలపోతలే.  ఒక అమూర్తమైన శ్రోతలసమూహంతో  వారి అనుమతిలేకుండా సాగించిన ఏకపక్ష సంభాషణలు. కొన్ని విరామాలతో 2004 నుంచి సుమారు ఐదారేళ్లపాటు చేసిన ఈ రచనలు ఇప్పుడు పుస్తకరూపంలో ఎంతవరకు ప్రాసంగికమో నాకు తెలియదు.

1992లో  ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికల్లో 'సింగిల్‌ కాలమ్‌' పేరుతో ఒక శీర్షిక రాశాను. ఈ సంభాషణలకు ఏదైనా ప్రత్యేకమైన శైలి అంటూ ఉంటే, దానికి  'సింగిల్‌కాలమ్‌'తోనే బీజం పడింది.  ఒక చిన్న వర్తమాన అంశం తీసుకుని, దానిచుట్టూ ఆలోచనలను అల్లుకుంటూ పోవడం లేదా ఆలోచనలను వర్తమానాన్ని అన్వయించడం- ఇటువంటిదే ఏదో ఒక పద్ధతి  ఈ రచనల్లో ఉందనుకుంటాను. మొదటినుంచి నాకు గద్యం మీదనే ఎక్కువ ప్రేమ. వచనంలో అతి సరళంగానూ, అతి గాఢంగానూ రాసే ప్రయత్నం చేయడం నాకు ఇష్టం. వచనంలో పోగలిగినన్ని పోకడలు పద్యంలో పోలేమేమో  అనిపిస్తుంది. వచనమై పుడతావ్‌ అని త్రిపురనేని శ్రీనివాస్‌ కవిత్వంలో శాపనార్థాలు పెడితే, మంచి వచనం రాసి చూపమని సవాల్‌ చేసేవాడిని. ఈ కాలమ్స్‌లో కొన్నిటిని ప్రశంసించడానికి అవి కవిత్వంలాగా ఉన్నాయని పాఠకులు అంటే, దానికి నేను అభ్యంతరం చెప్పేవాడిని. సంభాషణల్లోని

Tuesday, August 9, 2011

Thursday, August 4, 2011

నిషాద కవి

"అక్షరాలు అందరివే కాని ఏ కవి అక్షరాలు ఆ కవివే. రంగులన్నీ జలవర్ణాలు కానీ, తైలాలు కానీ, ఆర్గానిక్ కానీ అవన్నీ ప్రకృతివే. భాష సమాజానిదే, కానీ ఏ కవి డయలెక్ట్, ఏ కవి ఇడియొలక్ట్ వాడిదే, మహా అయితే అక్షరాలు వెధవ ఇంగ్లీషులో ఇరవై ఆరు సరే మహా అయితే దానికి నాలుగు బళ్లు. ఎవడి చేతిరాత వాడిదే ఎవడి బడి వాడిదే.'' (పునరపి) ఒక్కగానొక్క 'మో' వెళ్లిపోయాడు.

కవిత్వాన్ని చితిచింతనలో ముంచి ఆలపించిన వేగుంట మోహనప్రసాద్, తన శరీరంలోని జీవశేషాన్ని సమాజపరం చేసి జీవితం జిందాబాద్ అని నినదిస్తూ బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. దందహ్యమానమైన నాలుగు దశాబ్దాల తెలుగు కవిత్వావరణంలో ఒంటరి సామాజికునిలా సంచరించిన కవి నిష్క్రమించాడు. ఒకే ఒక్కడు మాట్లాడిన సాంధ్యభాష ఆగిపోయింది. ఒక 'ఆశ్వాసాంతం' జరిగిపోయింది.

