Monday, April 19, 2010

వచనంలోనూ మహాకవే!

(మిత్రుడు ఆర్‌.సుదర్శన్‌ శ్రీశ్రీ వచనరచనల మీద పిహెచ్‌.డి.పరిశోధన చేశాడు. అతని పరిశోధన గ్రంథానికి ముందుమాటగా 1998 ప్రాంతంలో రాసిన వ్యాసం ఇది. తెలంగాణ వాదం అప్పుడప్పుడే మలిపూత పూస్తున్నది. ఆ సూచనలు ఈ వ్యాసంలో కనిపిస్తాయి కానీ, అనంతర కాలంలో శ్రీశ్రీ మీద వచ్చిన ప్రశ్నల ప్రస్తావన ఇందులో ఉండదు. విప్లవోద్యమానికి వేదిక అయిన తెలంగాణ, శ్రీశ్రీని చివరిరోజుల్లో గట్టిగా ఆలింగనం చేసుకున్నదని ఇందులో రాశాను కానీ, తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో శ్రీశ్రీ వైఖరిని ప్రస్తావించనే లేదు. శ్రీశ్రీ అనేక వివాదాస్పద వైఖరుల విషయంలో ఎట్లా తెలుగుపాఠకులు రాయితీనీ ఇచ్చారో- తెలంగాణపై ఆయన వైఖరిపై కూడా తెలంగాణ ప్రజలు, ఉద్యమం అటువంటి సహనాన్నే చూపుతారని నా అంచనా - కె.శ్రీనివాస్‌)ఇరవయ్యో శతాబ్దం ముగిసిపోతున్నది.
ప్రశ్నల్ని ఝళిపిస్తూ రంగస్థలాన్ని ఆక్రమించుకుంటున్న కొత్త శక్తులు తన అక్షరాలకు ఎన్నిమార్కులు వేస్తాయోనని భయం భయంగా వినయంగా ఒక 'మహాకవి' నిరీక్షిస్తున్నాడు.
ఒక చారిత్రక విభాతం అందించిన అహంకారంతో ' ఈ శతాబ్దం నాది'అని ప్రకటించుకున్న మహాకవి అతడు.
**

పతితులు,భ్రష్ఠులు,బాధాసర్పదష్టులు వంటి అర్థనైరూప్య శ్రేణుల్లో ఇమమడడానికి ఇష్టపడక అనేక ప్రజాసమూహాలు కొత్తనామకరణాలు స్వీకరించిన కాలంలో,భాషాప్రయుక్త రాష్ట్రాల భావనలోదాగిన వలసవాద దుష్టసమాసాలని గుర్తిస్తున్న స్థలంలో నిలబడి మిత్రుడు 'తెలంగాణ బహుజన' సుదర్శన్‌ శ్రీశ్రీ వచనరచనల గురించి పరిశోధనకు ప్రయత్నించడం కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. పరిశోధనల పరిమితుల్ని, సుదర్శన్‌ పరిమితుల్నిఅర్థం చేసుకోవలసిఉంటుంది.

అలాగని, శ్రీశ్రీ ఊసే ఇవాళ అసందర్భమై పోదు.బతికి ఉన్నన్నిరోజులూ కొత్తతరంతో కలిసి నడవాలని ప్రయత్నించిన ఈ కవి తన మరణానంతరం సాగుతున్న సామాజిక మహాసంచనలంలో ఎంత వరకు మిత్రుడిగా మిగులుతాడో అంచనావేస్తూ పోవలసిందే.
**

తెలుగు వచనం గురించిన చర్చకు ఈరోజు సందర్భం ఉన్నది. కవిత్వం అనేది కేవలం సాహిత్యరంగానికి సంబంధించింది మాత్రమే కానీ, వచనానికి సాహిత్యేతరమైన వినియోగం,జీవితం చాలా ఉన్నది. విశాలమవుతున్న సమాజ అవసరాలు అందుకు సహాయపడగల భాష కోసం వెదుక్కుంటున్నాయి. విషయం ప్రధానంగా, సమాచారం ప్రధానంగా ఉన్న రచనలకు పనికి వచ్చే తెలుగు వచనం ఇంకా రూపుదిద్దుకునే దశలోనే ఉంది. సాహిత్యరంగంలో ఉన్న వారితో పోలిస్తే,ఇతర సామాజిక అవసరాల కోసం సమర్థమైన తెలుగును రాయగలవారి సంఖ్య అతి తక్కువగానే ఉన్నది.

