Friday, July 30, 2010

చిన్న చిన్న పర్సనల్‌ పద్యాలు

(ఇవన్నీ  అప్పుడప్పుడు రాసుకున్న చిన్న చిన్న పర్సనల్‌ పద్యాలు.  ఇవన్నీ నా మలిదశ కవత్వ ప్రయత్నాలని అనుకుంటాను. 1985 కంటెముందు రాసుకున్న కవిత్వం, అచ్చువేసినకవిత్వం - అదొక తరహాది. 1985 తరువాత ఎక్కువగా ఆత్మాశ్రయంగా రాశానేమో, వాటిని కేవలం వ్యక్తిగతం అనుకున్నానేమో, చాలా మటుకు అచ్చుకు ఇవ్వలేదు. నా నోట్‌బుక్స్‌లో మాత్రమే అవి ఉండిపోయాయి.  వీటిల్లో  కొన్ని అసంపూర్తిగా వదిలేసిన కవితలు కావచ్చు,కొన్నిటి సందర్భాలు కూడా గుర్తులేవు. కొన్నిటికి శీర్షికలు ఇప్పుడు పెట్టవలసి వచ్చింది. కాకపోతే, వెనక్కి తిరిగి చూసుకుంటే మరీ అంత చెత్తగా ఏమీ లేవని అనిపించింది. పర్సనల్‌, పబ్లిక్‌ స్థలాల విచిత్ర సమ్మేళనం అయిన బ్లాగ్‌లో వీటిని ప్రచురించడానికి అభ్యంతరం అనిపించడం లేదు. -కె.శ్రీనివాస్‌)


రాత్రి

అందర్నీ నిద్రపోయాక రాత్రి నన్నొక్కణ్నీ నంజుకుతింటుంది. ప్రపంచమంతా తలలో కిక్కిరిసిపోయాక ఇంక వూపిరేం ఆడ్తుంది. ఫ్రిజ్‌లో పూలుంటాయి, తలలో పేలుంటాయి, మనం మూసేసిన కిటికీ అవతల దోమలూ చంద్రుడూ వుంటాయి. నేను వొదిలిన గాలినీ, పొగనీ గిలకొట్టి ఫ్యాన్‌ మోతగా మన ల్ని వుడకబెడుతుంది.

కళ్లు మూసుకుని నేను మాయమయిపోతే రేపొస్తుంది. రేపంటే ఓ సుప్రభాతమూ, వో బంగారపుటెండా కాక అబద్ధపు కాగితప్పువ్వుల్ని మాలగా కట్టడానికి చేసే ప్రయాణమన్నమాట. రేపంటే అంతే, నడిచి నడిచి వెళ్లి కొంత చీమూ నెత్తూరూ అమ్ముకుని నడిచి నడిచి రావడమన్నమాట.

వేళ్ల సందుల్లో కొంత మృత్యువుంది. దాన్ని పీల్చాక నుసైపోయిన వో సుదూరభవిష్యత్తు వో  బంగారు రేకుపెట్టెలో కంపుగొడుతూ వుంటుంది. గుండెల్లో వేడి పొగ నెప్పీ తలలో దెయ్యమూ  ఆదమరిస్తే చాలు నాలోకి దూకడానికి గదిబయట పొంచివున్న పీడకలా, పక్కనే అలసిపడుకున్న నువ్వూ, తీరిగ్గా నేను ఖాళీచేసుకుంటున్న నేనూ, -- ఈ రాత్రి బావుంది. నిద్రపోయిన సత్రంలాగా, మార్చ్యురీలాగా నా మనసు. గుడ్‌నైట్‌
(1987 మార్చి 9 అర్థరాత్రి)


ఓపద్యం రాసి చేతులు దులిపేసుకోనా  పూర్ణా!

అందమైన ఆ రెండు పాదాలూ
పదబంధ ప్రహేళికై నన్ను పెనవేసుకున్నట్టు
అలినీలాలక వేణి అలలు అలలుగా  ఎగిరిపడ్డట్టు
శుభ్రజ్యోత్స్న మందారాలు కరతలామలాకలాలయినట్టు

నాకలలు యింకా పచ్చిగానే వున్నాయి పూర్ణా!

నువ్వూనేనూ పంచుకున్న రహస్యమేమిటో చెప్పు
రెండు లిప్తలు దాటి విరిగిపోయిన
        నా దృక్‌స్పర్శకు నీ సమాధానమేమిటో చెప్పు
ఎంత పనిచేశావు పూర్ణా
(1990)  ( పూర్ణ- నామవాచకం కాదు)


పరవాలేదు


నా ఏటవాలు చూపు
నీ పైటను సవరించినప్పుడో
పొట్టముడతల్లో చిక్కుకుపోయిన నా కనుగుడ్డును
పెకిలించుకుంటున్నప్పుడో
తప్ప
అంతా అమలినంగానే జరిగిపోయింది

