Friday, May 28, 2010

పర్సనల్ పద్యాలు -2

చెప్పానా 


పాత స్పర్శతో కొత్త క్రీడ అయినా
కొత్త స్పర్శతో పాత క్రీడ అయినా
జీవితపు పునరుజ్జీవనమే
పూలమొక్క కొత్త మొగ్గ వేసినట్టు
మనసు రోజూ కొత్తగా పూయాలి
తుమ్మెదా పాతదే పువ్వూ పాతదే పరాగమే కొత్తది సరాగమే కొత్తది

ఈ దేహం మీద నీకు సందేహం కదా,
కోటి నఖక్షతాల గురుతులేవి   లక్ష ఆలింగానాల ఆనవాళ్ళేవి
ఈ ఛాతీ మీద ప్రవహించి వెళ్ళిన వక్ష సముద్రాలేవీ
వొక్క సారి తొంగి చూడు మిత్రమా నా మనశ్శరీరాలలోకి
అనుభవం జ్ఞానం లోకి ఇంకిపోతే,
మరో రాత్రి చంద్రుని కోసం బాహువులు విప్పుకున్న ఆకాశమే కనిపిస్తుంది.

ఎన్ని వర్షాలు చూసింది ఈ పర్వతం ఎన్నిసార్లు కడుపుతో ఉన్నది ఈ నేల
ఎన్నిసార్లని ఎన్ని సార్లని ఎన్నెన్నిసార్లని సూర్యోదయం
లక్ష కన్నె పొరలతో పుట్టిన అయోనిజులం  ఎప్పటికీ పరస్పరం అనాఘ్రాతులమే

ఒక ఆలింగన గర్భంలో పుట్టిన అనుభవ శిశువుని నువ్వు లాలిస్తున్నప్పుడు
నీ చెదిరిన ముంగురులతో  నేను మరో కౌగిలిగూడుని అల్లుకుంటాను

Tuesday, May 25, 2010

అవయవం

ఆమ్మాయి రొమ్ములు పెద్దగా  ఉంటాయి
పరిగెత్తిస్తే చెంగుచెంగున గెంతుతాయి
క్లోజప్‌లో కళ్లకు ఊపిరాడకుండా చేస్తాయి
నిగ్గదీస్తే ఖంగుఖంగున మోగుతాయి

ఆమ్మాయి తొడలు లేత అరటిబోదెల్లా వుంటాయి
చెట్టెక్కిస్తే కిక్కెస్తాయి
ఆమ్మాయి జఘనం ఘనంగా ఉంటుంది. కెమెరా కంటికి తాయిలంలా కనిపిస్తుంది
ఇటుచూస్తే బొమ్మ తిరగేస్తే దిమ్మ

ఆమ్మాయి మొహం పాపాయి మొహంలా వుంటుంది
ఆమ్మాయి నవ్వితే బాల్యం పాలులా విరిగినట్టుంటుంది
ఆమ్మాయి కామంగా చూస్తే మొహమాటంగా వుంటుంది
ఆమ్మాయి నోట్లో వేలుపెట్టుకుని చప్పరిస్తే చిన్నతనం అలవాటుగా కాక
ఫెలెషియో స్ఫురింపిస్తున్నట్టుగా అనిపిస్తుంది

తెరనిండుగా ఆమ్మాయి తన అవయవాలను ఆరబోస్తే
ఎడారిలో పసిపాపల సవారీ వొంటెల పందెం చూస్తున్నట్టుంటుంది

***
వెండితెరల మీద తోలుకలల బొమ్మలాటను చూస్తుంటే మాసేజ్‌ పార్లర్‌లో కూర్చున్నట్టుంటుంది. అన్ని పాత్రలూ మెదడూనూ, అజ్ఞానేంద్రియాలనూ మర్దనచేస్తే, హీరోయిన్‌ మాత్రం ప్రేక్షకుల మగతనానికి గురిపెడుతుంది
లేత చూపులు, ఆర్ద్రమైన చూపులు, మృదువైన పలకరింపులు వెళిపోయాయెళిపోయాయ్‌. నాభీ ప్రదర్శనమూ, వాయొలెంట్‌ ఇంటర్‌కోర్స్‌ను స్ఫురింపించే జర్క్‌లూ, దేవతావస్త్రాల పోర్నోభాష----