ఇందుకు బాధ్యులు ఎవరు? దీనికి'అభివృద్ధి'కీ సంబంధం ఉన్నది. 'అభివృద్ధి' చెందిన సమాజాల భాషలతో పోల్చుకుని లేదా వాటినుంచి అనువాదాలు చేయడంలో సమస్యలను ఎదుర్కొని మనభాషను 'అభివృద్ధి'చెందని భాషగా చెప్పుకుంటున్నాము. అనువాదం సాధ్యం కానంత స్థానికంగా కవిత్వభాష ఉండాలని శ్రీశ్రీ అంటాడు. అభివృద్ధి చెందిన భాషలతో అంతర-అనువదనీయత లేకపోవడం ఒక లోపం అంటుంది ఆధునికత. తెలుగు శాస్త్రభాషగా, స్వతంత్రంగా ఆలోచనలు నిర్మించగలిగే భాషగా లేకపోవడానికి సామాజిక,రాజకీయకారణాలు ఉన్నాయి సరే, కానీ ఆ లోపాన్ని భర్తీ చేయడానికి కృత్రిమంగా చేసే ప్రయత్నంలో సాహిత్యరంగానికి చెందిన రచయితల భాగస్వామ్యం తగినంతగా ఉన్నదా? లేదా? అన్నది ఇక్కడ అవసరమైన ప్రశ్న.

గురజాడ అప్పారావు కానీ, గిడుగు రామ్మూర్తి కానీ వాడుకభాష కోసం జరిపిన ఉద్యమం కేవలం కవిత్వాలూ, కథలూ మాట్లాడేభాషలో రావడం కోసం కాదనీ, మరింత విస్త­ృతమైన ప్రయోజనం కోసమనీ శ్రీశ్రీ కి కూడా పూర్తిగా ఇంకలేదు. శ్రీశ్రీ ఎక్కడ వాడుకభాష గురించి మాట్లాడినా వెంటనే వాడుకభాషలో కవిత్వం రాయడంలోకి మారిపోతారు. గురజాడ, గిడుగు చేసిన వ్యావహారిక భాషోద్యమం లోపరహితమైనదేమీ కాదు. గురజాడ భాషా వ్యాసాల్లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన ఉండదు. ఒక ప్రాంతంలోని 'శిష్ట' జనం మాట్లాడే భాషను ప్రమాణ భాషగా చేయడం ఎంత వరకు సబబు? అన్న ప్రశ్నను వాళ్లు ఎదుర్కొని ఏవో ఇంగ్లండ్‌ ఉదాహరణలతో సమాధానాలు చెప్పారు. అయితే, అన్ని ప్రాంతాల నుంచి వ్యావహారిక భాషలోకి ప్రదానాలుంటాయని, అప్పుడే అది సిసలైన ప్రమాణభాష అవుతుందని గిడుగు రామ్మూర్తి ఆలోచించారు. కానీ, ఆయన సత్‌సంకల్పం చరిత్రను నడిపించలేకపోయింది. ప్రమాణ భాషగా చెలామణిలో ఉన్న అధికారభాషలో రాయడానికి 'వెనుకబడ్డ' ప్రాంతాల రచయితలకు ఇప్పటికీ కష్టంగానే ఉన్నది.

ఒక చారిత్రక అన్యాయానికి తెలియకుండానే కొంత కారకులు అయినప్పటికీ గిడుగు, గురజాడ రాబోయే ఆధునిక సమాజ అవసరాలను తీర్చే ఒక ప్రాథమిక సదుపాయాన్ని అమర్చిపెట్టే కృషి చేశారు. అందు కోసం పోరాడారు. గురజాడ, గిడుగు పేర్లను పదే పదే ప్రస్తావించే శ్రీశ్రీ మాత్రం వచనాన్ని ఒక సాహిత్య ప్రక్రియ కిందికి
కుదించి, తెలుగు వచనం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించే ఏ ప్రయత్నమూ చేయలేకపోయారు. శ్రీశ్రీ యేకాదు, అనేక మంది ఆధునిక కవులు, రచయితలు గురజాడ, గిడుగు ప్రారంభించిన ఉద్యమాన్ని అందుకోలేకపోయారు. విద్యారంగంలో సమర్థమైన భాషను నిర్మించే కర్తవ్యాన్ని అకడమీషియన్లకు, సమాచార రంగంలో భాషను నిర్మించే పనిని జర్నలిస్టులకు వదిలిపెట్టారు.

