Monday, August 23, 2010

మహాసాహిత్యసౌధపు 'ముంగిలి'

చరిత్ర అంటే గతంలో జరిగిన సంఘటనల సమాహారం కానట్టే, చరిత్ర రచన కూడా కేవలం విద్యావిషయకమైన విన్యాసం కాదు. చరిత్రలోకి తొంగిచూసి ఏ వాస్తవాలను వెలికితీస్తామనేది వర్తమానంలోని అవసరాలను బట్టే, ప్రధానంగా రాజకీయ అవసరాలను బట్టే నిర్ణయమవుతుంది. సుంకిరెడ్డి నారాయణరెడ్డి కూర్చిన తెలంగాణ ప్రాచీన సాహిత్య సర్వస్వం 'ముంగిలి'- ఒక చారిత్రకావసరం నుంచి జరిగిన చరిత్రరచన. ఇప్పటిదాకా వచ్చిన తెలుగు సాహిత్యచరిత్రల్లో తెలంగాణ ప్రాంత సాహిత్యానికి, కవులకు తగినంత గుర్తింపు, ప్రాధాన్యం లభించలేదన్న నిర్ధారణ నుంచి, తెలుగుసాహిత్యాన్ని కొత్తగా దర్శించే ప్రయత్నం. 'తెలంగాణ' అని నేడు రాజకీయంగా, సాంస్క­ృతికంగా చెబుతున్న ప్రాంతం నుంచి వచ్చిన కవులను, కావ్యాలను ప్రత్యేకంగా వేరుచేసి, వారి, వాటి గుణగణాలను, ఔన్నత్యాన్ని చాటి చెప్పే రచన.

తెలుగువారి చరిత్రలో కానీ, సాహిత్యచరిత్రలో కానీ తెలంగాణ ప్రాంతానికి ఇతోధిక స్థానం లభించకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇరవయ్యోశతాబ్దంతో పాటే దేశంలో పెరిగిన జాతీయభావన, ప్రజాస్వామిక ఆకాంక్షలు- రానున్న కాలంలో పాలనాధికారం విస్త­ృత జనశ్రేణుల నుంచే వస్తుందని సూచనలు పంపసాగాయి. కొత్త సమాజంలో ఆధిపత్యం కోసం వివిధ ప్రాబల్యవర్గాలు రకరకాల ప్రయత్నాలు చేయసాగారు. అందులో భాగంగా తమ తమ సామాజిక వర్గాలకు చరిత్ర ద్వారా సాధికారత సంపాదించే ఆలోచనా కలిగింది. తెలుగువారి చరిత్రను వెలికితీసే పరిశోధక కృషిని ప్రోత్సహించి, పోషించిన వారంతా సంస్థానాధీశులు, రాజాలు కావడం యాదృచ్ఛికం కాదు. ఈ మహాప్రయత్నంలో నిజాము పాలిత తెలుగుప్రాంతాలు అనాదరణకు గురయ్యాయి.

తెలుగువారే కాని కుతుబ్‌షాహీలు, ఏ కులమో తెలియని కాకతీయుల కన్నా, చిన్న చిన్న రాజ్యాలు పాలించిన రెడ్డిరాజులు, శ్రీనాథుని వంటి ఇతర ప్రాంత కవిపండితులను ఆదరించిన పద్మనాయకులు, తెలుగు అవునో కాదో తెలియకపోయినా తెలుగుసాహిత్యాన్ని పోషించిన విజయనగరరాజులు- తెలుగువారి చరిత్రలో పెద్దపీట పొందారు. బ్రిటిష్ పాలన చరిత్ర పురాతత్వశోధనకు అనువుగా ఉన్నంతగా నిజాము పాలన

Friday, August 20, 2010

విరిగిన చెరుకు విల్లు

(ప్రవాసీసాహిత్యం- అన్న  మాట కేవలం పరాయిదేశం వెళ్లి రాసేవాళ్లకే వర్తిస్తుందా? వలసలు రకరకాల కారణాలతో జరుగుతాయి. రకరకాల ప్రదేశాలకూ జరుగుతాయి. అంతర్గత వలసలు మాత్రం సాహిత్యాన్ని సృష్టించవా? పాత కళ్లతో కొత్త ప్రదేశాన్ని చూడడం, సొంత విలువలతో పరాయి సమాజాన్ని అంచనావేయడం ఉండవా? దాన్ని మాత్రం డయాస్పోరా అనకూడదా?- ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలే.  తక్కిన తెలుగు ప్రాంతాల నుంచి తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు  ప్రయాణాలు అనేక విడతలుగా జరిగాయి.  సందర్శకులో, వలసపక్షులో హైదరాబాద్‌ మీద అనేక అభిప్రాయాలను, అంచనాలను చెప్పారు. మాట వరసగా చెప్పారు, మంచితనంతో చెప్పారు, పొగుడుతూ చెప్పారు, హీనపరుస్తూనూ చెప్పారు. హైదరాబాద్‌ గురించి ఇతర ప్రాంతాల కవులూ రచయితలూ ఏమిచెప్పారో సూచన ప్రాయంగా చెప్పడానికి ఈ వ్యాసంలో ప్రయత్నించాను. ప్రధానంగా హైదరాబాద్‌ విధ్వంసం గురించి రాసినప్పటికీ, ఇందులో తీసుకున్నవన్నీ సాహిత్యకళారంగాల ఉదాహరణలే. ఒక పెద్ద పరిశీలనకు, పరిశోధనకు ప్రాతిపదికగా పనికివస్తుందన్న ఉద్దేశం కూడా ఈ వ్యాసరచనలో ఉన్నది. 2003లోనో, 2004లోనో రాసిన ఈ వ్యాసం 'సోయి' పత్రికలో ప్రచురితమైంది.  - కె.శ్రీనివాస్‌)