దిగంబర కవిత్వోద్యమం ఉధృతంగా ఉన్న కాలంలో 1969లో మోహన్‌ప్రసాద్ మొదటి కవితాసంకలనం 'చితి-చింత' వచ్చింది. ఆ పుస్తకంలోని మొదటి కవిత 'నిరీహ' మొదటి పంక్తి 'అట్లా అని పెద్ద బాధా ఉండదు'- కవిత్వాభిమానులకు పారాయణ వాక్యమైంది. కవితకు అటువంటి ఎత్తుగడ, అటువంటి సరళమైన పదునైన వ్యక్తీకరణ పాఠకులకు సరికొత్తగా కనిపించాయి. అప్పటికి స్థిరపడి ఉన్న సాహిత్య సంస్కారానికి మోహన్‌ప్రసాద్ అనుమానాన్నీ, భయాన్నీ, వ్యతిరేకతనూ, దిగ్భ్రాంతినీ కూడా కలిగించారు. 'నీకోసం ఆపిల్ పళ్లు కోస్తూ చెయ్యి కోసుకున్న రక్తపుధారా హిమకిరణపు/ అంచున కళ్లు జారిపోతూ కన్నీటిబొట్లు రాలిపోతున్నట్లు/ విద్యుత్తు ప్రాకుతోన్న తీగల మీద వానత డి' (చితి-చింత) అన్వయం లోపించిన అస్పష్టాస్పష్ట భావావేశం వలె విమర్శకులకు కనిపించింది. 'చితి-చింత' పుస్తకంలోనే సహకవిగా స్వాగత వచనాలు చెప్పిన కె.వి.రమణారెడ్డికి

Tuesday, August 2, 2011

తెలుగు కవితను మోహీకరించిన వేగుంట మోహనప్రసాద్‌

బహిరంతర చైతన్యం            విచిత్రమేమంటే
            మెదడు కూడా
            శరీరంలానే
            కండరాల పోగు.
            నరాల పీటముడి.
            కుక్కగొడుగు లాంటి
            దాని ఆకారాన్నించే
            బుద్ధీ, దుర్బుద్ధీ
                                                                     ఉద్భవించేది.


అంచేత పైపైన తేలే
శరీరమే నయం.
ఎదో అనంతమైన వేదననిచ్చే సౌందర్యం
బ్రతుకంతా జ్వలించే రేఖాంచలాల ఆనందం
దేహం సత్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.

            ఎక్కడ్నించి వొస్తుందో
            విద్యుత్తు
            ఇచ్ఛాసూత్రాన వొచ్చి
            గాజుబంతినిండా
            తళుక్కున వెలుగుతుంది.

ఇలాగే సంకల్ప మాత్రాన
అదృశ్యమవుతుంది.
గాజుబుడ్డీ లాంటిదే
మన దేహం దీపం
ఎదో అలౌకికాలోచన
మెదడు నరాల్లోంచి
వెన్నెముకలోకి రాలిపోతుంది.

            వృద్ధాప్యంలోనో
            బాల్యంలోనో
            యౌవనంలోంచో
            ఎప్పుడో మన దేహం
            ఫిలమెంట్‌
            హఠాత్తుగ రాలిపోతుంది.


శిశువు, మృత్యువు
విచిత్ర వస్తువులు రెండు.
శిశువు
ఆంతర్యంలోంచి
బయటకు రాలిన ఆవరణ.
మృత్యువేమో
ఆవరణ ప్రాకారాలు కూలిన ఆంతర్యం.

            గర్భస్థ శిశువు పీల్చేఊపిరి.
            తాగే తల్లి నెత్తురు
            తానుగా వెలి ఐ పోవాలనే తపన.
            తన ఆంతర్యాన్ని బాహ్యంలో
            తనివి తీర చూచుకొనాలనే తల్లి తపన,
            లోపల తలకిందులుగ కూచుని
            చేతులు ఎవరికో నమస్కరిస్తో
            సమాధిలోని బాలయోగిలా
            ప్లెసెంటాకి అతుక్కుని
            అంతర్జీవనంలోంచి
            బహిర్జీవనంలోకి వచ్చి
            మాయను తెంపుకుని
            లోపలా బయటా చేసే తపస్సే జీవనం.
            జీవం ఉన్నంతవరకు
            మృత్యువు కోసం చేసే త పస్సే జీవనం!
            మాతృగర్భంలోనూ నేల ఒడిలోనూ.

(చితి-చింత నుంచి )
Friday, May 20, 2011

చెట్టుపాట


మూలగీతం-దివాకరన్‌ విష్ణుమంగళం (మలయాళం)

బాటసారీ,
నీడ కోసం  ఆశ్రయం కోసం  దాహపు కళ్లతో  మళ్లీ వచ్చావా?
దారిపొడవునా నిప్పుల గుండం లో  నడుస్తూ
చెమటలు కక్కుతూ మళ్లీ నా దగ్గరికి వచ్చావా?

