Wednesday, June 23, 2010

పర్సనల్ పద్యాలు - ౩

ఒక  restricted   కాల్ 

ఇప్పుడిక ప్రసారానికి అంతరాయం
డయలు చేయవలసిన నంబరు అందుబాటులో ఉండదు
వేళ్ళు కదిలినా కీ పాడ్ ని హత్తుకున్నా గొంతు పెగలదు
అనేబుల్ టు రీచ్

బాల్కనీ ఆకాశంలోకి  చూసినప్పుడు ఒక ఒంటరి నక్షత్రం కనిపిస్తుంది
నీ చూపులని  పీల్చి అది  నా కన్నీటి పొరపై  ప్రతిఫలిస్తుంది
సమీప సముద్రం నుంచి వాయవ్యంగా ఒక గాలి తరగ వీస్తుంది
నీ తను పరిమళాన్ని అది నాకు చందనమై పూస్తుంది

మూగబోయాము నిజమే కానీ
జరజరా పాకే నా జ్ఞాపక స్పర్శని నువ్వు ప్రేమగా  విదిలించుకుంటూనే ఉంటావు
క్షణానికోసారి ఒంటరి కౌగిలిలో నీ ఖాళీని నేను  తడుముకుంటూనే ఉంటాను

ఉన్నట్టుండి ఒక స్ఫురణ నై నీ పెదాల చివర ముసిముసి నవ్వవుతాను
చెప్ చెప్ చెప్ చెప్ అంటూ నువ్వు గింగిర్ల గొంతుతో గుసగుసల గిలిగింత పెడతావు


ఇష్టమే ఒక టవర్  మనోవేగమే ఫ్రీక్వెన్సి 
కవరేజ్ కిక  కరువేమిటి

Wednesday, June 9, 2010

ఇండియన్‌సమ్మర్‌

( ఎడతెగకుండా సాగుతున్నది ఈ వేసవి. అయిదేళ్ళ కిందటి వేసవీ ఇట్లాగే ఉన్నది.. కే. శ్రీనివాస్)

ఓ ప్రియా,  ఉక్కబోతలో ఉక్కిరిబిక్కిరి అయ్యే కాలం వచ్చేసింది. అయినా సరస్సులు, నదులు ఇంకా సమృద్ధజలాలతోనే ఉన్నందున,  పగటిజలకాలకు ఇక విరామమే అక్కరలేదు.  పొద్దువాలిన తరువాత,  అందమైన చందమామ నిండిన  ఆహ్లాదపు  రాత్రులలో  మన్మథుడి ప్రతాపాన్ని అధిగమించడం కష్టమేమీ కాదు.  ముగిసిన వసంతకాలంలో చెమటలు పట్టించిన మదనతాపం ఇక చల్లబడుతుంది కాబట్టి, రాత్రులు హాయిగా చల్లటి పానీయాలతోను, గానవినోదాలతోనూ ఆరుబయట ఆనందించవచ్చును.... (కాళిదాసు, రుతుసంహారం, గ్రీష్మం)

వెళ్లిపోతూ వర్షరుతువు కురిపించిన  జడివానల శేషజలాలలో వేసవి స్నానాలాడే రోజులెప్పుడో పోయాయి. రాతిరి మలిజాములో పలకరించే మలయానిలం కోసం  ఆరుబయలు నిరీక్షణలెప్పుడో పోయాయి.  రుతువెప్పుడో సంహరించబడింది మహాకవీ, ప్రియురాలి చెక్కిలిమీద కరిగిపోయే గైరికాది ధాతువులూ పెదవులమీద చెదిరిపోయే లత్తుకలూ నిఘంటువులలోకి చేరిపోయాయి మహాకవీ.. కంచువృషభముల అగ్నిశ్వాసం గ్రక్కే గ్రీష్మం కదా మహాకవీ!

వేసవి వేసట కొత్తగా వచ్చిందేమీ కాదు కానీ,  నేల సూరీడైపోయి తేలే అగడులో వేగిపోవడం ఇప్పటిది కాదు కానీ,  ఎండాకాలం ముందు మనిషి ఇంత నిరాయుధంగా నిలబడడం మాత్రం కొత్తదే. మనిషి లోపల దుర్భిక్షం కొత్తదే. గుండె బండరాయిలాగా కాలిపోవడం కొత్తదే. నుదుటిమీద ముత్యంలా మెరిసే చెమట చూరునీళ్లవలె కురియడం కొత్తదే. ఆకు అల్లాడని శిలాక్షణాన  ఎగబోసుకుని ఊపిరిని నిలుపుకోవడం కొత్తదే.

తక్కిన అయిదు రుతువుల కోసం భరించవలసిన శిక్ష ఏమీ కాదు. 'భూమిని తలకిందు చేసి బువ్వ పంచి ఇచ్చే' సృష్టి క్రమానికి ముందు నీడపట్టున సేదతీరే ప్రవాసం వేసవి.  వసంతం తరువాత వెలసిన మౌనం గ్రీష్మం అంటాడు ఒక కవి.   ఆ మౌనంలోనే మనిషి తనలోపలినుంచి వింజామరలను, గంధపుపూతలను, మలయానిలాన్ని సృష్టించుకుంటాడు.  ప్రేమ లేని జీవితం అంటే గ్రీష్మం లేని కాలం లాంటిది అని ఒక యూరోపియన్‌ సామెత. వారి సమ్మర్‌లో సెల్సియస్‌లు తక్కువే కావచ్చును. అయినా,  ఉష్ణం తక్కువైనా ఉగ్రత తక్కువ కాదు. బాధపడతాం, ఇష్టపడతాం, అదే వేసవిలోని విచిత్రం అంటాడు  ఒక ఇంగ్లీషుకవి.  ఎండ సృష్టించే వైచిత్రులు కవులకు పండగ.   దహించుకుపోతే మాత్రమేమిటి -తటాకపు చల్లటి నీటిపై తామరలు పరచుకున్నప్పుడు, మల్లెదండలు పరిమళించినప్పుడు- అంటాడు అదే కాళిదాసు. నీడ కోసం పాముపడగ కిందికి చేరిన బురద కప్ప కు ప్రాణభయమే లేదంటాడు, కడుపులో దాచుకున్న నీటిని గొంతులోకి తోడుకుంటూ చల్లబరచుకుంటున్న ఏనుగుకి పక్కనే సింహం సంచరించినా తెలియడం లేదంటాడు. నడిజామున చెట్ల నీడలన్నీ కుంచించుకుపోతే, దాహంతో చెట్లు తమ నీడలను తామే తాగాయేమో అంటాడు నన్నెచోడుడు.  మల్లెపూల వలె, నారికేళం వలె, చందనచర్చ వలె, మామిడిపండువలె, కవిహృదయం వలె ఎండాకాలంలో జీవితం చల్లగా ఉంటుంది.

కానీ, గాలిని నీటిని ఆకాశాన్నీ పచ్చనాకునీ పట్టుకుని అమ్ముకునే వ్యాపారులొచ్చాక, వేసవి విస్తరించింది. వర్షాన్ని హేమంతాన్నీ అది కొరుక్కు తినసాగింది. అడవులన్నీ కలపగా మారిపోయాక, గదుల్లో గాలి చల్లగా స్తంభించిపోయాక, గంగవెల్లువలన్నీ బాటిల్‌కమండలాల్లో బంధితమయ్యాక,  ఆకాశం పొగచూరిపోయాక- మనుషులు గ్లోబలైజ్‌ అయినట్టు, రుతువులన్నీ సమ్మరైజ్‌ అయిపోయాయి. వర్షాకాలంలో దొరికే అకాలపు