రెండుచూపులూ స్పర్శించుకోగానే
వో అయస్కాంత క్షేత్రం

Saturday, July 17, 2010

దుర్గమారణ్యంలో దారులు వేసిన సురవరం

ఆయనేమన్నా దొరా దేశ్‌ముఖా- ఈ ప్రశ్నను కొండా వెంకట రంగారెడ్డి వేశారట. 1952లో హైదరాబాద్‌ రాష్ట్ర మొట్టమొదటి 'ప్రజాస్వామ్య' ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరిని నియమించాలో సూచిస్తూ ఒక జాబితా పట్టుకుని బూర్గుల రామకృష్ణారావు ఢిల్లీకి పయనమైనప్పుడు, ఆ జాబితాలో ప్రతాపరెడ్డి పేరు చూసి రంగారెడ్డి ఆ ప్రశ్న వేశారట. హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ శాసనసభ్యులంతా దాదాపు రంగారెడ్డి వర్గీయులే కావడంతో, ప్రతాపరెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు.  బదులుగా డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తామంటే ఆయన ఒప్పుకోలేదట.  ఇదంతా జరిగి ఉండకపోతే, హైదరాబాద్‌ రాష్ట్రానికి ప్రతాపరెడ్డి తొలివిద్యామంత్రి అయి ఉండేవారు.

దొరా కాకుండా దేశ్‌ముఖూ కాకుండా ప్రతాపరెడ్డి ఏమిటి? కమ్యూనిస్టా? " ఆయన దొరలపక్షాన లేడు,అలాగని  వారితో పోరాటమూ చేయలేదు''- అని ప్రతాపరెడ్డి పెద్ద కుమారుడు ఎస్‌.ఎన్‌.రెడ్డి పదేళ్ల కిందట ఈ వ్యాసకర్తతో అన్నారు. కమ్యూనిస్టులను దారుణహింసావాదులని, కామరేడులని విమర్శించన సంపాదకుడు కమ్యూనిస్టు కాదు కదా? పోనీ జాతీయవాద పక్షంలో క్రియాశీల పాత్రధారా? నిజాం ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఆయనను నిర్బం«ధించలేదే?  సాహిత్యసాంస్క­ృతిక అంశాలకు ప్రాధాన్యం తగ్గుతున్నదని ఆంధ్రమహాసభనుంచి ఎడం జరిగిన ముక్కుసూటిమనిషికి జాతీయవాదులు మాత్రం పూర్తి యోగ్యులుగా కనిపించి ఉంటారా? ఒక సంపన్న రైతు కుటుంబంలో పుట్టి, బ్రిటిష్‌ ఆంధ్రలో ఉన్నతవిద్య అభ్యసించి, తెలంగాణ ప్రాంతంలో సాంస్క­ృతిక, రాజకీయ వికసనానికి సారథ్యం వహించిన 'శిష్ట' బృందంలో ఒకరుగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డిని మదింపు వేయడం అంత సులభం కాదు. వైతాళికులనీ, పునరుజ్జీవన ప్రేరకులనీ మనం చెప్పుకునే ఇతరులకు వర్తించే అనేక అంశాలు ఆయనకు వర్తించవు. ఆయన కార్యక్షేత్రంగా ఉన్న నేల, ఆయన జీవించిన కాలం, అప్పుడు నడిచిన చరిత్ర- అన్నీ ఆయన దోహదాలను ప్రత్యేకం చేశాయి, విశిష్టం చేశాయి. ఆయన కథకుడు, విమర్శకుడు,కవి, పండితుడు, చరిత్రకారుడు, పరిశోధకుడు, పత్రికాసంపాదకుడు, గ్రంథాలయ ఉద్యమనాయకుడు, అరుంధతీయ ఉద్యమ భాగస్వామి,నాయకుడు,  భాషాభిమాని, తొట్టతొలి నైజామాంధ్ర మహాసభ అధ్యక్షుడు.

రాజకీయవాదులూ, సాహిత్యసాంస్క­ృతిక కార్యకర్తలూ, సంస్కర్తలూ వేరువేరుగా 'అవతరించేంత వ్యవధి కానీ, వెసులుబాటుగానీ, చైతన్య విస్త­ృతి కానీ లేనిది ఆనాటి తెలంగాణ. పునాదులు

Tuesday, July 6, 2010

పర్సనల్ పద్యాలు - 4

ఒంటరి ఏకాంతం

             ఒక క్షణిక స్ఫురణ
            తెగిన బల్లితోక విలవిల

పొద్దున్నే గది వూడ్చాను దీపపు పురుగుల రెక్కలు
సిగరెట్‌ పీకలు ఎండిపోయిన అక్షరాల మరకలు
పగిలిన కలవరింతలు

            ఎడతెగని నిరీక్షణ
            చూయింగ్‌ గమ్‌

అలలాగా వచ్చి రాత్రి ఈ నత్తగుల్లల్ని వదిలి
వెళ్లింది
            వొక్క నలిగిన పువ్వైనా లేదు

(సెప్టెంబర్‌ 1992లో ఒక రోజు రాత్రి)