నీడలు పోగుపడిన
నా పాదాల చెంతనే  తలలు పెట్టి
నీ పూర్వీకులు  సేదతీరారు.
అలసిన పాదచారులెందరికో  అవి  సంగీత సాంత్వన ఇచ్చాయి
జ్ఞానద్వారాల దగ్గర చీకట్లను చీల్చిన  పెద్దలు
నీ జ్ఞాపకాల్లో  ఇంకా మిగిలే ఉన్నారు.
కానీ ఈ చెట్టు మాత్రం కృశించిపోయింది,
దీని గుండెలో ఎండిన కొమ్మల్లో మిగిలిన తడి బొట్టుబొట్టుగా రాలుతూనే ఉన్నది.
రాత్రి  తరువాత రాత్రి కుటిలమైన చీకటిని ఈడుస్తూ
కళ్లు ఎండిపోయాయి, కన్నీళ్లతో నిండిపోయాయి.

మీ తరానికి వచ్చే సరికి వివేకపు ఊటలు ఎండిపోయాయి
ఓ దేశదిమ్మరి సంచారీ, ఓ పొడుపు కథ

Wednesday, May 11, 2011

పక్షి

చాలా సార్లు చచ్చిపోయాను కానీ
ఈ సారి మాత్రం కొంచెం  ఎక్కువే చచ్చిపోయాను

నాకు నేను కుంచించుకుపోయి
నానుంచే దాక్కునీ దాక్కునీ
ముడుచుకునీ ముడుచుకునీ
నా క్రీనీడలో నేనే కరిగిపోయీ

ఉనికినుంచి విడుదల లేదా అని గింజుకున్నాను
ఊపిరి  బొడ్డుతాడు  తెగదేమని అల్లాడిపోయాను 

అక్కడే
ఉన్నచోటే
నేలచూపులతో
గింగిరాలు కొడుతూ
ఎగిరిపోదేమి పక్షి?
యెంత చచ్చినా రాదేమి చావు?

బొంది ఒక బందిఖానా

దేవుడా ఈసారి మాత్రం
కాస్త సుఖ మరణం ప్రసాదించు

Tuesday, April 5, 2011

చివరి కోరిక

   అలెగ్జాండర్‌ వాంపిలోవ్‌

   (ఈ కథను పందొమ్మది వందల ఎనభై ప్రాంతంలో సోవియట్‌ లిటరేచర్‌పత్రికలో చదివి అనువదించాను. 'విపుల' పత్రికకు పంపించాను. వారంలోపే తిరిగి వచ్చేసింది. తరువాత,  కళాసౌరభం పత్రిక మార్చి-ఏప్రిల్‌ 1983సంచికలో ప్రచురించాను. కథ సులువుగా, చిన్నగా ఉండడం వల్ల అనువాదం అభ్యాసం చేయడానికి ఈ కథను అనువదించి ఉంటాను. అయితే, ఇది నా రెండో అనువాదం. మొదటి అనువాదం హిందీ నుంచి చేశాను. జయశంకర్‌ప్రసాద్‌ కథ 'మమత' మాకు పాఠ్యాంశంగా ఉండేది. దాన్ని తెలుగులో అనువదించి,హిందీప్రచారసభ వారి స్రవంతి పత్రికకు పంపితే వారు అచ్చువేశారు. అది 1976 నాటి సంగతి - కె.శ్రీనివాస్‌)
  
  
  