**

గొప్ప సాహిత్య భాషను సృష్టించగల మహా రచయిత కోసం మనం రంగం సిద్ధం చేయాలని గురజాడ అన్నాడు కానీ, అటువంటి ఏకైక మహారచయిత ఎవరూ తెలుగులో పుట్టలేదు. నిజానికి గురజాడ చేసిన వాడుకభాషా ప్రయత్నం అంతా సార్వత్రిక విద్యకు ఉపకరించగలిగిన, సామాన్యులు కమ్యూనికేట్‌ చేయగలిగిన ఆధునిక భాష కోసం మాత్రమే. వాడుకభాషలో సాహిత్యం అన్నది ఆ ప్రయత్నానికి లభించవలసిన అనుబంధ ఫలితం మాత్రమే. ఆధునిక భాషా నిర్మాణ కృషి జరిగిన చారిత్రక రాజకీయ సామాజిక నేపథ్యంలో ఉన్న సంక్లిష్టత, వైరుధ్యం, అన్యాయం అన్నీ కృషి ఫలితంలో కూడా ప్రతిఫలించాయి.
**


ఆధునిక తెలుగు రూపొందకపోవడానికి రచయితలను, కవులను నిందించడంలో అసంబద్ధత యేమీ లేదు. ఆధునిక తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు భాష, సార్వత్రక విద్యాభావన, జాతీయభావాలు, కులమతాల విషయంలో సంస్కరణ భావాలు అన్నీఒకేసారి రంగప్రవేశం చేశాయి. అవి ఎంతమేరకు ఆధునికంగా ఉన్నాయి, ఎంత మేరకు సిద్ధించాయి అన్నది మరో ప్రశ్న. తెలుగు సమాజంలో తొలితరం ఆధునిక అక్షరాస్యుల సామాజిక నేపథ్యం, ప్రాంతీయ నేపథ్యం ఇక్కడ ముఖ్యమైనవి. ఆ అక్షరాస్య శ్రేణే సమాజంలోని అనేక రంగాలలో అన్ని కులాల వారికి, అన్ని తరగతుల వారికి అవకాశాలుండాలని సాహిత్యాది రంగాలలో వాదించిన మాట నిజమే కానీ, వారి ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరకపోగా, వారి శ్రేణిలోని అనంతర తరాల వారు ఆ ఆకాంక్షలకు అవరోధంగా మారిపోయారు. తొలితరం వారి సహృదయతను యథాతథంగా అంగీకరించినా, వారు మోసుకు వచ్చిన వారసత్వాన్ని, వారి నేపథ్యం స్వభావాన్ని విస్మరించడం కుదరదు.

సమాజంలోని విశ్రాంతి వర్గాల వారే సాంప్రదాయికంగా విద్యావంతులుగా ఉన్నారని, వారే ఇంగ్లీషు విద్యను అందుకున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లీషు విద్య అందిన శ్రేణుల వారు శ్రామిక వృత్తులతో ఏమాత్రం సంబంధం లేనివారు, పరిపాలన, తత్వశాస్త్రం, సాహిత్యం,న్యాయవ్యవస్థ మొదలైన రంగాలతో మాత్రమే తరతరాలుగా సంబంధం ఉన్నవారు. ఈ రంగాలకు చెందిన వ్యక్తీకరణలు, పరిభాష మాత్రమే ఆధునిక తెలుగులో సమర్థంగా ఏర్పడ్డాయి. భౌతిక విజ్ఞాన శాస్త్రాల భాష విషయంలో, ఇతర సాంకేతిక రంగాల భాష విషయంలో తెలుగు స్వయం సమృద్ధం కాలేకపోతున్నదని ఇవాళ మనం బాధపడుతున్నాం. అభివృద్ధి చెందిన సమాజాలలో పుట్టుకువస్తున్న కొత్త కొత్త శాస్త్రాలు, భావనల విషయంలో తెలుగు అసమర్థంగా ఉండిపోయింది. ఆధునిక ఆలోచన అవసరాలకు తెలుగు సరైన సాధనం కాలేకపోతున్నది. తెలుగు ఇలా వెనుకబడిపోవడానికి కారణం సమాజ ప్రజాస్వామ్యీకరణ కోసం ప్రయత్నించిన తొలితరాల వారి నేపథ్యంలో, పరిమితులలో ఉన్నదని గుర్తించాలి. తెలుగు సమాజంలోని అన్ని సామాజిక భాషలను, ప్రాంతాల భాషలను ఆధునిక తెలుగులోకి సంలీనం చేయగలిగి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.

