Wednesday, December 15, 2010

మనసుకు రెక్కలెన్ని మొలిచినా కాళ్లు కట్టేసుకున్న వాడు ఎగరలేడు

(ఈ పద్యం 1997-98 సంవత్సరాల్లో రాసింది. ఇది ఆంధ్రప్రభ సాహిత్యపేజీలో ప్రచురితమైంది. పేపర్‌కటింగ్‌ దొరకలేదు. దొరకగానే కరెక్ట్‌ తేదీని ఇస్తాను- కె.శ్రీనివాస్‌)


తన తోట ముందు
కూలబడి అతను
సీతాకోక చిలకల్ని తరుముతూ వుంటాడు

మొహంమీద మొలిచిన
మలియవ్వనాన్ని చూసి
భీతితో కుంగిపోతాడు
మందహాసాల్నీ మధురోహల్నీ
పలితకేశంతో అదిలిస్తూ వుంటాడు

అలల తాకిడికి
సయ్యాటల్ని అభినయిస్తున్నా
అగాధాల్లో మాత్రం
వో లంగరు బిగించే వుంటుంది

జీవన భాషలో పరమ గ్రాంథిక వాది
స్థిరకక్ష్యలో తిరిగే ఉపగ్రహం
కొత్త స్వప్నాలకు అంధుడు
పరిమళాలకు ఎలర్జీ

వుట్టి భవబంధితుడు

Thursday, December 9, 2010

బాబెల్‌ఆదిని వాక్యమూ లేదు నా బొందా లేదు
మా మధ్య
అన్నీ హైఫెన్లూ కామాలూ ఆశ్చర్యార్థ ప్రశ్నార్థకాలూ...

వొక్కో అక్షరాన్నీ దొర్లించుకుంటూ
వొక్కో మాటనీ పేర్చుకుంటూ
వొక్కో సమాపక క్రియ కోసం ఎంత యాతన!

అనర్గళ వాగ్ధార కోసమని
స్వరపేటికల్ని సలసలా మరిగించాము కదా తండ్రీ!
ఓ యుగళ గీతం కోసం
ఎన్ని పదబంధాల్ని మచ్చిక చేసుకున్నాము నాయనా!
పాట మీద పాట కట్టి
భాషకు ఆవల ఏముందని చూడబోయాము మిత్రుడా!

పాలు విరిగినట్టు
ఇసుకనుంచి ఇనుపరజను చెదిరినట్టు
మాభాషలు వేరైపోయాయి

దేవుడు శపించాడు
(1993 అముద్రితం )

Tuesday, November 30, 2010

లేట్ నైన్టీస్: కొన్ని శకలాలు

(ఇవన్నీ పూర్తికాని పద్యాలు, ఆరంభచరణంలోనే  ఆగిపోయిన పద్యాలు.. 96-98 మధ్య కాలంలో అప్పుడప్పుడూ హృదయతాడనంతో పగిలిపోయిన పద్యాలు, ఒక దానికి మరో దానికీ సంబంధం లేని పద్యాలు - కె.శ్రీనివాస్‌)


1
అసిధారగా ప్రవహిస్తున్న జీవితానివి
మృత్యుడేరాను ముట్టివచ్చిన అమృతానివి
కసికి పదునుపెట్టి కారుణ్యఖడ్గం చేసిన కృషివి

రిక్తహస్తాల ప్రేమ నాది

మైదా ' లై ' అంటని మలిన హస్తాలు నావి
కరపత్రికలు ప్రవహించని ఎడారి అరచేతులు నావి
నినాద వేదాలు పలకని అపస్వరపేటిక నాది

రిక్తహస్తాల నిరర్ధక ప్రేమ నాది

ప్రేక్షక ప్రేమ నాది


2
ఎటువంటి కాలంలో జీవిస్తున్నాం మనం

తలుపులు బార్లా తెరచిన దేశంలో
ఎంతటి రహస్యమరణాన్ని రుచిచూస్తున్నాం
చావుకేకలూ పురుటినెప్పులూ కలగలసిన
ఎంతటి బీభత్స సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం

తరచు మార్చురీల ముందే  కలుసుకుంటున్నాం
అంగుళం జరిగిన మరణాన్ని  చూసి ఆనందపడుతున్నాం
కోటగుమ్మాల ముందు శవయాచన చేస్తున్నాం
పిరికితనానికి కూడా గతిలేని
నిర్బంధ ధైర్యంతో నినదిస్తున్నాం

నలుగురం కూడినప్పుడల్లా ఐదోవాడి సంతాపసభ జరుపుకుంటున్నాం

3
కలలన్నీ కిట్‌బ్యాగుల్లో సర్దుకుని
వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు
నేను కూడా వీడ్కోలు చెప్పాను
విజయం సాధించి వచ్చేప్పుడు
నాక్కూడా వో విముక్తి తెమ్మని వినయంగా అడిగాను

4
తృణమూ ప ణమూ కాదు ప్రాణమంటే
ఆత్మార్పణ త్యాగరాజ కీర్తనలనిక ఆపి
కలగానిది విలువైనది నేర్చుకోమందాం

5
బాలగోపాల్‌ ఏంచెప్పాడో విన్నాం మరి
ఇక పోల్‌పాట్‌  ఏం చెబుతాడో చూద్దాం

6
అసయ్యాన్ని గుట్కాలాగా అంగిట్లో పెట్టుకుని
పరిమళభరితంగా ఎలా మాట్లాడను?


7
ఇంకెవరి దగ్గరా పడుకోవద్దని మాటతీసుకుని మరీ పెళ్లాడతాం
ప్రేమలేఖల్లోకి ప్రవ హించకుండా దాచిపెట్టిన పీనల్‌కోడ్‌ను పెళ్లిపీటలమీద ఆవిష్కరిస్తాం
హక్కుభుక్కం కాగానే అంగిట్లో దాచిన రెండు కోరల్నీ నిస్సిగ్గుగా ప్రదర్శిస్తాం
సమస్త నీతిశాస్త్రాల్నీ తొడల మధ్య వేలాడదీసి గర్భాశయం  మీద మన పేరే చెక్కుకుంటాం

Wednesday, November 3, 2010

వాగర్థ

ఆ క్షణమున  నిరక్షరాస్యుడనే అయినాను.

పేర్చిన మాటలు, కూర్చిన వాక్యములు పేకమేడల వలె కూలిపోయినవి. సహపంక్తికి భీతిల్లి వర్ణములన్నియు చెదిరిపోయినవి. శిశిరపర్ణముల వలె, తెగిన శిరముల వలె, శీర్ణ స్వప్నముల వలె అక్షరములు అనర్థములైనవి.
రణరంగమునకు నిరాయుధుడిని, విపణివీధికి నిర్ధనుడిని అయినాను.

నిఘంటువున్నియు నిషిద్ధములైనవి. అర్థములన్నియు చెలామణినుండి వైదొలగినవి. నాకు నేనే ఒక కోలాహలమువలె ధ్వనించుచుంటిని.

***
ఒక ఆశ్వాసన, ఒక ధైర్యం, ఒక వాగ్దానం, ఒక నమ్మకం, ఒక ప్రేమ మాటలో పలకాలంటే గుండె గొంతుకలోన కొట్లాడాలి.  మనసును అనువదిస్తే తప్ప, భాష బాసగా మారదు. అబ్బురపడితేనో, అతిభయమేదో ఎదురవుతేనో మాత్రమే కాదు, లోలోపల  ఆత్మ హరించుకుపోతే కూడా అవాక్కవుతావు. మాట్లాడడానికి ఏమీ లేకపోవడమంటే, హృదయంలో భూకంపం జరుగుతోందన్న మాట. మాట్లాడలేకపోతున్నావంటే, మనసును ఒక అపస్వరపేటిక ఆవహించిందన్నమాట. మాటలు పలకలేని సత్యాన్నేదో ఆవిష్కరించినప్పుడు మౌనివవుతావు. తోసుకువచ్చే అపశబ్దాలకు భయపడినప్పుడు మూగవవుతావు.