   నికొలాయ్‌ నికొలవిచ్‌ పనితీరిపోయింది.
   'నేనిక తొందర్లో పోతానేమో' కూతురు లిడియాతో సంజాయిషీ యిచ్చుకున్నట్లుగా మొదలు పెదిమల్ని చప్పరించి తరువాత విరిచి ఉన్నాడు. ఆమె ఆ గది తుడుస్తోంది.
   ' అలా అనకు- నూరేళ్లు నిండుగా బతుకుతావు' అందామె యథాలాపంగా. అతనలా అనడం- ఈమె యిలా చెప్పడం కొత్తేమీ కాదు.
   నిజానికి ఆ వయసు కూడా దూరంలో ఏం లేదు.
   వర్షాకాలపు ఆరంభంలోనే గుర్తించాడు నికొలాయ్‌ తనలో శక్తి పూర్తిగా క్షీణిస్తోందని! మనిషికి బతకలేని స్థితిని  శరీరం కల్పించినప్పుడే నిజంగా చావుని కాంక్షిస్తాడు. ఇంతవరకూ బలహీనంగా వున్నా ఏదో ధీమా వుండేది. ఈ సారి మాత్రం  సందేహం! కోరిక లాంటిది కూడా! వొచ్చే వసంతం వరకన్నా వుండాలని, మళ్లీ ఒకసారి చెట్లు చిగర్చడం చూడాలని వుంది. కోయిలలు పాడగా వినాలని వుంది! ఆ ఆకుపచ్చని స్వర్గంలో విహరించాలని వుంది!
   ఆ రుతువూ రాబోతోంది. కిటికీ కింద చిగురింత మొదలయిందప్పుడే. దూరంగా వున్న తోట అంతా ఈ ఆకురాలు కాలపు సూర్యుని మంటల్లో దగ్ధం అయినట్లే వుంది యింకా.
   నికొలాయ్‌, లిడియా ఇద్దరూ ఒంటరిగాండ్లు. లియా పిల్లలందరూ రెక్కలొచ్చిన పక్షులు. నికొలాయ్‌కి తెలుసు-- ఆమె తాను చనిపోగానే తన పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లిపోతుందని.
   వృద్ధాప్యపు అంచుల్లో వున్న తండ్రి, ఆరంభంలో వున్న కూతురు మృత్యువుకి స్వాగతం అన్నట్లుగా ఎప్పుడూ మౌనంగా జీవితంలోని అనుభవాలకి అశ్రుగీతం పాడుతుంటారు. డాక్టరు వొస్తాడు. అతనికి తెలుసు-- ఇదేమీ వ్యాధి కాదని.
   'ముసలి తనానికి మందేవిటి' అని అంటూంటాడు  అతను. నికొలాయ్‌ కొడుకు సెర్జీ కూడా అప్పుడప్పుడు  వొస్తాడు. అతడు చాలా బిజీ మనిషి. ఒక నిమిషం యిలా వస్తాడు. పరామర్శించి పోతాడు. ఈ సారి నికొలాయ్‌ అన్నాడు.
   'నాకు ఈ చలికాలంలో చావాలని లేదు. ప్రపంచం విరగబూసే కాలంలో కన్నుమూయాలని వుంది.'
   'మీ కేమయిందిప్పుడు... ఆరోగ్యంగా వున్నారు - అన్నాడు సెర్జీ.
   ఆ మాటల్లో మాధుర్యం తోచదు నికొలాయ్‌కి. అంత యథాలాపంగా

Thursday, March 17, 2011

సరితా! ఓ సరితా!