సార్వత్రక విద్యాబోధనకు అనుగుణమైన భాషను నిర్ణయించడంలోను, ఆధునిక భాషావ్యాప్తికి సాధనాలైన సమాచార సాధనాలలోను సాహిత్యవ్యక్తులే కీలకపాత్ర వహించారని గమనిస్తే తెలుగువచనం పరిమితులకు కారణాలు అర్థం అవుతాయి. సంస్కరణవాద భాషావాదులు ప్రజాసమాచార సాధనాల ద్వారా, సాహిత్యం ద్వారా పాశ్చాత్య భాషా, శైలీ విలువలను ఆదర్శంగాచూపిస్తూ కొత్తరకం శిష్ట భాషను ప్రతిష్ఠించడానికి ప్రయత్నించగా, వారికి ప్రత్యర్థులుగా ఉన్న సంప్రదాయ భాషావాదులు అధికార స్థానాలలో బలంగా ఉండి, పాత గ్రాంథిక శిష్ట భాషను ఇంకా కాపాడుకుంటూ వచ్చారు. ఈ బాపతు వ్యక్తులే 1970 దశాబ్దం దాకా పాఠ్యపుస్తకాల కమిటీలలో కూడా పెత్తనంచేసి బోధనాభాషను వాడుకకు ఏమాత్రమైనా దగ్గర కాకుండా కాపలా కాశారు.ఈరెండు ధోర ణులు కూడా శ్రామిక వృత్తుల వారి, అట్టడుగు కులాల వారి భాష ప్రధాన స్రవంతి భాషకు ఆదాన భాష కాకుండా జాగ్రత్త పడ్డాయి.

ఆధునిక, సాంప్రదాయ భాషా వినియోగ రంగాలు రెండింటిలోనూ శిష్టులే అధికారంలో ఉండడం వల్ల జరిగిన నష్టాలు అనేకాలు. సాంప్రదాయ పండితులేమో సంస్క­ృత భాషా సాహిత్య ప్రమాణాల కోసం సమస్త స్థానికతను విసర్జించారు. ఆధునిక వాదులేమో, ఆంగ్ల మానసపుత్రులుగా మారిపోయి, అన్ని రకాల గతాన్ని వదులుకున్నారు. ఫలితంగా, వలసపాలనకు మునుపు తెలుగు సాహిత్య సాంస్క­ృతిక చరిత్రకూ, ఆధునిక సాహిత్యానికి ఎటువంటి రక్తసంబంధమూ లేకపోయింది. సంబంధం లేని రెండు వేరువేరు ముక్కలుగా అవి కనిపిస్తున్నాయి. గతంలోని సాంప్రదాయ సాహిత్య పరంపర లోని మంచి అంశాలు కూడా కొత్త సాహిత్యానికి పనికిరానివి అయ్యాయి. అన్ని ప్రక్రియలకూ,అన్ని ధోరణులకూ, అన్ని శైలులకూ పాశ్చాత్యమూలాలే. నాలుగైదు వందల ఏళ్ల నుంచి రూపొందుతూ వస్తున్న తెలుగు వచనం,అందులోనూ వ్యావహారిక వచనం మూలాలను తెంచుకుని ఇంగ్లీషు ప్రభావాలను వరించింది. ఆధునిక ప్రజాస్వామిక అవసరాల కోసం రూపొందవలసిన వచనాన్ని కొత్తగా సృష్టించుకోవలసి వచ్చింది కానీ, గతంలోని వచనాన్ని మెరుగుపరుచుకుని వాడుకునే సహజప్రక్రియ జరగలేదు. అందువల్ల స్థానిక పరిమళం ఉన్న వచనం అభివృద్ధి చెందలేదు. ఏ నుడికారమూ లేని, ఏ సాంస్క­ృతిక ప్రత్యేకతలూ లేని నిస్సారమైన, శుష్కమైన వచనం మనకు ప్రాప్తించింది.

