Tuesday, November 30, 2010

లేట్ నైన్టీస్: కొన్ని శకలాలు

(ఇవన్నీ పూర్తికాని పద్యాలు, ఆరంభచరణంలోనే  ఆగిపోయిన పద్యాలు.. 96-98 మధ్య కాలంలో అప్పుడప్పుడూ హృదయతాడనంతో పగిలిపోయిన పద్యాలు, ఒక దానికి మరో దానికీ సంబంధం లేని పద్యాలు - కె.శ్రీనివాస్‌)


1
అసిధారగా ప్రవహిస్తున్న జీవితానివి
మృత్యుడేరాను ముట్టివచ్చిన అమృతానివి
కసికి పదునుపెట్టి కారుణ్యఖడ్గం చేసిన కృషివి

రిక్తహస్తాల ప్రేమ నాది

మైదా ' లై ' అంటని మలిన హస్తాలు నావి
కరపత్రికలు ప్రవహించని ఎడారి అరచేతులు నావి
నినాద వేదాలు పలకని అపస్వరపేటిక నాది

రిక్తహస్తాల నిరర్ధక ప్రేమ నాది

ప్రేక్షక ప్రేమ నాది


2
ఎటువంటి కాలంలో జీవిస్తున్నాం మనం

తలుపులు బార్లా తెరచిన దేశంలో
ఎంతటి రహస్యమరణాన్ని రుచిచూస్తున్నాం
చావుకేకలూ పురుటినెప్పులూ కలగలసిన
ఎంతటి బీభత్స సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం

తరచు మార్చురీల ముందే  కలుసుకుంటున్నాం
అంగుళం జరిగిన మరణాన్ని  చూసి ఆనందపడుతున్నాం
కోటగుమ్మాల ముందు శవయాచన చేస్తున్నాం
పిరికితనానికి కూడా గతిలేని
నిర్బంధ ధైర్యంతో నినదిస్తున్నాం

నలుగురం కూడినప్పుడల్లా ఐదోవాడి సంతాపసభ జరుపుకుంటున్నాం

3
కలలన్నీ కిట్‌బ్యాగుల్లో సర్దుకుని
వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు
నేను కూడా వీడ్కోలు చెప్పాను
విజయం సాధించి వచ్చేప్పుడు
నాక్కూడా వో విముక్తి తెమ్మని వినయంగా అడిగాను

4
తృణమూ ప ణమూ కాదు ప్రాణమంటే
ఆత్మార్పణ త్యాగరాజ కీర్తనలనిక ఆపి
కలగానిది విలువైనది నేర్చుకోమందాం

5
బాలగోపాల్‌ ఏంచెప్పాడో విన్నాం మరి
ఇక పోల్‌పాట్‌  ఏం చెబుతాడో చూద్దాం

6
అసయ్యాన్ని గుట్కాలాగా అంగిట్లో పెట్టుకుని
పరిమళభరితంగా ఎలా మాట్లాడను?


7
ఇంకెవరి దగ్గరా పడుకోవద్దని మాటతీసుకుని మరీ పెళ్లాడతాం
ప్రేమలేఖల్లోకి ప్రవ హించకుండా దాచిపెట్టిన పీనల్‌కోడ్‌ను పెళ్లిపీటలమీద ఆవిష్కరిస్తాం
హక్కుభుక్కం కాగానే అంగిట్లో దాచిన రెండు కోరల్నీ నిస్సిగ్గుగా ప్రదర్శిస్తాం
సమస్త నీతిశాస్త్రాల్నీ తొడల మధ్య వేలాడదీసి గర్భాశయం  మీద మన పేరే చెక్కుకుంటాం

Wednesday, November 3, 2010

వాగర్థ

ఆ క్షణమున  నిరక్షరాస్యుడనే అయినాను.

పేర్చిన మాటలు, కూర్చిన వాక్యములు పేకమేడల వలె కూలిపోయినవి. సహపంక్తికి భీతిల్లి వర్ణములన్నియు చెదిరిపోయినవి. శిశిరపర్ణముల వలె, తెగిన శిరముల వలె, శీర్ణ స్వప్నముల వలె అక్షరములు అనర్థములైనవి.
రణరంగమునకు నిరాయుధుడిని, విపణివీధికి నిర్ధనుడిని అయినాను.

నిఘంటువున్నియు నిషిద్ధములైనవి. అర్థములన్నియు చెలామణినుండి వైదొలగినవి. నాకు నేనే ఒక కోలాహలమువలె ధ్వనించుచుంటిని.

***
ఒక ఆశ్వాసన, ఒక ధైర్యం, ఒక వాగ్దానం, ఒక నమ్మకం, ఒక ప్రేమ మాటలో పలకాలంటే గుండె గొంతుకలోన కొట్లాడాలి.  మనసును అనువదిస్తే తప్ప, భాష బాసగా మారదు. అబ్బురపడితేనో, అతిభయమేదో ఎదురవుతేనో మాత్రమే కాదు, లోలోపల  ఆత్మ హరించుకుపోతే కూడా అవాక్కవుతావు. మాట్లాడడానికి ఏమీ లేకపోవడమంటే, హృదయంలో భూకంపం జరుగుతోందన్న మాట. మాట్లాడలేకపోతున్నావంటే, మనసును ఒక అపస్వరపేటిక ఆవహించిందన్నమాట. మాటలు పలకలేని సత్యాన్నేదో ఆవిష్కరించినప్పుడు మౌనివవుతావు. తోసుకువచ్చే అపశబ్దాలకు భయపడినప్పుడు మూగవవుతావు.

అక్షరమక్షరాన్ని సానదీసి, పదునుపెడితే ఎప్పటికో అప్పటికి రసవిద్య పట్టుబడుతుంది. నంగి నంగిగా బెరుకు బెరుకుగా మొదలైన మాట రాను రాను రాగమవుతుంది. కూతనేర్చిన తరువాత కాకి కోకిల అవుతుంది. మాట మంత్రమవుతుంది. కోటలు కట్టవచ్చు, పేటలు కూల్చవచ్చు, కనికట్టవచ్చు, ఉచ్చులల్లవచ్చు, మభ్యపెట్టవచ్చు. ప్రతిసృష్టి చేయవచ్చు.  దూరాలను