(ఇదొక కుర్రతనపు చేష్ట. మహాకవిని పేరడీ చేసే విదూషకయత్నం.  నేనూ గడియారం శ్రీవత్సా కలసి 'శ్రీనివాస శ్రీవాత్సవ' పేరుతో రాసిన రాతల్లో ఇదీ ఒకటి. 1978-79 ప్రాంతాల్లో దీన్ని రాసి ఉండవచ్చు. సరితా! ఓ సరితా!! అన్నాము కాబట్టి, మరోచరిత్ర (1978) సినిమా విడుదల అయిన తరువాతే అని గట్టిగా చెప్పగలను.  నేనూ శ్రీవత్సా చాలా  కష్టపడి, చాలా రోజులు కసరత్తు చేసి మరీ దీన్ని రాశాము. అప్పట్లో ఆంధ్రసారస్వత పరిషత్తు హాల్‌లో ప్రతి నెలా మొదటి ఆదివారం సారస్వత వేదిక సమావేశాలు జరిగేవి, అందులో  ఒక అంశం మీద ప్రసంగం, చర్చ తరువాత- స్వీయకవితా పఠనానికి అవకాశం ఉండేది. ఈ కవితను నేను సారస్వత వేదికలో చదివాను. సభకు వచ్చినవారిలో ఉన్న చేకూరి రామారావు ఈ పేరడీని ప్రశంసించారు. సమావేశకర్త కె.కె.రంగనాథాచార్యులు, సభానంతరం నాతో మాట్లాడుతూ, తెలివితేటలన్నీ బాగానే ఉన్నాయి కానీ, బుర్రే కొంచెం రిపేర్‌ చేయాలయ్యా'- అని కామెంట్‌ చేశారు. దీన్ని  ఏ పత్రికకూ పంపే సాహసం మేము చేయలేదు. మేమే స్వయంగా సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూ ఉండిన 'కళాసౌరభం' సాహిత్య మాసపత్రిక ( ఎడిటర్‌-పి.వి.రాములు)లో 1983 మార్చి-ఏప్రిల్‌ సంచికలో ప్రచురించాము. ఆ ఏడే జూన్‌ 15 న కదా, శ్రీశ్రీ మరణించింది! ఆయన ఈ పేరడీ చూశారా? తెలియదు. ఈ పేరడీకవితలో అర్థాన్ని వెదకడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని, ఇన్నేళ్ల తరువాత మళ్లీ చదివినప్పుడు కూడా అనిపిస్తోంది. మాటకు పోటీగా మరో మాటపెట్టడం, అదే నడకను కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. కొన్ని పదరూపాలు వ్యాకరణరీత్యా. అర్థం రీత్యా అసాధ్యమైనవి అనిపిస్తాయి.  కొన్ని హద్దుమీరిన వ్యక్తీకరణలు కూడా అప్రయత్నంగా, పేరడీప్రయత్నంలో భాగంగానే వచ్చాయి తప్ప, ఉద్దేశించినవి కావేమో?  - కె.శ్రీనివాస్‌)సరితా! ఓ సరితా!
నీ కనుపాపల అరమూతల యమవాతావరణంలో
నిను నేనొక కుమూహూర్తంలో
సుమబంధుర సమ్యగ్వనమందున
తను బాధల ప్రహసించే
అందానికి అందంగా
పొరబడిన ఆ రోజుల్లో
నీకై గతుకే ఒక  బతుకై
తపియించిన థియేటర్లందున పార్ల్కందున
ఎటునే పోయిన జటిలాలంకారపు
కటుదనపుల కపటులలో
నీ రావం వినరానందున
నీ కటిగా, కూకటిగా, వేకటిగా
ఊహించుక మోహించిన రోజులు లేవా?

నీ దౌర్బల్యంలో
వరవీక్షా కక్షా తమోగవాక్షాలతో
చంచల సమాప్తిలో
వర్గోద్రేకపు కారణమై  పేలిన నా
అస్తిత్వంలో
ఏ ఏ రాతలు, మోతలు, గీతాల్‌ మొలిచాయో
నే నేయే చరిత్ర పత్రికాంతర్గత
పాచిమొహం చూచానో!
నా భూతం ఏ ఏ మోతలలో
తొలగి పారిపోయిందో
 నీకై నే వెదికిన వేయే వనులో
 ఏయే మూపుల మోసిన
రేషన్‌ బియ్యపు కీటకన్నినాదాలో
సడి లేకా కథలాలాపించిన
రాగా లాకార్షించిన
ప్రమోద సంధ్యా నిరంజనం
జవజవలాలించిన

Wednesday, March 2, 2011

అన్నిటికంటె మంచి కవిత

( ఇది  ఒక  అనువాద  కవిత.  సుప్రసిద్ధ  హిందీ కవి విష్ణు నాగర్ రాసిన 'సబ్ సే అచ్ఛా కవితా' అన్న కవిత కు నేను   చేసిన  అనువాదం ఇది.  2011  రిపబ్లిక్ డే సందర్భం గా  ఆకాశవాణి నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో నాగర్ చదివిన కవిత ఇది.  తెలుగు అనువాదం హైదరాబాద్ ఆకాశవాణిలో అదే రోజు ప్రసారం అయింది- కే. శ్రీనివాస్ ) 

అన్నిటికంటె మంచి కవిత
నమ్మ లేనంత వినయంగా ఉంటుంది
హిందీ అంత
సుందర సహజంగా ఉంటుంది

ఆపదలో ఎంతగా ఆదుకుంటుందంటే
అందులోవి అక్షరాలేనా అనిపిస్తుంది

అన్నిటికంటె మంచి  కవిత
అన్నిటి కంటే మంచి రోజుల్లో గుర్తుకు వస్తుంది
ఆ కవితను పాడే కంఠం
ఆపాత మధురం అనిపిస్తుంది

అన్నిటి కంటే మంచి  కవిత
కట్లు తెంపుకోవాలన్నంత
కలవర పరుస్తుంది

అన్నిటి కంటే మంచి కవిత
అన్నిటి కంటే మంచి తుపాకి నుంచి పేలిన
అన్నిటి కంటే చెడ్డ తూటా లా ఉంటుంది