తెలుగు వచన రచయితలు చాలామంది వ్యవహారం నుంచి, జీవితం నుంచి భాషను స్వీకరించడానికి ప్రయత్నించారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి బ్రాహ్మణ స్త్రీల వ్యవహారంనుంచే తన కథలకు జీవభాష అందిందని చెప్పుకున్నారు. ఆయన కాలంలోనూ, త ఆ తరువాత కూడా ఎందరో వచనరచయితలు లిఖిత సాహిత్య పరిధి బయట ఉన్న వ్యవహర్తల నుంచి భాషను అధికార భాషలోకి దిగుమతి చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలన్నీ మాండలిక ప్రయోగాల పేరుమీద, ఓ ప్రత్యేక తరహా రచనలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు తెలుగు పత్రికలు మార్కెటింగ్‌ అవసరాల కోసం కొంతైనా స్థానిక పదజాలాన్ని వాడాలని అనుకుంటున్నప్పుడు, కనిపిస్తున్న కృత్రిమ మాండలికాన్ని చూస్తే, తెలుగు వాడుక భాషను స్థిరీకరించి, ప్రజాస్వామికంగా విస్తరింపజేయడంలో రచయితలు క్రియాశీలంగా పాల్గొనని లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు తెలుగులో సర్వసామాన్య అవసరాల కోసం వాడే భాషను ప్రమాణీకరించి, వ్యాపింపజేసే వ్యవస్థలన్నీ ఆ శక్తి సామర్థ్యాలు లేని వ్యక్తుల సమూహాల చేతిలోనే ఉన్నాయి. ఈ ప్రక్రియకు వ్యక్తుల ఇష్టాయిష్టాలు కాక అనేక సామాజిక, రాజకీయ కారణాలున్నాయి. అయితే, వచనాన్ని అభివృద్ధి చేయడంలో సాహిత్య బృందాలు, సంఘాలు, ఉద్యమాలు చూపిన నిర్లక్ష్యాన్ని కూడా గుర్తించాలి. వచనాన్ని అవసరాల కోసం ఎంతగా వాడుకున్నారో, దాన్ని అంతగా ముద్దుగా చూడలేదు. వచనశైలి మీద, సమర్థమైన వచనం ఎలా ఉండాలన్న దాని మీద విమర్శకులు దృష్టి కేంద్రీకరించలేదు. శైలి, శిల్పమూ వంటి గొప్ప గొప్ప మాటలన్నీ పద్యానికే కానీ, వచనానికి కాదని అనుకున్నారు. వాటిని విశ్లేషించవలసిన అవసరం ఉందని అనుకోలేదు.

అందుకు కారణం కవిత్వంమీద, రూపం మీద, శబ్దంమీద ఉన్న లౌల్యం. వచనం విషయం ఎలా ఉన్నా కవిత్వంలో మాత్రం మనం జెగజ్జెట్టీలం అని శ్రీశ్రీతో సహా ఎందరో పదే పదే చెబుతూ వచచారు. భౌతిక శాస్త్రాల విషయంలో పాశ్చాత్యుల ఘనత ఉండవచ్చు కానీ, ఆధ్యాత్మిక రంగంలో భారతదేశమే నెంబర్‌ వన్‌అని చెప్పుకునే సంప్రదాయ వాదులకీ వీరికీ ఈ విషయంలో పెద్దగా తేడా ఏమీ లేదు.

రైమూ, రీజనూ రెండూ ఉన్న శైలే తనకు ఇష్టమైన తన వచనశైలి అని శ్రీశ్రీ చెబుతారు. కవి మాట్లాడే భాష వచనం అంటాడు. రెండు నిశ్శబ్దాలు విసిరిన సరిగమ పదనిసల మీద నీడలు పలికించిన విలోల కల్లోలాలు తన వచనం- అంటాడు. వచనమే కవిత్వం, కవిత్వమే వచనం అని ప్రకటిస్తాడు. అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో వదిలేసి గద్యానికి, పద్యానికి పెళ్లిచేద్దాం రమ్మంటాడు. కొ.కు.ది వినిపించని కవిత్వం అంటాడు. 'నాకు తెలుసు నామీద వచ్చే విమర్శలు, శబ్దగత ప్రాణం శ్రీశ్రీ కవిత్వం అని, అర్థగత ప్రాణాల అనర్థ భాష అది. శబ్దం ప్రథమం అర్థం ఆ తరువాత'- ఇది శ్రీశ్రీ.