అక్షరమక్షరాన్ని సానదీసి, పదునుపెడితే ఎప్పటికో అప్పటికి రసవిద్య పట్టుబడుతుంది. నంగి నంగిగా బెరుకు బెరుకుగా మొదలైన మాట రాను రాను రాగమవుతుంది. కూతనేర్చిన తరువాత కాకి కోకిల అవుతుంది. మాట మంత్రమవుతుంది. కోటలు కట్టవచ్చు, పేటలు కూల్చవచ్చు, కనికట్టవచ్చు, ఉచ్చులల్లవచ్చు, మభ్యపెట్టవచ్చు. ప్రతిసృష్టి చేయవచ్చు.  దూరాలను

Thursday, October 28, 2010

క్లోన్‌

వొక రాధ
భక్త మీరాబాయి వేషం కట్టి
వో పంచవన్నెల పన్నాగాన్ని రచించింది

కొన్ని హద్దులు కొన్ని ముద్దులు

వొక గొప్ప కళాకాంక్షను నటించి
అందులో కూరుకుపోయాను
బంధం బంధనమై బిగుసుకుంటుంటే
పట్టలేని తమకంలో
బాధా భావాప్రాప్తిని అభినయించాను

కొంత ఘటన కొంత నటన

నాలోంచి తన్నుకొస్తున్న
మాయాప్రవరుణ్ణి చూసి
నేనే ముగ్ధుణ్ణవుతున్నాను

(1997-99?) (అముద్రితం)

Monday, October 4, 2010

బాలగోపాల్ సారాంశం.. బాధ్యత

బాలగోపాల్ ప్రజాజీవితంలో సాహిత్యం పాలు ఎక్కువా తక్కువా?
పోనీ- తెలుగు సాహిత్య విమర్శకు బాలగోపాల్ చేసిందేమిటి? 

సాహిత్య సంబంధి రచనలు చేయడంతో సహా ఆయన సాహిత్యాచరణ అంతా ఇతర రంగాల్లో ఆయన చేసినదాని ముందు చాలా తక్కువ అనిపిస్తుంది. తెలుగు సమాజం కూడా ఆయన సామాజిక రాజకీయ ఆచరణ నుంచి తీసుకున్నట్టుగా ఆయన సాహిత్యాచరణనుంచి స్వీకరించినట్టు కనిపించదు.

కానీ బాలగోపాల్ వ్యక్తిత్వంలో తాత్వికతలో సాహిత్యం పాత్ర చాలా ముఖ్యమైనది. సాహిత్యాన్ని తన కార్యరంగంగా ఎంచుకోలేదని, తాను అప్పటిదాకా రాసిన సాహిత్య విమర్శ వ్యాసాలు సమగ్రమైనవని అనుకోవడం లేదని 1989లో చెప్పిన బాలగోపాల్ ఆ తరువాత కూడా అడపాదడపా సాహిత్య వ్యాసాలు రాస్తూనే వచ్చారు.

మార్క్సిస్టు సాహిత్య విమర్శకు సంబంధించిన తాత్విక సమస్యల దగ్గరనుంచి, మార్క్సిజంపైనే అసంతృప్తితో తాను చేసిన తాత్విక అన్వేషణ దాకా బాలగోపాల్ ప్రస్తావించిందీ, చర్చించిందీ, ప్రకటించిందీ సాహిత్య సంబంధి వ్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారానే. తాను వేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరికాయని, తనకు సంతృప్తికరమైన ప్రాపంచిక దృక్పథం సమకూరిందని 2001తో చెప్పిన తరువాత- బాలగోపాల్ ఇక ఆ అంశాలను వివరించినట్టూ లేదు, మరే సాహిత్య రచనా చేసినట్టూ లేదు.

చరిత్రనీ, సమాజాన్నీ, మనిషినీ అర్థం చేసుకోవడానికి ఆయనకు మార్క్సిజం ఎంత ఉపకరించిందో, సాహిత్యం ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం, అందులోనూ పాశ్చాత్య కాల్పనిక సాహిత్యం కూడా అంతగా సహాయం చేసింది. మనిషికీ చరిత్రకూ ఉన్న సంకీర్ణమయిన సంబంధం గురించి, సామాజిక మానవ ప్రవృత్తికీ చరిత్రకూ ఉన్న సంబంధం గురించి, మనిషి చేయాలనుకునేదానికీ చేయగలిగేదానికీ మధ్య ఉండే ఖాళీల గురించి బాలగోపాల్ ఆలోచనలు సాహిత్య సామాజిక చారిత్రక అన్వయాలతోనే ముందుకు వచ్చాయి. హక్కుల ఉద్యమం గురించిన ఆత్మవిమర్శ-విమర్శ గానీ, మార్క్సిజం గురించి విచికిత్సగానీ, సాహిత్యవిమర్శ గురించిన కొత్త అభిప్రాయాలు గానీ విడివిడిగా కాక, పరస్పర సంబంధంలోనే కనిపిస్తాయి. చారిత్రక భౌతికవాదంలోని ఖాళీల దగ్గర నుంచి, జీవితంలోని ఖాళీల భర్తీ దాకా శక్తి కలిగినది కాల్పనిక సాహిత్యమేనని బాలగోపాల్ అంటారు. బాలగోపాల్ తన అన్వేషణలో సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యం తిరుగులేనిది. ఆయన ప్రజాజీవితాన్ని చూసినప్పుడు ఆనుషంగికంగా కనిపించినప్పటికీ, సాహిత్యం ఆయన వ్యక్తిగత, ప్రజాజీవితాల్లో అప్రధానంకాదు. అంతర్లీనంగా నిరంతరం వినిపిస్తూ ఉండిన సంగీతం.

ఇక తెలుగు సాహిత్య విమర్శకు బాలగోపాల్ చేసిన దోహదం చాలా ఉన్నది కానీ, సాహిత్య ప్రపంచం ఇంకా దానికోసం కళ్ళూ హృదయమూ పూర్తిగా తెరుచుకోవలసే ఉన్నది. 1980ల ఆరంభం నుంచి బాలగోపాల్ సాహిత్య వ్యాసాలు వాటిలోని సూటిదనానికి, సిద్ధాంతపటిమకు, కొత్త పరిశీలనలకు సాహిత్య పాఠకులను ఆకర్షించాయి. కానీ,

Wednesday, September 8, 2010

గ్రామర్‌ వర్సెస్‌ గ్రామర్‌


(ఇది 1997లోనో 1998లోనో రాసింది.  ఇది కవిత్వం కాదని, 'వచనం' అనీ అనుకునే రాశాను. వార్త ఆదివారం సంచికలో దీన్ని వచనరచనగానే - కాకపోతే యథాతథ పంక్తి విభజనతో- ప్రచురించారు. ఆరోజుల్లో ఎన్‌కౌంటర్లలో మరణించిన విప్లవకారుల మృతదేహాలను అప్పగించడానికి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే, గద్దర్‌ ఆధ్వర్యంలో మృతదేహాల స్వాధీనకమిటీ ఏర్పడి పనిచేసింది. ఆ కమిటీ పేరే బీభత్సంగా కనిపించింది. అటువంటి పదబంధాలు ఏర్పడే పరిస్థితిలో ఉన్న అమానవీయత గురించి రాయాలనిపించి దీన్ని రాశాను. తరువాతి కాలంలో సందర్భం, సంభాషణ కాలమ్స్‌లోని రచనాపద్ధతికి బహుశా ఇది పూర్వరూపం. - కె.శ్రీనివాస్‌)ఊదా రంగు ఆకాశం ఆకుపచ్చగా ఆవులించింది

****

వ్యాకరణాల సంకెళ్లను తెంచేయమని మహాకవులు ఆవేశంగా ఏదో అంటుంటారు కానీ,
చూడగా చూడగా స్వేచ్ఛ అమితంగా వున్న వ్యవస్థ ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అంటే వ్యాకరణం ఒక్కటే కనిపిస్తున్నది.
  
అర్థంతో సంబంధం లేదు, అపార్థంతో సంబంధంలేదు, సత్యం లేదు అసత్యం లేదు పాపపుణ్యాలు లేవు నీతి అవినీతులు లేవు రాజభక్తా రాజద్రోహమా నిమిత్తం లేదు. కర్తకర్మక్రియ వుంటే చాలు, వాటి మధ్య విభక్తి ప్రత్యయాల సంబంధం వుంటే చాలు అది వ్యాకరణబద్ధమైన వాక్యమై పోతుంది.

పరమ అబద్ధం కూడా వ్యాకరణ బద్ధంగానే   వుంటుంది.

పదాల స్వరూపం మాత్రమే వ్యాకరణం అని భ్రమపడ్డ పండితులు అరసున్నాలనూ బండిరాలనూ రక్షించుకోవాలనుకున్నారు. వ్యాకరణం ఇవ్వగలిగే అపారమైన స్వేచ్ఛను, వాని ప్రమాదాన్నీ ప్రయోజనాన్నీ పండితులూ గుర్తించలేదు. వారి ప్రత్యర్థులూ గుర్తించలేదు.

కవులూ భావుకులూ మాత్రమే నాడు నేడు ఈ వెసులుబాటును ఉపయోగించుకుని వెర్రిమొర్రి వూహలెన్నో చేశారు. అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో వదిలేయమన్నారు.