అన్నిటి కంటే మంచి కవితను
అన్నిటి కంటే కష్టకాలంలో గుర్తు పట్టగలం
అది మనం చూస్తూ చూస్తూ ఉండగానే
అగ్గిలాగా మారిపోతుంది

Tuesday, February 22, 2011

బైరాగి కోసం ఓ గేయం

( ఇది ఒక బాల్య కవిత్వం. అప్పుడప్పుడే సాహిత్యం చదవడం, సమావేశాలకు వెళ్ళడం చేస్తున్నాను. గడియారం శ్రీవత్స అనే గురుమిత్రుడి స్నేహవాత్సల్యంలో ప్రపంచాన్ని తెలుసుకుంటున్న రోజులు. ఆయనతో కలిసి కొంత కాలం శ్రీనివాస శ్రీవాత్సవ - అన్న కలం పేరుతొ కొంత కవిత్వం రాశాను. ఆలూరి బైరాగి చనిపోయినతరువాత ఒక సంతాప సభకు వెళ్లి అక్కడి ప్రసంగాల మీద తో విరక్తితో దీన్ని రాసినట్టు పోయెం లోనే  ఆంతరంగిక సాక్ష్యం చూడవచ్చు. అంతకు మించి ఈ పోయెం రాసిన మూడ్ గురించిన జ్ఞాపకం ఏమీ లేదు. ఆ తరువాతే కావచ్చు- బైరాగి రాస్కెల్నికోవ్ పద్యానికి అనుకరణగా త్రోవ ఎక్కడ మానవా - అన్న పోయెం రాశాము- కే. శ్రీనివాస్ .)

మిధ్యామేధావుల అజీర్తి రోగాలను
భద్రంగా తన కడుపులో దాచుకొన్న
మరుగుదొడ్డి గ్రంథాలయాల్లో
మధ్యేమేధావుల ఆలోచనాగడ్డాల నడుమ
అనవుసరంగా పెరుగుతున్న
సిద్ధాంతాల పేన్లను తింటో పెరుగుతోంది
            మానవ జీవం

దేశం కోసం బుద్ధిజీవుల కపాలం మగ్గాల మీద
నేసిన సూత్రాల పట్టువస్త్రం
దర్జీవాడు దొరక్క మగ్గిపోతోంది
చీర అందాలు సరిదిద్దడానికి
కలంకారీ నిపుణులు తమబట్టతలల
అద్దాలు కుట్టే యత్నం చేస్తున్నారు.
బంగారుజరీతో సింగారించడానికి
తమవాగ్ధాటీ లోహాల్ని సాగదీస్తున్నారు.

సాహిత్యం జీవనదికి
స్తబ్ధతా ఆనకట్టలు కట్టి
బీడుమెదడు పల్లాల్లోకి కూడా
పారించినప్పుడు
నాశనమయ్యే చరిత్రశకలాలు
పాతకావ్యాల శిథిలాలు
పురాతన తరం హృదయ పురావస్తు శాలల్లో
మాత్రం భద్రపరచబడ్డాయి
నేడు కొత్తగా చేయబోయే
కవిత్వాశ్వమేథానికి వదిలిన
విశృంఖలత్వం గుర్రం
దొరక్కుండా పారిపోయింది
ఫ్యూడల వశిష్టుడు శిష్టవ్యావహారికంలో
ఫకాలున నవ్వాడు

ఆకలి ఆకాశాన్ని ఆశగాచూస్తూ
అందనిచుక్కలు కూరముక్కల్ని
నమిలితిందామని,
వెనక,రత్నమణిమయ కుడ్యాల వెనక

Monday, February 7, 2011

ఓపెన్ ఎండెడ్


 ఒక అనిర్దిష్ట కాలంలో జీవించేసాం

అనంతానంత దూరాలకు నడిచేవాళ్ళం, మా గిట్టల చప్పుడు మా గుండెల్లోంచే  వినిపించేది
కాలం పాదరసం లా ఉండేది, వెయ్యి కాళ్ళ హైడ్రా లా ఉండేది. కలలు కనడానికి కోటి గిగాబైట్ల మెమరీ ఉండేది

తీరిగ్గా ప్రపంచపు మూటను ముందేసుకునే వాళ్ళం
పల్లీలు వొలిచినట్టు
ఒక్కాక్క అబద్ధపు డొప్పను
పగలగొట్టే వాళ్ళం