ఇటువంటి కవిత్వపు అభిప్రాయాలుచెప్పిన శ్రీశ్రీ సరళంగా కవిత్వం రాయడాన్ని ఒక సుగుణంగా చెబుతారు. కొన్ని పత్రికారచనల్లో, రేడియో ప్రసంగవ్యాసాల్లో ఎంతో సూటి అయిన, సరళమైన వచనం రాస్తారు. ఈ రెండుసుగుణాలకు కూడా ఆయన సంకల్పం కంటె, అనివార్యతే ఎక్కువ కారణం అయి ఉండవచ్చు. రచనను బాధ్యతగా, సామాజిక ఆచరణగాభావించే లిఖిత సంప్రదాయపు ఆధునిక రచయిత ఎవరైనా కూడా వచనం రాయకుండా ఉండలేరు. కొన్ని రకాల భావాలను సరళంగా తప్ప మరో రకంగాచెప్పలేకపోవచ్చు. అయితే, కవిత్వాన్ని వచనీకరిస్తానని చెప్పిన శ్రీశ్రీ అవకాశం దొరికినప్పుడల్లా వచనానికే కవిత్వపు తొడుగులు తొడుగుతారు. అది అధివాస్తవికత కావచ్చు, చైతన్య స్రవంతి కావచ్చు.

కవిత్వంలాంటి వచనం రాయడం మహాపరాధమేమీకాదు. ఆధునిక వచనానికి ఎక్కువ చరిత్ర ఉన్న ఐరోపా సాహిత్య కళారంగాలలో, ఈ శతాబ్దంలో సంభవించిన పెద్ద రాజకీయ సంచలనాల కారణంగా, వచ్చిన ధోరణులను, ఆధునికత, సార్వత్రిక విద్య ప్రవేశిస్తున్న తొలిరోజులలో ఉన్న సమాజంలోకి దిగుమతి చేయడం లగ్జరీగా అనిపిస్తుంది.

**

వచనంగురించి మాట్లాడుకునేటపుపడు మన సాహిత్యరంగంలో జరిగిన ఒక విపరీతం గురించి చెప్పుకోవాలి. అది కవిత్వ ఉద్యమాలకు కిరీటాలు పెట్టడం. గురజాడ అప్పారావును కూడా కలుపుకుని ఈ శతాబ్దం 2,3,4 దశాబ్దాలలో వచ్చిన వచన రచనలు చూస్తే భావకవిత్వోద్యమం అన్నది ఆధునిక సాహిత్య చరిత్రలో అంతటి స్థానానికి తగినదేనా అనిపిస్తుంది. కులం, మతం, స్త్రీవిముక్తి, ప్రాంతీయత- మొదలైన నేటి ప్రాసంగిక అంశాలన్నిటినీ స్ప­ృశిస్తూ నాటి వచన రచయితలు రచనలు చేశారు. తెలుగు సమాజం ప్రజాస్వామ్యీకరణ ఎజెండాలో ఉండవలసిన అంశాలన్నిటినీ వారు ఆనాడు స్వీకరించారు. గురజాడను గుర్తుచేసుకుంటూ చెలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన మాటలనీ, శ్రీశ్రీ పదే పదే చేసే గురజాడ స్మరణనీ పోల్చిచూస్తే వచనరచయితలే గురజాడదారిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది. అంత పెద్ద ఎజెండాను స్వీకరించిన వచనరచయితల కృషీ, వర్ణవ్యవస్థను ప్రశ్నించిన దళితపద్య కవుల గొంతూ పోయి, వయా బెంగాల్‌ ఆంధ్రాకు చేరిన పరాయి భావక విత్వం అంత గుర్తింపు ఎట్లా పొందిందో కొత్తగా కనుగొనాలి.