ఆడతోలు బొమ్మలకి అవయవాలు తప్ప మరేమీ వుండవు
" అవసరమైనంత వరకు ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమే, మడికట్టుకుంటే ఎలా?''
హీరోయిన్లకు అఫైర్లుంటాయి, పత్రికలు అమ్ముకోవడానికి సరుకులు..
తాగుతారు, సిగరెట్లు తాగుతారు,, తూలుతారు, డ్రగ్స్‌ తీసుకుంటారు, మేకప్‌రూంనుంచి మేకప్పులు నలిగి బయటికివస్తారు.
" పెళ్లికాలేదు, పెళ్లికాలేదు, పెళ్లయితే మీకు చెప్పకుండానా?''
పెళ్లయితే ఎలా, ప్రేక్షకులకు మాస్టర్బేషన్‌ కుదిరేనా?
సినిమా థియేటర్లు హస్తప్రయోగాలకు ఫోర్‌ప్లే గ్రౌండ్లు.

***

ఎంతసేపూ వునికి అవయవాలేనా?
విసుగువేస్తుంది. ఎంతసేపూ కోట్లాది కళ్లకోసం ముస్తాబు చేసుకోవడమేనా?
సెక్సీడాల్‌! నీకు ప్రాణం వుందా?

***
కొందరు చచ్చిపోతే తప్ప వారికి అంతకుముందు ప్రాణం వుందని స్ఫురించనే స్ఫురించదు. వాళ్లు మనుషులనీ, వారికి జీవితం వుందని, వారుసెక్సడం కాక బతుకుతారని తెలియదు. అట్లా తెలియజేయడానికే, కోట్లాది అంగస్తంభనలని భగ్నం చేయడానికే కొందరు చచ్చిపోతారు.
 (దివ్యభారతికి)

(1992 -93 లో ఆంధ్ర జ్యోతి  ఆదివారం అనుబంధంలో 'సింగిల్ కాలమ్' పేరుతొ ఒక శీర్షిక రాసేవాడిని. సినిమా నటి దివ్య భారతి చనిపోయినప్పుడు రాసిన కాలమ్ ఇది. దీని మీద అప్పట్లో ఆఫీసు లోనూ బయటా చాలా రభసే జరిగింది. రచన అసభ్యం గా ఉందని విప్లవ సాహిత్య పత్రికలు సైతం విమర్శించాయి. మనుషుల్లోని అసభ్యత గురించి రాసిన కాలమ్ ఇది అని అప్పుడు నా సమాధానం. విప్లవ పరిభాష ఉన్నంత మాత్రాన విప్లవ రచన కానట్టే,  లైంగిక శరీర పరిభాష ఉన్నంత మాత్రాన అది బూతు కానక్కర లేదు కదా? - కె. శ్రీనివాస్ )

Friday, May 14, 2010

పర్సనల్ పద్యాలు-1

ఓల్డ్‌ ప్రాడిజీ


ఖాఖాన్‌ తెమూజిన్‌ ఏం జేస్తున్నాడు
కాయలు గాసిన కకుద్రేఖను
గిల్లుకుంటున్నాడు
చుక్కల్లో చంద్రుడా
అట్టకిరీటం ఇంద్రుడా
పడగపట్టిన పామెక్కడ?
**

పగబట్టెను చూడిక్కడ
శౌర్యమ్ములేదు లేదు త్యాగమ్ము
....రాయన్‌
రాపడనే లేదు రొమ్ము
గారాల పట్టీ
**

చెడబుట్టావు గదరా!
**

ఉలిక్కిపడి లేచేసరికి
కేసెట్‌ ఎఫ్‌ ఎఫ్‌ అయిపోయింది

ఏ భావమూ ప్రాప్తించని
శుష్కస్ఖలనంలా
ఏ శ్లేషా వరించని
వుట్టి వాచ్యంలా
పసిడి రెక్కలు విసరకుండానే
కాలం పారిపోయింది

చీకటి పడిపోతోంది
*

తొందరగా ఇంటికి పోవాలి
ఆట అరగంటే వుంది

*

గోల్‌చేయాలి

(రచనాకాలం 1995 )