ఒకానొక తద్ధర్మ కాలంలో జీవించాము

విరామ చిహ్నాలని తరుముతూ దీర్ఘ వాక్యం లో ప్రవహించాము
అమృతం కురిసిన రాత్రుళ్ళు
నిద్రను అదిలిస్తూ కాపు కాశాము
అడుగడుగుకు ఒక పాదు తీసి ఆశలను నాటుకుంటూ పోయాము 

ఏక కాలంలో అనేకానేక కాలాలలో  జీవించాము


Thursday, January 20, 2011

కొంచెం నీరు కొంచెం నిప్పు

( ఈ పోయెం 4 -8 -1996 ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితం అయింది. అప్పటికింకా తెలంగాణా ఉద్యమం మలి దశ ప్రారంభం కాలేదు.  అలమట్టి వివాదం అప్పుడప్పుడే మొదలైంది. మరోవైపున నల్లగొండ జిల్లా లో  సాగర్ నీటి కోసం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో తాగునీటి కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సమస్యను దేశం దృష్టికి తేవడానికి ఉద్యమ కారులు వందల సంఖ్యలో అభ్యర్థులను 1996  లోక సభ ఎన్నికలలో నిలబెట్టారు. నల్లగొండ బాలెట్ పేపర్ పొడువు అప్పట్లో పెద్ద సంచలనం. ఆ నేపథ్యం లోనిది పద్యం. ఈ పోయెం ను 'మత్తడి' కవితాసంకలనం  చేర్చారు.)


మహా  నదిని స్వప్నించి ఉపనదిగా మిగిలిపోయిన మా దేశం కథచెబుతాను. మరాఠీలూకన్నడిగులూ ముసల్మానులూ అందరం కలిసేఉండేవాళ్లం. 'తెలుగేం భాష' అన్నారేమో కానీ 'మీదేం తెలుగు' అని వాళ్లు మమ్మల్ని వెక్కిరించలేదు.  మా రెక్కల కష్టం ఏ కుక్కల కొడుకు బొక్కసానికో చేరినా మా దేశంలో పడ్డ వానచినుకు మాత్రం మా చెరువులోనే పారేది.

బహుశాఅప్పుడు అల్మట్టి    మా దేశంలోనే ఉండేది

***

దరిద్రుడి కంటబడితే దిష్టి తగులుతుందేమోనని కృష్ణమ్మ పాలమూరు పెరటి గుమ్మం నుంచే దాటుకుంటుంది. నందికొండ దగ్గర నీటిని పట్టారని వెడితే, మాను మా పెరట్లోనే ఉంది కానీ కాయలు కామందు కొంపలో రాలుతున్నాయి.
మూసీప్రాజెక్టు పేరెప్పుడైనా విన్నారా?
గోచి గుడ్డంత నేలను తడుపుతుందా చిన్న తల్లి
మూసీ అంటే ముక్కుమూసుకునే అన్నలారా? అది మమ్మల్ని   ఎన్నడూ మోసగించలేదు.

***

కవులుట్టి నీటికాకులు
పరాయినదులకే పరవశించిపోతారు
నాగర్జునసాగర  నారాయణరెడ్డీ, ఆడుతా జలకమ్ములాడుతా,ఎక్కడ?
సీమ కవి సుందరాచారీ,బిరబిరా కృష్ణమ్మ ఎక్కడయ్యా?
ఏసవితి తండ్రికీ  ఏమల్లెపూదండ?

***

నీరుపల్లమెరగదు
రక్తం కంటె నీరు చిక్కన
వాటర్‌లూ అనగా అంతిమయుద్ధము

***

కత్తులు మొలుస్తున్న కావేరి సాక్షిగా వచ్చే శతాబ్దిలో అన్నీ జలప్రళయాలేనట
ఒక్క నీటి బొట్టు కోసం వేనవేల టి .ఎం.సి.ల నెత్తురు పారుతుందట
జలస్తంభన చేసే దుర్యోధనులు తొడలు విరిగి చస్తారట