****

మద్యసంబంధ నేరాలు పెరిగి దుష్టశక్తులు పెరిగిపోతున్నందును మొదట మద్యనిషేధాన్ని సడలించి, దుష్టశక్తులను అణచి ఆ తర్వాత మద్యనిషేధాన్ని  కొనసాగించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ వాదించారు.

****

పదాలకీ వాటి అర్థాలకీ మధ్య సంబంధం నిర్హేతుకమైనదని భాషాశాస్త్రజ్ఞులు అంటారు. పదార్థాల సంబంధం పదార్థాల సంబంధం వంటిదేనని పార్వతీపరమేశ్వరుల సంబంధం అటవంటిదేననీ కాళిదాసు అన్నాడు.

పదాలే కాదు వాక్యాలు కూడా వాటి అర్థాలకు జవాబుదారీ కావు.

కొన్ని నామవాచకాలూ కొన్ని సర్వనామాలూ కొన్ని విశేషణాలూ కొన్ని క్రియలూ కుమ్మరించినంతమాత్రాన అవన్నీ కలసి యిచ్చే అర్థం మనం పోల్చుకోగలుగుతామని నియమమేం లేదు.

పాలు నల్లగా వుంటాయన్న వాక్యం పాలను నల్లగా మార్చలేదు.

మన దగ్గరున్న పదాలతో మనం లెక్కలేనన్ని వాక్యాలను, అర్థాలను సృష్టించగలం, వాటికి

Monday, August 23, 2010

మహాసాహిత్యసౌధపు 'ముంగిలి'

చరిత్ర అంటే గతంలో జరిగిన సంఘటనల సమాహారం కానట్టే, చరిత్ర రచన కూడా కేవలం విద్యావిషయకమైన విన్యాసం కాదు. చరిత్రలోకి తొంగిచూసి ఏ వాస్తవాలను వెలికితీస్తామనేది వర్తమానంలోని అవసరాలను బట్టే, ప్రధానంగా రాజకీయ అవసరాలను బట్టే నిర్ణయమవుతుంది. సుంకిరెడ్డి నారాయణరెడ్డి కూర్చిన తెలంగాణ ప్రాచీన సాహిత్య సర్వస్వం 'ముంగిలి'- ఒక చారిత్రకావసరం నుంచి జరిగిన చరిత్రరచన. ఇప్పటిదాకా వచ్చిన తెలుగు సాహిత్యచరిత్రల్లో తెలంగాణ ప్రాంత సాహిత్యానికి, కవులకు తగినంత గుర్తింపు, ప్రాధాన్యం లభించలేదన్న నిర్ధారణ నుంచి, తెలుగుసాహిత్యాన్ని కొత్తగా దర్శించే ప్రయత్నం. 'తెలంగాణ' అని నేడు రాజకీయంగా, సాంస్క­ృతికంగా చెబుతున్న ప్రాంతం నుంచి వచ్చిన కవులను, కావ్యాలను ప్రత్యేకంగా వేరుచేసి, వారి, వాటి గుణగణాలను, ఔన్నత్యాన్ని చాటి చెప్పే రచన.

తెలుగువారి చరిత్రలో కానీ, సాహిత్యచరిత్రలో కానీ తెలంగాణ ప్రాంతానికి ఇతోధిక స్థానం లభించకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇరవయ్యోశతాబ్దంతో పాటే దేశంలో పెరిగిన జాతీయభావన, ప్రజాస్వామిక ఆకాంక్షలు- రానున్న కాలంలో పాలనాధికారం విస్త­ృత జనశ్రేణుల నుంచే వస్తుందని సూచనలు పంపసాగాయి. కొత్త సమాజంలో ఆధిపత్యం కోసం వివిధ ప్రాబల్యవర్గాలు రకరకాల ప్రయత్నాలు చేయసాగారు. అందులో భాగంగా తమ తమ సామాజిక వర్గాలకు చరిత్ర ద్వారా సాధికారత సంపాదించే ఆలోచనా కలిగింది. తెలుగువారి చరిత్రను వెలికితీసే పరిశోధక కృషిని ప్రోత్సహించి, పోషించిన వారంతా సంస్థానాధీశులు, రాజాలు కావడం యాదృచ్ఛికం కాదు. ఈ మహాప్రయత్నంలో నిజాము పాలిత తెలుగుప్రాంతాలు అనాదరణకు గురయ్యాయి.

తెలుగువారే కాని కుతుబ్‌షాహీలు, ఏ కులమో తెలియని కాకతీయుల కన్నా, చిన్న చిన్న రాజ్యాలు పాలించిన రెడ్డిరాజులు, శ్రీనాథుని వంటి ఇతర ప్రాంత కవిపండితులను ఆదరించిన పద్మనాయకులు, తెలుగు అవునో కాదో తెలియకపోయినా తెలుగుసాహిత్యాన్ని పోషించిన విజయనగరరాజులు- తెలుగువారి చరిత్రలో పెద్దపీట పొందారు. బ్రిటిష్ పాలన చరిత్ర పురాతత్వశోధనకు అనువుగా ఉన్నంతగా నిజాము పాలన

Friday, August 20, 2010

విరిగిన చెరుకు విల్లు

(ప్రవాసీసాహిత్యం- అన్న  మాట కేవలం పరాయిదేశం వెళ్లి రాసేవాళ్లకే వర్తిస్తుందా? వలసలు రకరకాల కారణాలతో జరుగుతాయి. రకరకాల ప్రదేశాలకూ జరుగుతాయి. అంతర్గత వలసలు మాత్రం సాహిత్యాన్ని సృష్టించవా? పాత కళ్లతో కొత్త ప్రదేశాన్ని చూడడం, సొంత విలువలతో పరాయి సమాజాన్ని అంచనావేయడం ఉండవా? దాన్ని మాత్రం డయాస్పోరా అనకూడదా?- ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలే.  తక్కిన తెలుగు ప్రాంతాల నుంచి తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు  ప్రయాణాలు అనేక విడతలుగా జరిగాయి.  సందర్శకులో, వలసపక్షులో హైదరాబాద్‌ మీద అనేక అభిప్రాయాలను, అంచనాలను చెప్పారు. మాట వరసగా చెప్పారు, మంచితనంతో చెప్పారు, పొగుడుతూ చెప్పారు, హీనపరుస్తూనూ చెప్పారు. హైదరాబాద్‌ గురించి ఇతర ప్రాంతాల కవులూ రచయితలూ ఏమిచెప్పారో సూచన ప్రాయంగా చెప్పడానికి ఈ వ్యాసంలో ప్రయత్నించాను. ప్రధానంగా హైదరాబాద్‌ విధ్వంసం గురించి రాసినప్పటికీ, ఇందులో తీసుకున్నవన్నీ సాహిత్యకళారంగాల ఉదాహరణలే. ఒక పెద్ద పరిశీలనకు, పరిశోధనకు ప్రాతిపదికగా పనికివస్తుందన్న ఉద్దేశం కూడా ఈ వ్యాసరచనలో ఉన్నది. 2003లోనో, 2004లోనో రాసిన ఈ వ్యాసం 'సోయి' పత్రికలో ప్రచురితమైంది.  - కె.శ్రీనివాస్‌)


ఈ సంవత్సరం ఫిబ్రవరి 16 ఆదివారం నాడు హైదరాబాద్‌ నగరంలోని సుమారు లక్షమంది ముస్లిములు ఎండిపోయిన గండిపేట గుండెల మీద 'అల్లా'కు మోకరిల్లి, నీటి కోసం ప్రార్థించారు. అదొక అపురూపమైన దృశ్యం. మనుషులు సామూహికంగాచేసే చర్యల్లో మనల్ని అంతగా విచలింపజేసే సన్నివేశాలు చాలా అరుదుగా తారసపడతాయి. మరుసటిరోజు హైదరాబాద్‌ ఆకాశం మంత్రకవాటం తెరుచుకుని చిరుజల్లు కురిసినప్పుడు, మానవీయ సంకల్పానికి అద్భుత శక్తులు సమకూరతాయని ఒక క్షణం నమ్మాలనిపించింది.

మంజీరను కూడా దిగతాగిన కొత్తనగరం, ఇప్పుడు కృష్ణానదిని సాగర్‌నుంచి పగ్గంవేసి లాగుదామా, జూరాల నుంచి జుట్టుపట్టుకుని ఈడ్చుకుతెద్దామా కలలుకంటున్నది తప్ప, తొలినాటి కామధేనువులు కబేళాపాలవుతున్నందుకు కన్నీరు కార్చే సోయి దానికి లేదు. ఈ నగరం ఎవ్వరిదో వారే దాని కోసం విలపించాలి, వేడుకోవాలి. ఎవరి బొడ్డుపేగు ఈ నగరగర్భంతో ముడిపడి ఉన్నదో వారే గుండెలు బాదుకోవాలి.