శ్రీశ్రీ తనకు తెలిసిన ప్రపంచాన్నీ, జ్ఞానాన్నీ కవిత్వంలో మాత్రమే చెప్పడం సాధ్యంకాదు కనుక,వచనం రాయవలసివచ్చింది. అదికాక, నాటకాలు,కథలు రాయాలన్న కోరికాఉంది. గురజాడ వారసత్వంగా అనుకోవడం ఒకటి. ప్రయోగాత్మకనాటకాలు, కథలు రాయడానికి విదేశీ సాహిత్యం ఇస్తున్న ప్రేరణ మరోవైపు పనిచేసింది. సాధారణ సన్నివేశాలు,ఇతివృత్తం, కథనం ఉన్న సృజనాత్మకరచన ఏదీ శ్రీశ్రీచేయలేదు (పరిణయరహస్యం తప్ప). శ్రీశ్రీ వచనసాహిత్యం అంతా కొంత కవిత్వానికి పొడిగింపు, మరికొంత ఆయన ప్రజాజీవితం పొడిగింపు. శ్రీశ్రీవచనరచనలు లేకపోతే మనకు ఆయన సగమే తెలిసేవారు.

..

పశ్చిమ దేశాలలో వచ్చిన అంతర్జాతీయపరిణామాల వల్ల ఎక్కువగా ప్రభావితుడై, తెలుగు సాహిత్యంలో అర్థ శతాబ్దానికిపైగా తిరుగులేని ప్రభావం వేసిన వాడు శ్రీశ్రీ. భారతదేశంలో ప్రజల స్థితిగతులను మార్చడానికి జరిగిన ప్రయత్నాలలో ఒక పెద్ద కోవకు చెందిన కవి, రచయిత ఆయన. ఆయన గురించి చెప్పే ఏ మాట అయినా, చేసే ఏ అంచనా అయినా ఆయన మార్గానికి ఎక్కువ వర్తిస్తాయి. వ్యక్తిగత పాటవానికి శ్రీశ్రీకి ముగ్ధులం కాకుండా ఎప్పటికీ ఉండలేమేమో కానీ, ఆయన్ని ఒక క్రమంలో భాగం గా చూసి మంచిచెడ్డలను లెక్కవేయాల్సిన అవసరం మాత్రం వచ్చింది. కవిత్వం మాత్రమే రాసి ఊరుకోకుండా ఎక్కువ పరిమాణంలో వచనం కూడా రాసి శ్రీశ్రీ తనను, తనను నడిపించిన చరిత్ర శక్తులను అర్థంచేసుకోవడానికి మనకు చాలా సరంజామా ఇచ్చాడు. దాక్కోవడానికి కుదరినిది వచనం. వచనంలో కూడా కవిత్వాన్ని చొప్పించి శ్రీశ్రీ మాయచేసినా, ఆయన చేత స్పష్టమైన, నికార్సైన వచనం రాయించిన చారిత్రక సందర్భాలున్నందున కొంత మేలుజరిగింది. శ్రీశ్రీ వచన రచనల మీద, శైలిమీద జరిగే ఏ పరిశోధన అయినా కవిత్వ శ్రీశ్రీ కి, వచన శ్రీశ్రీకి తేడాను వెదకాలి. సమర్థమైన వచనానికి ఆయన దోహదం ఏమన్నా ఉందేమో చెప్పాలి.

70ల తరువాత శ్రీశ్రీని తెలంగాణ ఎక్కువగా ప్రేమించింది. తమ ఆకాంక్షలకు అక్షరాలను జతచేసిన కవిగా గౌరవించింది.80ల ప్రారంభంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నిర్వహించిన ప్రశ్నలు-జవాబుల 'ప్రజ' శీర్షికకు వచ్చిన ఉత్తరాలలో అత్యధికం తెలంగాణనుంచే ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో వివిధ సామాజిక, రాజకీయ శిబిరాలలో ఉన్న అనేకమంది శ్రీశ్రీ నుంచి ఎంతో కొంత పొందినవారే. 
**

తమకు మేలు చేసిన వారిని మరువకపోవడం తెలంగాణ వెనుకబాటుతనంలో నిలుపుకోదగ్గ సుగుణం. సుదర్శన్‌ శ్రీశ్రీ మీద పరిశోధన చేయాలనుకోవడంలో కూడా ఆ ప్రేమ ఉంది. పరిశోధన పాతపద్ధతుల్లోనే ఎక్కువగా సాగినా, శ్రీశ్రీ వచన రచనలను విషయపరంగా వర్గీకరించడం, భవిష్యత్తులో మరింత నిర్దాక్షిణ్యమైన విమర్శకు అనువుగా సమాచారాన్ని సిద్ధం చేయడం మెచ్చుకోదగ్గది.

No comments:

Post a Comment