***

కన్నడంలోనూ టెల్గూలోనూ తెలంగాణంలోనూ నీరంటేనీరే
నారుపోసేవాడికి నీరివ్వనప్పుడు
తోడబుట్టిన వాడూ తొడగొట్టినవాడే
తమది కాని మాగాణికి ఆరగాణి అయిన వాళ్లం
మోచేతి ధార తగ్గితేనేం పెరిగితేనేం
ఎడమ కాల్వకు ఎడం చేత్తో కూడా జలబిచ్చం వేయనివాడా!
బారెడు బ్యాలట్‌ పేపర్‌తో బొక్కెనేసినా
చుక్కనీరు దక్కనప్పుడు
అరవై అడుగులు పెంచితేమాకేం?
అల్మట్టిని ఆకాశంలో కడితే మాకేం?
(నల్లగొండ జలసాధన సమితికి ప్రేమతో....)

Monday, January 10, 2011

మిడిల్ క్లాస్ యౌవనం

(గుడిహాళం రఘునాథం కవిత్వంలో నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి. ఏదో ఒకటి మాత్రమే ఎక్కువ ఇష్టం అని చెప్పలేను. 'మిడిల్‌క్లాస్‌  యౌవనం' పద్యంకూడా ఆయన కవిత్వంలో అత్యుత్తమమైనదని కాదు కానీ, మరో కారణం వల్ల ఇష్టం. నేను కొందరు మిత్రులతో కలసి 1980-81లో 'కళాసౌరభం' (సంపాదకుడు- పి.వి.రాములు) సాహిత్యప్రత్యేక సంచికకు సంపాదకత్వం వహించాము. నాటి యువ, సీనియర్‌కవులనేకులను కలసి సంచిక కోసం కవిత్వం సేకరించాము. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ హాస్టల్‌లో బోర్డర్‌గా ఉంటున్న (బహుశా ఎమ్‌.ఫిల్‌ చేస్తున్నాడనుకుంటానప్పుడు) రఘునాథం ఆ సంచికకు ఇచ్చిన కవిత ఇది. దినపత్రిక సంపాదకుడైన తరువాత  ఇటీవల కూడా రఘు పద్యాలను ప్రచురించాను కానీ, జీవిత, సాహిత్య ఆరంభయవ్వనాల్లో  ఆయననుంచి రాబట్టిన ఈ కవిత్వం అంటే ప్రత్యేకమైన ఇష్టం. 2010 డిసెంబర్‌ 28 నాడు నిష్క్రమించిన రఘునాథం చిరస్మ­ృతిలో ఈ పద్యం- కె.శ్రీనివాస్‌)


దేహంపై యౌవనం వాలింతర్వాతచ్చూసుకో
నదులు పుష్పించటవూఁ
వృక్షకాండాల్లోంచి పొంగి పొంగి
పచ్చని నురుగులు నర్తించటవూఁ
పగళ్లు సంతోషాల్తో గలగలమనిప్రవహించటవూఁ
రాత్రులు తమనల్లరబ్బరుబాహువుల్లో నన్నిమిడ్చుకోవటవూఁ
కలలు చిరుచిరు అలలుగా సెలయేళ్లుగా నీఎదలో జలజల మనటవూఁ
'బస్సుం'దరి  స్పర్శతో
బస్సే చిగురించి నట్టవటవూఁ
అర్థరాత్రి 'టీస్త్రీ' నీలోకి మెల మెల్లగానూ నెలివెచ్చగానూ
దిగి,
నీలో లీనమై పోవటవూఁ
పూలు పళ్లవటమూ
పళ్లు రహస్యంగా పద్యాలవటమూ
పద్యాలే చిర్వెన్నెల ప్రపంచాలవటమూ

వెన్నెల తోటలో
నేలను తాకీతాకనట్టు
నీవు నడవటవూఁ, పరిగెత్తటవూఁ--

నీకు తెలీకుండానే
మంచు వంతెన కరిగిపోతుంది
నీలోంచి ఒక్కోమెట్టూ దిగుతూ
 యౌవనం
ఒక్కోమెట్టూ నిన్ను దించుతుంది
కలలు శ్మశానాలౌతాయ్‌
పగళ్లు నీ కన్నీళ్లతోనే గలగలమని ప్రవహిస్తాయ్‌
రాత్రి చీకటి బ్రాకెట్‌ మరీ మరీ ఇరుకౌతుంది
నదీపుష్పం నిశ్శబ్దంగా వాడిపోతుంది
నీ  పద్యం
భళ్లున
బద్దలవుతుంది

(28.11.1980)