ఈ హైదరాబాద్‌ ఎవరిది? చేపలతో సరస్సు నిండినట్టు, జనంతో ఈ నగరం నిండిపోనీ అని ఆకాంక్షించాడు నగరనిర్మాత కులీకుతుబ్‌ షా. మూడురోజుల పాటు మూసీ ఉప్పొంగిన ప్రళయకాలంలో నగరముఖద్వారం దగ్గర నిలుచుని రోదించాడు మహబూబ్‌ అలీ. మరెన్నడూ ముప్పురాకుండా విశ్వేశ్వరయ్య సాయంతో రెండు సాగరాలు నిర్మించాడు ఉస్మాన్‌అలీఖాన్‌. మూసీ ఎగువన మూడుపువ్వులుగా, దిగువన ఆరుకాయలుగా వ్యాపారం చేస్తున్న పరాయి షరాబులకు, ఒక పాతబస్తీని దరిద్రానికి గుర్తుగాచేసి, ఒక కొత్త బస్తీని మధ్యతరగతి పాతబస్తీగా మలచి, అమీర్‌పేట్‌ జూబ్లీహిల్స్‌ మాదాపూర్‌ రహదారిగా హైటెక్‌సిటీని నిర్మించి, ఇప్పుడు షంషాబాద్‌ను అంతర్జాతీయకేంద్రంగా తీర్చిదిద్ది తెలంగాణాను అపహసిస్తున్న వలసదొరలకు ఏ ఆకాంక్షా లేదు. చదరపు గజాలు తప్ప నేల తెలియదు. కాలనీలు, పార్కులు, ఫామ్‌హౌజ్‌లు,ఆర్కేడ్‌లు, ఎస్టేట్‌లు తప్ప జనం తెలియదు.

ఈ నగరం పరాయిగా మారిన చరిత్ర విచిత్రమైనది. స్థానికులెవరు, పరాయిలెవరు నిర్ణయించిన ప్రాతిపదికలలో మతానికి ఎన్నడూ ప్రాధాన్యమే లేదు. 1930 దశాబ్దంలో, తిరిగి 1950 దశాబ్దం ప్రారంభంలో ముల్కీ ఉద్యమాలు వచ్చినప్పుడు ఉత్తరాదినుంచి వచ్చిన ముస్లిములు, మద్రాసురాష్ట్రం నుంచి వచ్చిన హిందువులు పరాయివారయ్యారు. విశాలాంధ్ర అవతరించిన తరువాత ఈ  లెక్కలలో తేడా వచ్చింది. భారతదేశంలో విలీనమైన తరువాత కొన్ని ప్రత్యేక సదుపాయాలను కోల్పోయిన హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత

Friday, July 30, 2010

చిన్న చిన్న పర్సనల్‌ పద్యాలు

(ఇవన్నీ  అప్పుడప్పుడు రాసుకున్న చిన్న చిన్న పర్సనల్‌ పద్యాలు.  ఇవన్నీ నా మలిదశ కవత్వ ప్రయత్నాలని అనుకుంటాను. 1985 కంటెముందు రాసుకున్న కవిత్వం, అచ్చువేసినకవిత్వం - అదొక తరహాది. 1985 తరువాత ఎక్కువగా ఆత్మాశ్రయంగా రాశానేమో, వాటిని కేవలం వ్యక్తిగతం అనుకున్నానేమో, చాలా మటుకు అచ్చుకు ఇవ్వలేదు. నా నోట్‌బుక్స్‌లో మాత్రమే అవి ఉండిపోయాయి.  వీటిల్లో  కొన్ని అసంపూర్తిగా వదిలేసిన కవితలు కావచ్చు,కొన్నిటి సందర్భాలు కూడా గుర్తులేవు. కొన్నిటికి శీర్షికలు ఇప్పుడు పెట్టవలసి వచ్చింది. కాకపోతే, వెనక్కి తిరిగి చూసుకుంటే మరీ అంత చెత్తగా ఏమీ లేవని అనిపించింది. పర్సనల్‌, పబ్లిక్‌ స్థలాల విచిత్ర సమ్మేళనం అయిన బ్లాగ్‌లో వీటిని ప్రచురించడానికి అభ్యంతరం అనిపించడం లేదు. -కె.శ్రీనివాస్‌)


రాత్రి

అందర్నీ నిద్రపోయాక రాత్రి నన్నొక్కణ్నీ నంజుకుతింటుంది. ప్రపంచమంతా తలలో కిక్కిరిసిపోయాక ఇంక వూపిరేం ఆడ్తుంది. ఫ్రిజ్‌లో పూలుంటాయి, తలలో పేలుంటాయి, మనం మూసేసిన కిటికీ అవతల దోమలూ చంద్రుడూ వుంటాయి. నేను వొదిలిన గాలినీ, పొగనీ గిలకొట్టి ఫ్యాన్‌ మోతగా మన ల్ని వుడకబెడుతుంది.

కళ్లు మూసుకుని నేను మాయమయిపోతే రేపొస్తుంది. రేపంటే ఓ సుప్రభాతమూ, వో బంగారపుటెండా కాక అబద్ధపు కాగితప్పువ్వుల్ని మాలగా కట్టడానికి చేసే ప్రయాణమన్నమాట. రేపంటే అంతే, నడిచి నడిచి వెళ్లి కొంత చీమూ నెత్తూరూ అమ్ముకుని నడిచి నడిచి రావడమన్నమాట.

వేళ్ల సందుల్లో కొంత మృత్యువుంది. దాన్ని పీల్చాక నుసైపోయిన వో సుదూరభవిష్యత్తు వో  బంగారు రేకుపెట్టెలో కంపుగొడుతూ వుంటుంది. గుండెల్లో వేడి పొగ నెప్పీ తలలో దెయ్యమూ  ఆదమరిస్తే చాలు నాలోకి దూకడానికి గదిబయట పొంచివున్న పీడకలా, పక్కనే అలసిపడుకున్న నువ్వూ, తీరిగ్గా నేను ఖాళీచేసుకుంటున్న నేనూ, -- ఈ రాత్రి బావుంది. నిద్రపోయిన సత్రంలాగా, మార్చ్యురీలాగా నా మనసు. గుడ్‌నైట్‌
(1987 మార్చి 9 అర్థరాత్రి)


ఓపద్యం రాసి చేతులు దులిపేసుకోనా  పూర్ణా!

అందమైన ఆ రెండు పాదాలూ
పదబంధ ప్రహేళికై నన్ను పెనవేసుకున్నట్టు
అలినీలాలక వేణి అలలు అలలుగా  ఎగిరిపడ్డట్టు
శుభ్రజ్యోత్స్న మందారాలు కరతలామలాకలాలయినట్టు

నాకలలు యింకా పచ్చిగానే వున్నాయి పూర్ణా!

నువ్వూనేనూ పంచుకున్న రహస్యమేమిటో చెప్పు
రెండు లిప్తలు దాటి విరిగిపోయిన
        నా దృక్‌స్పర్శకు నీ సమాధానమేమిటో చెప్పు
ఎంత పనిచేశావు పూర్ణా
(1990)  ( పూర్ణ- నామవాచకం కాదు)


పరవాలేదు


నా ఏటవాలు చూపు
నీ పైటను సవరించినప్పుడో
పొట్టముడతల్లో చిక్కుకుపోయిన నా కనుగుడ్డును
పెకిలించుకుంటున్నప్పుడో
తప్ప
అంతా అమలినంగానే జరిగిపోయింది

రెండుచూపులూ స్పర్శించుకోగానే
వో అయస్కాంత క్షేత్రం

Saturday, July 17, 2010

దుర్గమారణ్యంలో దారులు వేసిన సురవరం

ఆయనేమన్నా దొరా దేశ్‌ముఖా- ఈ ప్రశ్నను కొండా వెంకట రంగారెడ్డి వేశారట. 1952లో హైదరాబాద్‌ రాష్ట్ర మొట్టమొదటి 'ప్రజాస్వామ్య' ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరిని నియమించాలో సూచిస్తూ ఒక జాబితా పట్టుకుని బూర్గుల రామకృష్ణారావు ఢిల్లీకి పయనమైనప్పుడు, ఆ జాబితాలో ప్రతాపరెడ్డి పేరు చూసి రంగారెడ్డి ఆ ప్రశ్న వేశారట. హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ శాసనసభ్యులంతా దాదాపు రంగారెడ్డి వర్గీయులే కావడంతో, ప్రతాపరెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు.  బదులుగా డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తామంటే ఆయన ఒప్పుకోలేదట.  ఇదంతా జరిగి ఉండకపోతే, హైదరాబాద్‌ రాష్ట్రానికి ప్రతాపరెడ్డి తొలివిద్యామంత్రి అయి ఉండేవారు.

దొరా కాకుండా దేశ్‌ముఖూ కాకుండా ప్రతాపరెడ్డి ఏమిటి? కమ్యూనిస్టా? " ఆయన దొరలపక్షాన లేడు,అలాగని  వారితో పోరాటమూ చేయలేదు''- అని ప్రతాపరెడ్డి పెద్ద కుమారుడు ఎస్‌.ఎన్‌.రెడ్డి పదేళ్ల కిందట ఈ వ్యాసకర్తతో అన్నారు. కమ్యూనిస్టులను దారుణహింసావాదులని, కామరేడులని విమర్శించన సంపాదకుడు కమ్యూనిస్టు కాదు కదా? పోనీ జాతీయవాద పక్షంలో క్రియాశీల పాత్రధారా? నిజాం ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఆయనను నిర్బం«ధించలేదే?  సాహిత్యసాంస్క­ృతిక అంశాలకు ప్రాధాన్యం తగ్గుతున్నదని ఆంధ్రమహాసభనుంచి ఎడం జరిగిన ముక్కుసూటిమనిషికి జాతీయవాదులు మాత్రం పూర్తి యోగ్యులుగా కనిపించి ఉంటారా? ఒక సంపన్న రైతు కుటుంబంలో పుట్టి, బ్రిటిష్‌ ఆంధ్రలో ఉన్నతవిద్య అభ్యసించి, తెలంగాణ ప్రాంతంలో సాంస్క­ృతిక, రాజకీయ వికసనానికి సారథ్యం వహించిన 'శిష్ట' బృందంలో ఒకరుగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డిని మదింపు వేయడం అంత సులభం కాదు. వైతాళికులనీ, పునరుజ్జీవన ప్రేరకులనీ మనం చెప్పుకునే ఇతరులకు వర్తించే అనేక అంశాలు ఆయనకు వర్తించవు. ఆయన కార్యక్షేత్రంగా ఉన్న నేల, ఆయన జీవించిన కాలం, అప్పుడు నడిచిన చరిత్ర- అన్నీ ఆయన దోహదాలను ప్రత్యేకం చేశాయి, విశిష్టం చేశాయి. ఆయన కథకుడు, విమర్శకుడు,కవి, పండితుడు, చరిత్రకారుడు, పరిశోధకుడు, పత్రికాసంపాదకుడు, గ్రంథాలయ ఉద్యమనాయకుడు, అరుంధతీయ ఉద్యమ భాగస్వామి,నాయకుడు,  భాషాభిమాని, తొట్టతొలి నైజామాంధ్ర మహాసభ అధ్యక్షుడు.

రాజకీయవాదులూ, సాహిత్యసాంస్క­ృతిక కార్యకర్తలూ, సంస్కర్తలూ వేరువేరుగా 'అవతరించేంత వ్యవధి కానీ, వెసులుబాటుగానీ, చైతన్య విస్త­ృతి కానీ లేనిది ఆనాటి తెలంగాణ. పునాదులు

Tuesday, July 6, 2010

పర్సనల్ పద్యాలు - 4

ఒంటరి ఏకాంతం

             ఒక క్షణిక స్ఫురణ
            తెగిన బల్లితోక విలవిల

పొద్దున్నే గది వూడ్చాను దీపపు పురుగుల రెక్కలు
సిగరెట్‌ పీకలు ఎండిపోయిన అక్షరాల మరకలు
పగిలిన కలవరింతలు

            ఎడతెగని నిరీక్షణ
            చూయింగ్‌ గమ్‌

అలలాగా వచ్చి రాత్రి ఈ నత్తగుల్లల్ని వదిలి
వెళ్లింది
            వొక్క నలిగిన పువ్వైనా లేదు

(సెప్టెంబర్‌ 1992లో ఒక రోజు రాత్రి)

Wednesday, June 23, 2010

పర్సనల్ పద్యాలు - ౩

ఒక  restricted   కాల్ 

ఇప్పుడిక ప్రసారానికి అంతరాయం
డయలు చేయవలసిన నంబరు అందుబాటులో ఉండదు
వేళ్ళు కదిలినా కీ పాడ్ ని హత్తుకున్నా గొంతు పెగలదు
అనేబుల్ టు రీచ్

బాల్కనీ ఆకాశంలోకి  చూసినప్పుడు ఒక ఒంటరి నక్షత్రం కనిపిస్తుంది
నీ చూపులని  పీల్చి అది  నా కన్నీటి పొరపై  ప్రతిఫలిస్తుంది
సమీప సముద్రం నుంచి వాయవ్యంగా ఒక గాలి తరగ వీస్తుంది
నీ తను పరిమళాన్ని అది నాకు చందనమై పూస్తుంది

మూగబోయాము నిజమే కానీ
జరజరా పాకే నా జ్ఞాపక స్పర్శని నువ్వు ప్రేమగా  విదిలించుకుంటూనే ఉంటావు
క్షణానికోసారి ఒంటరి కౌగిలిలో నీ ఖాళీని నేను  తడుముకుంటూనే ఉంటాను

ఉన్నట్టుండి ఒక స్ఫురణ నై నీ పెదాల చివర ముసిముసి నవ్వవుతాను
చెప్ చెప్ చెప్ చెప్ అంటూ నువ్వు గింగిర్ల గొంతుతో గుసగుసల గిలిగింత పెడతావు


ఇష్టమే ఒక టవర్  మనోవేగమే ఫ్రీక్వెన్సి 
కవరేజ్ కిక  కరువేమిటి

Wednesday, June 9, 2010

ఇండియన్‌సమ్మర్‌

( ఎడతెగకుండా సాగుతున్నది ఈ వేసవి. అయిదేళ్ళ కిందటి వేసవీ ఇట్లాగే ఉన్నది.. కే. శ్రీనివాస్)

ఓ ప్రియా,  ఉక్కబోతలో ఉక్కిరిబిక్కిరి అయ్యే కాలం వచ్చేసింది. అయినా సరస్సులు, నదులు ఇంకా సమృద్ధజలాలతోనే ఉన్నందున,  పగటిజలకాలకు ఇక విరామమే అక్కరలేదు.  పొద్దువాలిన తరువాత,  అందమైన చందమామ నిండిన  ఆహ్లాదపు  రాత్రులలో  మన్మథుడి ప్రతాపాన్ని అధిగమించడం కష్టమేమీ కాదు.  ముగిసిన వసంతకాలంలో చెమటలు పట్టించిన మదనతాపం ఇక చల్లబడుతుంది కాబట్టి, రాత్రులు హాయిగా చల్లటి పానీయాలతోను, గానవినోదాలతోనూ ఆరుబయట ఆనందించవచ్చును.... (కాళిదాసు, రుతుసంహారం, గ్రీష్మం)

వెళ్లిపోతూ వర్షరుతువు కురిపించిన  జడివానల శేషజలాలలో వేసవి స్నానాలాడే రోజులెప్పుడో పోయాయి. రాతిరి మలిజాములో పలకరించే మలయానిలం కోసం  ఆరుబయలు నిరీక్షణలెప్పుడో పోయాయి.  రుతువెప్పుడో సంహరించబడింది మహాకవీ, ప్రియురాలి చెక్కిలిమీద కరిగిపోయే గైరికాది ధాతువులూ పెదవులమీద చెదిరిపోయే లత్తుకలూ నిఘంటువులలోకి చేరిపోయాయి మహాకవీ.. కంచువృషభముల అగ్నిశ్వాసం గ్రక్కే గ్రీష్మం కదా మహాకవీ!

వేసవి వేసట కొత్తగా వచ్చిందేమీ కాదు కానీ,  నేల సూరీడైపోయి తేలే అగడులో వేగిపోవడం ఇప్పటిది కాదు కానీ,  ఎండాకాలం ముందు మనిషి ఇంత నిరాయుధంగా నిలబడడం మాత్రం కొత్తదే. మనిషి లోపల దుర్భిక్షం కొత్తదే. గుండె బండరాయిలాగా కాలిపోవడం కొత్తదే. నుదుటిమీద ముత్యంలా మెరిసే చెమట చూరునీళ్లవలె కురియడం కొత్తదే. ఆకు అల్లాడని శిలాక్షణాన  ఎగబోసుకుని ఊపిరిని నిలుపుకోవడం కొత్తదే.

తక్కిన అయిదు రుతువుల కోసం భరించవలసిన శిక్ష ఏమీ కాదు. 'భూమిని తలకిందు చేసి బువ్వ పంచి ఇచ్చే' సృష్టి క్రమానికి ముందు నీడపట్టున సేదతీరే ప్రవాసం వేసవి.  వసంతం తరువాత వెలసిన మౌనం గ్రీష్మం అంటాడు ఒక కవి.   ఆ మౌనంలోనే మనిషి తనలోపలినుంచి వింజామరలను, గంధపుపూతలను, మలయానిలాన్ని సృష్టించుకుంటాడు.  ప్రేమ లేని జీవితం అంటే గ్రీష్మం లేని కాలం లాంటిది అని ఒక యూరోపియన్‌ సామెత. వారి సమ్మర్‌లో సెల్సియస్‌లు తక్కువే కావచ్చును. అయినా,  ఉష్ణం తక్కువైనా ఉగ్రత తక్కువ కాదు. బాధపడతాం, ఇష్టపడతాం, అదే వేసవిలోని విచిత్రం అంటాడు  ఒక ఇంగ్లీషుకవి.  ఎండ సృష్టించే వైచిత్రులు కవులకు పండగ.   దహించుకుపోతే మాత్రమేమిటి -తటాకపు చల్లటి నీటిపై తామరలు పరచుకున్నప్పుడు, మల్లెదండలు పరిమళించినప్పుడు- అంటాడు అదే కాళిదాసు. నీడ కోసం పాముపడగ కిందికి చేరిన బురద కప్ప కు ప్రాణభయమే లేదంటాడు, కడుపులో దాచుకున్న నీటిని గొంతులోకి తోడుకుంటూ చల్లబరచుకుంటున్న ఏనుగుకి పక్కనే సింహం సంచరించినా తెలియడం లేదంటాడు. నడిజామున చెట్ల నీడలన్నీ కుంచించుకుపోతే, దాహంతో చెట్లు తమ నీడలను తామే తాగాయేమో అంటాడు నన్నెచోడుడు.  మల్లెపూల వలె, నారికేళం వలె, చందనచర్చ వలె, మామిడిపండువలె, కవిహృదయం వలె ఎండాకాలంలో జీవితం చల్లగా ఉంటుంది.

కానీ, గాలిని నీటిని ఆకాశాన్నీ పచ్చనాకునీ పట్టుకుని అమ్ముకునే వ్యాపారులొచ్చాక, వేసవి విస్తరించింది. వర్షాన్ని హేమంతాన్నీ అది కొరుక్కు తినసాగింది. అడవులన్నీ కలపగా మారిపోయాక, గదుల్లో గాలి చల్లగా స్తంభించిపోయాక, గంగవెల్లువలన్నీ బాటిల్‌కమండలాల్లో బంధితమయ్యాక,  ఆకాశం పొగచూరిపోయాక- మనుషులు గ్లోబలైజ్‌ అయినట్టు, రుతువులన్నీ సమ్మరైజ్‌ అయిపోయాయి. వర్షాకాలంలో దొరికే అకాలపు

Friday, May 28, 2010

పర్సనల్ పద్యాలు -2

చెప్పానా 


పాత స్పర్శతో కొత్త క్రీడ అయినా
కొత్త స్పర్శతో పాత క్రీడ అయినా
జీవితపు పునరుజ్జీవనమే
పూలమొక్క కొత్త మొగ్గ వేసినట్టు
మనసు రోజూ కొత్తగా పూయాలి
తుమ్మెదా పాతదే పువ్వూ పాతదే పరాగమే కొత్తది సరాగమే కొత్తది

ఈ దేహం మీద నీకు సందేహం కదా,
కోటి నఖక్షతాల గురుతులేవి   లక్ష ఆలింగానాల ఆనవాళ్ళేవి
ఈ ఛాతీ మీద ప్రవహించి వెళ్ళిన వక్ష సముద్రాలేవీ
వొక్క సారి తొంగి చూడు మిత్రమా నా మనశ్శరీరాలలోకి
అనుభవం జ్ఞానం లోకి ఇంకిపోతే,
మరో రాత్రి చంద్రుని కోసం బాహువులు విప్పుకున్న ఆకాశమే కనిపిస్తుంది.

ఎన్ని వర్షాలు చూసింది ఈ పర్వతం ఎన్నిసార్లు కడుపుతో ఉన్నది ఈ నేల
ఎన్నిసార్లని ఎన్ని సార్లని ఎన్నెన్నిసార్లని సూర్యోదయం
లక్ష కన్నె పొరలతో పుట్టిన అయోనిజులం  ఎప్పటికీ పరస్పరం అనాఘ్రాతులమే

ఒక ఆలింగన గర్భంలో పుట్టిన అనుభవ శిశువుని నువ్వు లాలిస్తున్నప్పుడు
నీ చెదిరిన ముంగురులతో  నేను మరో కౌగిలిగూడుని అల్లుకుంటాను

Tuesday, May 25, 2010

అవయవం

ఆమ్మాయి రొమ్ములు పెద్దగా  ఉంటాయి
పరిగెత్తిస్తే చెంగుచెంగున గెంతుతాయి
క్లోజప్‌లో కళ్లకు ఊపిరాడకుండా చేస్తాయి
నిగ్గదీస్తే ఖంగుఖంగున మోగుతాయి

ఆమ్మాయి తొడలు లేత అరటిబోదెల్లా వుంటాయి
చెట్టెక్కిస్తే కిక్కెస్తాయి
ఆమ్మాయి జఘనం ఘనంగా ఉంటుంది. కెమెరా కంటికి తాయిలంలా కనిపిస్తుంది
ఇటుచూస్తే బొమ్మ తిరగేస్తే దిమ్మ

ఆమ్మాయి మొహం పాపాయి మొహంలా వుంటుంది
ఆమ్మాయి నవ్వితే బాల్యం పాలులా విరిగినట్టుంటుంది
ఆమ్మాయి కామంగా చూస్తే మొహమాటంగా వుంటుంది
ఆమ్మాయి నోట్లో వేలుపెట్టుకుని చప్పరిస్తే చిన్నతనం అలవాటుగా కాక
ఫెలెషియో స్ఫురింపిస్తున్నట్టుగా అనిపిస్తుంది

తెరనిండుగా ఆమ్మాయి తన అవయవాలను ఆరబోస్తే
ఎడారిలో పసిపాపల సవారీ వొంటెల పందెం చూస్తున్నట్టుంటుంది

***
వెండితెరల మీద తోలుకలల బొమ్మలాటను చూస్తుంటే మాసేజ్‌ పార్లర్‌లో కూర్చున్నట్టుంటుంది. అన్ని పాత్రలూ మెదడూనూ, అజ్ఞానేంద్రియాలనూ మర్దనచేస్తే, హీరోయిన్‌ మాత్రం ప్రేక్షకుల మగతనానికి గురిపెడుతుంది
లేత చూపులు, ఆర్ద్రమైన చూపులు, మృదువైన పలకరింపులు వెళిపోయాయెళిపోయాయ్‌. నాభీ ప్రదర్శనమూ, వాయొలెంట్‌ ఇంటర్‌కోర్స్‌ను స్ఫురింపించే జర్క్‌లూ, దేవతావస్త్రాల పోర్నోభాష----

ఆడతోలు బొమ్మలకి అవయవాలు తప్ప మరేమీ వుండవు
" అవసరమైనంత వరకు ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమే, మడికట్టుకుంటే ఎలా?''
హీరోయిన్లకు అఫైర్లుంటాయి, పత్రికలు అమ్ముకోవడానికి సరుకులు..
తాగుతారు, సిగరెట్లు తాగుతారు,, తూలుతారు, డ్రగ్స్‌ తీసుకుంటారు, మేకప్‌రూంనుంచి మేకప్పులు నలిగి బయటికివస్తారు.
" పెళ్లికాలేదు, పెళ్లికాలేదు, పెళ్లయితే మీకు చెప్పకుండానా?''
పెళ్లయితే ఎలా, ప్రేక్షకులకు మాస్టర్బేషన్‌ కుదిరేనా?
సినిమా థియేటర్లు హస్తప్రయోగాలకు ఫోర్‌ప్లే గ్రౌండ్లు.

***

ఎంతసేపూ వునికి అవయవాలేనా?
విసుగువేస్తుంది. ఎంతసేపూ కోట్లాది కళ్లకోసం ముస్తాబు చేసుకోవడమేనా?
సెక్సీడాల్‌! నీకు ప్రాణం వుందా?

***
కొందరు చచ్చిపోతే తప్ప వారికి అంతకుముందు ప్రాణం వుందని స్ఫురించనే స్ఫురించదు. వాళ్లు మనుషులనీ, వారికి జీవితం వుందని, వారుసెక్సడం కాక బతుకుతారని తెలియదు. అట్లా తెలియజేయడానికే, కోట్లాది అంగస్తంభనలని భగ్నం చేయడానికే కొందరు చచ్చిపోతారు.
 (దివ్యభారతికి)

(1992 -93 లో ఆంధ్ర జ్యోతి  ఆదివారం అనుబంధంలో 'సింగిల్ కాలమ్' పేరుతొ ఒక శీర్షిక రాసేవాడిని. సినిమా నటి దివ్య భారతి చనిపోయినప్పుడు రాసిన కాలమ్ ఇది. దీని మీద అప్పట్లో ఆఫీసు లోనూ బయటా చాలా రభసే జరిగింది. రచన అసభ్యం గా ఉందని విప్లవ సాహిత్య పత్రికలు సైతం విమర్శించాయి. మనుషుల్లోని అసభ్యత గురించి రాసిన కాలమ్ ఇది అని అప్పుడు నా సమాధానం. విప్లవ పరిభాష ఉన్నంత మాత్రాన విప్లవ రచన కానట్టే,  లైంగిక శరీర పరిభాష ఉన్నంత మాత్రాన అది బూతు కానక్కర లేదు కదా? - కె. శ్రీనివాస్ )

Friday, May 14, 2010

పర్సనల్ పద్యాలు-1

ఓల్డ్‌ ప్రాడిజీ


ఖాఖాన్‌ తెమూజిన్‌ ఏం జేస్తున్నాడు
కాయలు గాసిన కకుద్రేఖను
గిల్లుకుంటున్నాడు
చుక్కల్లో చంద్రుడా
అట్టకిరీటం ఇంద్రుడా
పడగపట్టిన పామెక్కడ?
**

పగబట్టెను చూడిక్కడ
శౌర్యమ్ములేదు లేదు త్యాగమ్ము
....రాయన్‌
రాపడనే లేదు రొమ్ము
గారాల పట్టీ
**

చెడబుట్టావు గదరా!
**

ఉలిక్కిపడి లేచేసరికి
కేసెట్‌ ఎఫ్‌ ఎఫ్‌ అయిపోయింది

ఏ భావమూ ప్రాప్తించని
శుష్కస్ఖలనంలా
ఏ శ్లేషా వరించని
వుట్టి వాచ్యంలా
పసిడి రెక్కలు విసరకుండానే
కాలం పారిపోయింది

చీకటి పడిపోతోంది
*

తొందరగా ఇంటికి పోవాలి
ఆట అరగంటే వుంది

*

గోల్‌చేయాలి

(రచనాకాలం 1995 )

Monday, April 26, 2010

పగిడికంటి పాటగాడు


(కోకిలలూ పావురాళ్ళూ  గండ భేరుండాలూ రాజ్యమేలిన తెలుగు సాహిత్యంలో ఇప్పుడు పాలపిట్ట రెక్కల  టపటప వినిపిస్తోంది. చిన్న పనికి కూడా పెద్ద చాటింపులు వేసుకునే చోట, మౌనంగా నిశ్శబ్దంగా పెద్ద పనులు చేసే గుడిపాటి పాలపిట్ట పేరుతొ ప్రచురణలు, సాహిత్య మాస  పత్రిక ప్రారంభించారు. ఇప్పటికి మూడు పత్రికలు వచ్చాయి. మంచి కాయితం, ముచ్చటైన ముద్రణ మాత్రమె కాదు, విలువైన రచనలతో వస్తున్నా పాలపిట్ట పత్రిక, చాలా కాలంగా ఒక మంచి సాహిత్య పత్రిక కోసం ఆవురావురుమంతున్న తెలుగు సాహిత్యాభిమానులకు పండుగ. పాలపిట్ట మూడో సంచిక ( ఏప్రిల్ 2010 ) గోరటి వెంకన్న ప్రత్యెక సంచిక గా వచ్చింది. మాధ్యమం లిటరరీ ఫోరం, పాలపిట్ట బుక్స్ కలిపి ప్రచురించిన గోరటి వెంకన్న ' అలసెంద్రవంక' గేయ సంకలనం తో పాటు ఈ ప్రత్యేక సంచిక కూడా ఆవిష్కృత మైంది. గోరటి  వెంకన్న అభిమానులంతా చదవవలసిన ప్రత్యేక సంచిక ఇది. 
ఈ సంచిక చదువుతున్నప్పుడు, ఎనిమిదేళ్ళ కిందట 'ప్రజాతంత్ర' ప్రత్యేక సాహిత్య సంచిక (2002 )లో గోరటి వెంకన్న మీద నేను రాసిన సంభాషణా వ్యాసం గుర్తుకు వచ్చింది. ఆ వ్యాసం ఇక్కడ మరొక సారి. - కే. శ్రీనివాస్ )

 
నిశ్శబ్ద మరణంలో అణగారిపోతున్న అందమైన జ్ఞాపకానికి ఒక కవి కాపలాకాస్తున్నాడు. మృత్యువూ శైథిల్యమూ పరివేష్ఠించిన వల్లకాటి పేరోలగంలో అతనొక్కడు ఇంకా బతుకుపాట పాడుతున్నాడు.
 
వేనవేల ఏండ్లుగా ఎడతెగని సీతమ్మ విషాదాన్ని మోసుకు తిరుగుతున్న బాలసంతువలె-పల్లెను దాని పచ్చి గాయాలను దాని వెచ్చటి గాథలను  అతను పరవశించి గానం చేస్తున్నాడు.
 
నోరులేని పాలమూరు పల్లెను గొంతులో జీరగా నిలుపుకుని సమూహ దు:ఖాన్ని అతను పలుగురాళ్లు నమిలినట్టున్న పదాలలోకి అనువదిస్తున్నాడు.
 
నరులను భయపెట్టే కటికచీకటికి కూడా ఏకనాదంతో ఎరుకను బోధించే బైరాగి వలె  అతను మనిషి మనసులోని గుయ్యారాలను వెలిగిస్తున్నాడు.
 
గోరటి ఎంకన్న. తెలంగాణా కావలసివచ్చిన కాలానికి ఎదిగివచ్చిన కవిపుత్రుడు.

 
జానెడెత్తు గడ్డి మొలిచిన బొందలనుంచి తెలంగాణా బిడ్డలను అతని పాట నిద్రలేపుతున్నది. ఈ కాలంనుంచి మోసుకుపోయి ఒక కాల్పనిక జ్ఞాపకంలోకి విడిచివస్తున్నది. సుదీర్ఘ గ్రీష్మంతో అల్లాడుతున్న నేలలో కొంత తడిని, ఇంత జలను పుట్టిస్తున్నది.. మూగపడిన బెంగలకు అక్షరాలను అద్దుతున్నది, ఇటువంటి పాటే, ఇదే పాటే... పాడాలని ఎప్పటినుంచో తడుముకుంటున్న గొంతులన్నిటినీ అతనెలా పూసకట్టగలిగాడు?
 
జనం ఊహలనుంచి ఎంకన్న ఒక గ్రామాన్ని తుడిపేసి మరొక గ్రామాన్ని నిర్మిస్తున్నాడు. ఇదంతా అతను తెలిసే చేస్తున్నాడా? అతను కలవరిస్తున్న ఊరు ఏ కాలంలో అయినా బతికిందా? ఎవరి జ్ఞాపకాలను అతను ఆలపిస్తున్నాడు? ఈ అధ్వాన్న శకంలో ఏ వైభవోజ్వల యుగాన్ని యాదికి తెస్తున్నాడు? ఏ అధ్వాన్న శకానికి వైభవపు మెరుగులు అద్దుతున్నాడు? ఎందుకు తెలంగాణా అంతా అతని పాటకు పులకించిపోతున్నది? ఎందుకు బీడుపడిపోయిన తెలంగాణా గుండెలకు అతను పాట పదును తెస్తున్నది?
 
  రేలాదూలా తాలెల్లాడే నేలా నా తెలంగాణా
  సుడిగాలికి సెదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణా

 
కాలజ్ఞానులయిన కవుల మాటలను అర్థాలు వెదుక్కుంటూ వస్తాయట. నడుస్తున్న చరిత్ర తనను తాను దట్టించుకున్న పదజాలమంతా ఎంకన్న పాటలలోకి పరుగుతీస్తున్నదనిపిస్తుంది. తన పాటలు అన్వయిస్తున్న అర్థాలు ఏమిటో అతనికి పూర్తిగా తెలుసునా? ఏ సుడిగాలికి చెదిరింది తెలంగాణా చెప్పు?-అంటే నవ్వేస్తాడు. . పల్లె కన్నీరు పెట్టడానికి కారణమైన ఆ 'కనిపించని కుట్రలు' ఏమిటో వివరించమంటే

Monday, April 19, 2010

వచనంలోనూ మహాకవే!

(మిత్రుడు ఆర్‌.సుదర్శన్‌ శ్రీశ్రీ వచనరచనల మీద పిహెచ్‌.డి.పరిశోధన చేశాడు. అతని పరిశోధన గ్రంథానికి ముందుమాటగా 1998 ప్రాంతంలో రాసిన వ్యాసం ఇది. తెలంగాణ వాదం అప్పుడప్పుడే మలిపూత పూస్తున్నది. ఆ సూచనలు ఈ వ్యాసంలో కనిపిస్తాయి కానీ, అనంతర కాలంలో శ్రీశ్రీ మీద వచ్చిన ప్రశ్నల ప్రస్తావన ఇందులో ఉండదు. విప్లవోద్యమానికి వేదిక అయిన తెలంగాణ, శ్రీశ్రీని చివరిరోజుల్లో గట్టిగా ఆలింగనం చేసుకున్నదని ఇందులో రాశాను కానీ, తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో శ్రీశ్రీ వైఖరిని ప్రస్తావించనే లేదు. శ్రీశ్రీ అనేక వివాదాస్పద వైఖరుల విషయంలో ఎట్లా తెలుగుపాఠకులు రాయితీనీ ఇచ్చారో- తెలంగాణపై ఆయన వైఖరిపై కూడా తెలంగాణ ప్రజలు, ఉద్యమం అటువంటి సహనాన్నే చూపుతారని నా అంచనా - కె.శ్రీనివాస్‌)ఇరవయ్యో శతాబ్దం ముగిసిపోతున్నది.
ప్రశ్నల్ని ఝళిపిస్తూ రంగస్థలాన్ని ఆక్రమించుకుంటున్న కొత్త శక్తులు తన అక్షరాలకు ఎన్నిమార్కులు వేస్తాయోనని భయం భయంగా వినయంగా ఒక 'మహాకవి' నిరీక్షిస్తున్నాడు.
ఒక చారిత్రక విభాతం అందించిన అహంకారంతో ' ఈ శతాబ్దం నాది'అని ప్రకటించుకున్న మహాకవి అతడు.
**

పతితులు,భ్రష్ఠులు,బాధాసర్పదష్టులు వంటి అర్థనైరూప్య శ్రేణుల్లో ఇమమడడానికి ఇష్టపడక అనేక ప్రజాసమూహాలు కొత్తనామకరణాలు స్వీకరించిన కాలంలో,భాషాప్రయుక్త రాష్ట్రాల భావనలోదాగిన వలసవాద దుష్టసమాసాలని గుర్తిస్తున్న స్థలంలో నిలబడి మిత్రుడు 'తెలంగాణ బహుజన' సుదర్శన్‌ శ్రీశ్రీ వచనరచనల గురించి పరిశోధనకు ప్రయత్నించడం కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. పరిశోధనల పరిమితుల్ని, సుదర్శన్‌ పరిమితుల్నిఅర్థం చేసుకోవలసిఉంటుంది.

అలాగని, శ్రీశ్రీ ఊసే ఇవాళ అసందర్భమై పోదు.బతికి ఉన్నన్నిరోజులూ కొత్తతరంతో కలిసి నడవాలని ప్రయత్నించిన ఈ కవి తన మరణానంతరం సాగుతున్న సామాజిక మహాసంచనలంలో ఎంత వరకు మిత్రుడిగా మిగులుతాడో అంచనావేస్తూ పోవలసిందే.
**

తెలుగు వచనం గురించిన చర్చకు ఈరోజు సందర్భం ఉన్నది. కవిత్వం అనేది కేవలం సాహిత్యరంగానికి సంబంధించింది మాత్రమే కానీ, వచనానికి సాహిత్యేతరమైన వినియోగం,జీవితం చాలా ఉన్నది. విశాలమవుతున్న సమాజ అవసరాలు అందుకు సహాయపడగల భాష కోసం వెదుక్కుంటున్నాయి. విషయం ప్రధానంగా, సమాచారం ప్రధానంగా ఉన్న రచనలకు పనికి వచ్చే తెలుగు వచనం ఇంకా రూపుదిద్దుకునే దశలోనే ఉంది. సాహిత్యరంగంలో ఉన్న వారితో పోలిస్తే,ఇతర సామాజిక అవసరాల కోసం సమర్థమైన తెలుగును రాయగలవారి సంఖ్య అతి తక్కువగానే ఉన్నది.

ఇందుకు బాధ్యులు ఎవరు? దీనికి'అభివృద్ధి'కీ సంబంధం ఉన్నది. 'అభివృద్ధి' చెందిన సమాజాల భాషలతో పోల్చుకుని లేదా వాటినుంచి అనువాదాలు చేయడంలో సమస్యలను ఎదుర్కొని మనభాషను 'అభివృద్ధి'చెందని భాషగా చెప్పుకుంటున్నాము. అనువాదం సాధ్యం కానంత స్థానికంగా కవిత్వభాష ఉండాలని శ్రీశ్రీ అంటాడు. అభివృద్ధి చెందిన భాషలతో అంతర-అనువదనీయత లేకపోవడం ఒక లోపం అంటుంది ఆధునికత. తెలుగు శాస్త్రభాషగా, స్వతంత్రంగా ఆలోచనలు నిర్మించగలిగే భాషగా లేకపోవడానికి సామాజిక,రాజకీయకారణాలు ఉన్నాయి సరే, కానీ ఆ లోపాన్ని భర్తీ చేయడానికి కృత్రిమంగా చేసే ప్రయత్నంలో సాహిత్యరంగానికి చెందిన రచయితల భాగస్వామ్యం తగినంతగా ఉన్నదా? లేదా? అన్నది ఇక్కడ అవసరమైన ప్రశ్న.

గురజాడ అప్పారావు కానీ, గిడుగు రామ్మూర్తి కానీ వాడుకభాష కోసం జరిపిన ఉద్యమం కేవలం కవిత్వాలూ, కథలూ మాట్లాడేభాషలో రావడం కోసం కాదనీ, మరింత విస్త­ృతమైన ప్రయోజనం కోసమనీ శ్రీశ్రీ కి కూడా పూర్తిగా ఇంకలేదు. శ్రీశ్రీ ఎక్కడ వాడుకభాష గురించి మాట్లాడినా వెంటనే వాడుకభాషలో కవిత్వం రాయడంలోకి మారిపోతారు. గురజాడ, గిడుగు చేసిన వ్యావహారిక భాషోద్యమం లోపరహితమైనదేమీ కాదు. గురజాడ భాషా వ్యాసాల్లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన ఉండదు. ఒక ప్రాంతంలోని 'శిష్ట' జనం మాట్లాడే భాషను ప్రమాణ భాషగా చేయడం ఎంత వరకు సబబు? అన్న ప్రశ్నను వాళ్లు ఎదుర్కొని ఏవో ఇంగ్లండ్‌ ఉదాహరణలతో సమాధానాలు చెప్పారు. అయితే, అన్ని ప్రాంతాల నుంచి వ్యావహారిక భాషలోకి ప్రదానాలుంటాయని, అప్పుడే అది సిసలైన ప్రమాణభాష అవుతుందని గిడుగు రామ్మూర్తి ఆలోచించారు. కానీ, ఆయన సత్‌సంకల్పం చరిత్రను నడిపించలేకపోయింది. ప్రమాణ భాషగా చెలామణిలో ఉన్న అధికారభాషలో రాయడానికి 'వెనుకబడ్డ' ప్రాంతాల రచయితలకు ఇప్పటికీ కష్టంగానే ఉన్నది.

ఒక చారిత్రక అన్యాయానికి తెలియకుండానే కొంత కారకులు అయినప్పటికీ గిడుగు, గురజాడ రాబోయే ఆధునిక సమాజ అవసరాలను తీర్చే ఒక ప్రాథమిక సదుపాయాన్ని అమర్చిపెట్టే కృషి చేశారు. అందు కోసం పోరాడారు. గురజాడ, గిడుగు పేర్లను పదే పదే ప్రస్తావించే శ్రీశ్రీ మాత్రం వచనాన్ని ఒక సాహిత్య ప్రక్రియ కిందికి

Friday, April 16, 2010

ఆవంక కుచంబు గానక

పొట్టలో దూరి పడుకుని
నా పాప బలే తంతుంది
తన్ని
తన్ని
వో
చిన్ని గర్భాశయాన్ని పొదిగింది

రెండు చిన్నారి చేతుల్ని
మెడకి తగిలించి 'నాన్న నాది' అంటుంది
ఆ కరమాల బొడ్డు పేగులా అమరింది

ఆదిమమైన ఆకలితో
అది నా ఎడారి రొమ్ములతో ఆడుతుంది
ఆడి ఆడి రెండు పాలిండ్లను నా ఎదపై అమర్చింది

నన్ను తల్లిని చేసింది నా తల్లి

(రచనాకాలం 1997 )