Wednesday, September 8, 2010

గ్రామర్‌ వర్సెస్‌ గ్రామర్‌


(ఇది 1997లోనో 1998లోనో రాసింది.  ఇది కవిత్వం కాదని, 'వచనం' అనీ అనుకునే రాశాను. వార్త ఆదివారం సంచికలో దీన్ని వచనరచనగానే - కాకపోతే యథాతథ పంక్తి విభజనతో- ప్రచురించారు. ఆరోజుల్లో ఎన్‌కౌంటర్లలో మరణించిన విప్లవకారుల మృతదేహాలను అప్పగించడానికి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే, గద్దర్‌ ఆధ్వర్యంలో మృతదేహాల స్వాధీనకమిటీ ఏర్పడి పనిచేసింది. ఆ కమిటీ పేరే బీభత్సంగా కనిపించింది. అటువంటి పదబంధాలు ఏర్పడే పరిస్థితిలో ఉన్న అమానవీయత గురించి రాయాలనిపించి దీన్ని రాశాను. తరువాతి కాలంలో సందర్భం, సంభాషణ కాలమ్స్‌లోని రచనాపద్ధతికి బహుశా ఇది పూర్వరూపం. - కె.శ్రీనివాస్‌)ఊదా రంగు ఆకాశం ఆకుపచ్చగా ఆవులించింది

****

వ్యాకరణాల సంకెళ్లను తెంచేయమని మహాకవులు ఆవేశంగా ఏదో అంటుంటారు కానీ,
చూడగా చూడగా స్వేచ్ఛ అమితంగా వున్న వ్యవస్థ ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అంటే వ్యాకరణం ఒక్కటే కనిపిస్తున్నది.
  
అర్థంతో సంబంధం లేదు, అపార్థంతో సంబంధంలేదు, సత్యం లేదు అసత్యం లేదు పాపపుణ్యాలు లేవు నీతి అవినీతులు లేవు రాజభక్తా రాజద్రోహమా నిమిత్తం లేదు. కర్తకర్మక్రియ వుంటే చాలు, వాటి మధ్య విభక్తి ప్రత్యయాల సంబంధం వుంటే చాలు అది వ్యాకరణబద్ధమైన వాక్యమై పోతుంది.

పరమ అబద్ధం కూడా వ్యాకరణ బద్ధంగానే   వుంటుంది.

పదాల స్వరూపం మాత్రమే వ్యాకరణం అని భ్రమపడ్డ పండితులు అరసున్నాలనూ బండిరాలనూ రక్షించుకోవాలనుకున్నారు. వ్యాకరణం ఇవ్వగలిగే అపారమైన స్వేచ్ఛను, వాని ప్రమాదాన్నీ ప్రయోజనాన్నీ పండితులూ గుర్తించలేదు. వారి ప్రత్యర్థులూ గుర్తించలేదు.

కవులూ భావుకులూ మాత్రమే నాడు నేడు ఈ వెసులుబాటును ఉపయోగించుకుని వెర్రిమొర్రి వూహలెన్నో చేశారు. అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో వదిలేయమన్నారు.

****

మద్యసంబంధ నేరాలు పెరిగి దుష్టశక్తులు పెరిగిపోతున్నందును మొదట మద్యనిషేధాన్ని సడలించి, దుష్టశక్తులను అణచి ఆ తర్వాత మద్యనిషేధాన్ని  కొనసాగించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ వాదించారు.

****

పదాలకీ వాటి అర్థాలకీ మధ్య సంబంధం నిర్హేతుకమైనదని భాషాశాస్త్రజ్ఞులు అంటారు. పదార్థాల సంబంధం పదార్థాల సంబంధం వంటిదేనని పార్వతీపరమేశ్వరుల సంబంధం అటవంటిదేననీ కాళిదాసు అన్నాడు.

పదాలే కాదు వాక్యాలు కూడా వాటి అర్థాలకు జవాబుదారీ కావు.

కొన్ని నామవాచకాలూ కొన్ని సర్వనామాలూ కొన్ని విశేషణాలూ కొన్ని క్రియలూ కుమ్మరించినంతమాత్రాన అవన్నీ కలసి యిచ్చే అర్థం మనం పోల్చుకోగలుగుతామని నియమమేం లేదు.

పాలు నల్లగా వుంటాయన్న వాక్యం పాలను నల్లగా మార్చలేదు.

మన దగ్గరున్న పదాలతో మనం లెక్కలేనన్ని వాక్యాలను, అర్థాలను సృష్టించగలం, వాటికి