ఈ సంవత్సరం ఫిబ్రవరి 16 ఆదివారం నాడు హైదరాబాద్‌ నగరంలోని సుమారు లక్షమంది ముస్లిములు ఎండిపోయిన గండిపేట గుండెల మీద 'అల్లా'కు మోకరిల్లి, నీటి కోసం ప్రార్థించారు. అదొక అపురూపమైన దృశ్యం. మనుషులు సామూహికంగాచేసే చర్యల్లో మనల్ని అంతగా విచలింపజేసే సన్నివేశాలు చాలా అరుదుగా తారసపడతాయి. మరుసటిరోజు హైదరాబాద్‌ ఆకాశం మంత్రకవాటం తెరుచుకుని చిరుజల్లు కురిసినప్పుడు, మానవీయ సంకల్పానికి అద్భుత శక్తులు సమకూరతాయని ఒక క్షణం నమ్మాలనిపించింది.

మంజీరను కూడా దిగతాగిన కొత్తనగరం, ఇప్పుడు కృష్ణానదిని సాగర్‌నుంచి పగ్గంవేసి లాగుదామా, జూరాల నుంచి జుట్టుపట్టుకుని ఈడ్చుకుతెద్దామా కలలుకంటున్నది తప్ప, తొలినాటి కామధేనువులు కబేళాపాలవుతున్నందుకు కన్నీరు కార్చే సోయి దానికి లేదు. ఈ నగరం ఎవ్వరిదో వారే దాని కోసం విలపించాలి, వేడుకోవాలి. ఎవరి బొడ్డుపేగు ఈ నగరగర్భంతో ముడిపడి ఉన్నదో వారే గుండెలు బాదుకోవాలి.

ఈ హైదరాబాద్‌ ఎవరిది? చేపలతో సరస్సు నిండినట్టు, జనంతో ఈ నగరం నిండిపోనీ అని ఆకాంక్షించాడు నగరనిర్మాత కులీకుతుబ్‌ షా. మూడురోజుల పాటు మూసీ ఉప్పొంగిన ప్రళయకాలంలో నగరముఖద్వారం దగ్గర నిలుచుని రోదించాడు మహబూబ్‌ అలీ. మరెన్నడూ ముప్పురాకుండా విశ్వేశ్వరయ్య సాయంతో రెండు సాగరాలు నిర్మించాడు ఉస్మాన్‌అలీఖాన్‌. మూసీ ఎగువన మూడుపువ్వులుగా, దిగువన ఆరుకాయలుగా వ్యాపారం చేస్తున్న పరాయి షరాబులకు, ఒక పాతబస్తీని దరిద్రానికి గుర్తుగాచేసి, ఒక కొత్త బస్తీని మధ్యతరగతి పాతబస్తీగా మలచి, అమీర్‌పేట్‌ జూబ్లీహిల్స్‌ మాదాపూర్‌ రహదారిగా హైటెక్‌సిటీని నిర్మించి, ఇప్పుడు షంషాబాద్‌ను అంతర్జాతీయకేంద్రంగా తీర్చిదిద్ది తెలంగాణాను అపహసిస్తున్న వలసదొరలకు ఏ ఆకాంక్షా లేదు. చదరపు గజాలు తప్ప నేల తెలియదు. కాలనీలు, పార్కులు, ఫామ్‌హౌజ్‌లు,ఆర్కేడ్‌లు, ఎస్టేట్‌లు తప్ప జనం తెలియదు.

ఈ నగరం పరాయిగా మారిన చరిత్ర విచిత్రమైనది. స్థానికులెవరు, పరాయిలెవరు నిర్ణయించిన ప్రాతిపదికలలో మతానికి ఎన్నడూ ప్రాధాన్యమే లేదు. 1930 దశాబ్దంలో, తిరిగి 1950 దశాబ్దం ప్రారంభంలో ముల్కీ ఉద్యమాలు వచ్చినప్పుడు ఉత్తరాదినుంచి వచ్చిన ముస్లిములు, మద్రాసురాష్ట్రం నుంచి వచ్చిన హిందువులు పరాయివారయ్యారు. విశాలాంధ్ర అవతరించిన తరువాత ఈ  లెక్కలలో తేడా వచ్చింది. భారతదేశంలో విలీనమైన తరువాత కొన్ని ప్రత్యేక సదుపాయాలను కోల్పోయిన హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత